– వివేకా హత్యకేసు విచారణలో జాప్యానికి, కేసునీరుగారిపోవడానికి, జగన్ రెడ్డి అధికారదుర్వినియోగమే కారణం
– ఏమాత్రం నైతికవిలువలున్నా జగన్ రెడ్డి తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలి
– వివేకాహత్యకేసు విచారణ వేరొక రాష్ట్రానికి మార్చాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, ముఖ్యమంత్రిస్థానంలో ఉన్న జగన్ రెడ్డికి సిగ్గుగా లేదా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యజరిగి 3ఏళ్ల7నెలలైనా నిందితులను పట్టుకోలేకపోవడం, కేసు విచారణలో రాష్ట్రప్రభుత్వం సీబీఐకి సహకరించకపోవడం, ముద్దాయిలకు ఏపీ పోలీస్ వ్యవస్థ అండగా నిలవడం, సీబీఐవిచారణకోరుతూ కోర్టులో వేసిన పిటిషన్ ను జగన్ రెడ్డి వెనక్కు తీసుకోవడం వంటి ఘటనలన్నీ, కేసులోముఖ్యమంత్రి పాత్ర, ప్రమేయాలను ఎత్తిచూపు తున్నాయని, ఈ నేపథ్యంలో ఏమాత్రం నైతికవిలువలుఉన్నా, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన వివరాలు, ఆయన మాటల్లోనే …
“జగన్ రెడ్డి నేత్రత్వంలో రాష్ట్రంలో ఆటవిక, రాక్షసపరిపాలన రాజ్యమేలుతోంది. సుప్రీంకోర్ట్ డివిజన్ బెంచ్ జగన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణపై నేడు స్పందించింది. హత్యకేసు ముద్దాయిలను పట్టుకోవాలన్న ఆలోచన ఏపీప్రభుత్వానికి లేదని వివేకా కుమార్తె సునీత పిల్ దాఖలుచేసింది. సదరు పిల్ లో సునీత వెలిబుచ్చిన అనుమానాలు, అంశాలన్నీ నిజమేనని సీబీఐ కూడా అఫిడవిట్ దాఖలుచేసింది. సాక్షుల్ని, దర్యాప్తు అధికారులను ఇబ్బందిపెట్టడం, అప్రూవర్ దస్తగిరి వేటాడటం, అతని తమ్ముడిని కొట్టికేసులు పెట్టడం, దస్తగిరి కుక్కను చంపడం, ఉద్దేశపూర్వకంగా అతని ఆర్థికమూలాలను దెబ్బతీయడం నిజమేనని సీబీఐ అభిప్రాయపడింది.
హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగితే కేసుకొలిక్కిరాదని, అసలు ముద్దాయిలు బయటపడరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ముఖ్యమంత్రిస్థానంలో ఉన్న వ్యక్తికి సిగ్గుగాలేదా? ఏమాత్రం నైతిక విలువలున్నా జగన్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఆ పదవిలో క్షణంకూడా కొనసాగే అర్హత అతనికిలేదు. హత్యకేసులో అసలుముద్దాయిలు బయటపడకుండా వారిని కాపాడుతున్న అదృశ్యశక్తి మీరేకదా ముఖ్యమంత్రి గారు! వివేకా హత్య జరిగినరోజు ఘటనాస్థలికి వెళ్లిన సీఐ శంకరయ్య, సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి సహకరించాడు.
ఈ క్రమంలో పోలీస్ శాఖ అతన్ని సస్పెండ్ చేసింది. సీబీఐ విచారణ సమయంలో సీఐ శంకరయ్య 164 సీఆర్ పీసీ స్టేట్ మెంట్ ఇస్తానని చెప్పాడు. ఆ సమయంలో ఆనాడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు సీఐశంకరయ్యతో మంతనాలుజరిపడం నిజంకాదా? అతని సస్పెన్షన్ ఎత్తివేయడం, నిబంధనలకు విరుద్ధంగా అతనికిప్రమోషన్ ఇచ్చి, కోరినచోట పోస్టింగ్ ఇవ్వడం వాస్తవంకాదా? హత్యకేసులో సాక్ష్యాలు తారుమారుచేయడానికి ప్రయత్నించిన వ్యక్తికి ఎవరైనా ప్రమోషన్ ఇచ్చి, కోరుకున్నచోట పోస్టింగ్ ఇచ్చి సత్కరిస్తారా?
సీఐ శంకరయ్య హంతకులను పట్టుకునేవారి తరపున పనిచేస్తాడా..లేక హంతకుల తరపున చేస్తాడా? కేసుని దర్యాప్తుచేస్తున్న సీబీఐ అధికారిపై పోలీస్ కేసుపెట్టి, అతన్ని తమదారికి తెచ్చుకోవాలని ప్రభుత్వపెద్దలు ప్రయత్నించింది నిజంకాదా? ఈ కేసులో ముఖ్యమంత్రి నేత్రత్వంలో ముద్దాయిల్ని పట్టుకోవడానికి పాటుపడాల్సిన శంకరయ్య, తానే ముద్దాయిగా మారాడు. 164 సీఆర్ పీసీ స్టేట్ మెంట్ ఇస్తానని సీబీఐకి శంకరయ్యచెప్పిన వెంటనే ముఖ్యమంత్రి భయపడలేదా?
వివేకాహత్యకేసు విచారణలోని ఘటనలన్నింటికీ కారణం ముఖ్యమంత్రేనని రూఢీచేస్తూ, అన్నివేళ్లు ఆయనవైపే చూపిస్తున్నాయి. వివేకా హత్యకేసు విచారణ 3ఏళ్ల7నెలల పాటు నత్తనడకన సాగడానికి ముమ్మాటికీ ముఖ్యమంత్రే కారణం. వివేకాహత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్ వేసిన జగన్ రెడ్డి, తరువాత దాన్ని ఎందుకు వెనక్కు తీసుకున్నాడు? ముద్దాయిలకు శిక్షపడే అవకాశం ఉందనే కదా పిటిషన్ వెనక్కు తీసుకుంది? అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రా… ప్రజాస్వామ్యాన్ని కాపాడతాడా? ప్రజల్ని రక్షిస్తాడా?
దస్తగిరి కి కూడా మొద్దుశీను గతే పడుతుంది…
అప్రూవర్ గా మారిన దస్తగిరికి కూడా మొద్దుశీనుకు పట్టిన గతే పడుతుంది. పోలీస్ వారు కొత్తపెళ్లికొడుకులా చూసుకోవాల్సిన దస్తగిరిని, అతనిప్రాణాలను గాలికివదిలేశారు. అతని ఐస్ ఫ్యాక్టరీకి కరెంట్ కట్ చేయడం, అతని తమ్ముడిని కొట్టి, అతనిపైనే కేసుపెట్టడం, అతని కుక్కను చంపడం ఏమిటివన్నీ? డీజీపీగా బాధ్యతలు చేపట్టింది మొదలు, రాజేంద్రనాథ్ రెడ్డి ఏనాడైనా ఈకేసు విచారణలో సీబీఐకి సహకరించారా? వివేకాహత్య కేసు విచారణను ఈ రాష్ట్రంనుంచి మరోరాష్ట్రానికి బదిలీచేయాలని సీబీఐ కోరిందంటే ఎంతగా ముఖ్యమంత్రి దెబ్బకు భయపడి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. స్వతహాగా వైద్యురాలైన వివేకాకుమార్తె సునీత తనతండ్రిని చంపినవారిని శిక్షించడంకోసం ఢిల్లీలో చెమటలు కక్కుతూ తిరిగిందంటే అందుకు కారణం ముఖ్యమంత్రి కాదా? ఒక అప్పియరెన్స్ కి (ఒకవాదనకి) రూ.50లక్షలు తీసుకునేంతటి లాయర్ ని పెట్టుకునేంత ఆర్థికస్తోమత, కేసులో ఏ5గా ఉన్న శివశంకర్ రెడ్డికి ఉందా? అదే న్యాయవాది తిరిగిప్రభుత్వం తరుపున వాదిస్తాడు. అక్కడే అర్థమవుతోంది.. ముద్దాయిలకు ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధమేంటనేది!
సీబీఐ స్థానిక పోలీస్ కు భయపడి వేరే రాష్ట్రానికి పోతామనిచెప్పడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి. రేపు కోర్ట్ ఆర్డర్ రాకముందే ముఖ్యమంత్రి తనతప్పులు ఒప్పుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వివేకానందరెడ్డి చనిపోయినరోజు జగన్ రెడ్డి బాబాయ్ ని చంపారంటూ చంద్రబాబు, లోకేశ్ ల గురించి తనమీడియాలో నీచాతినీచంగా తప్పుడురాతలు రాయించాడు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా కోర్టులో తాను వేసిన పిటిషన్ ను ఎందుకు వెనక్కు తీసుకున్నాడు? అంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లో సాగిన మాయామశ్చీంద్ర వ్యవహారం. ఈ కేసులో సీబీఐ ముఖ్యమంత్రిని విచారించాల్సిందే. ఆయన్ని విచారించి తగినసమాచారం రాబడితేనే కేసు ముగుస్తుంది” అని రామయ్య తేల్చిచెప్పారు.