-మోడీ,అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవు
-రాజ గోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు
-టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు
-బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగరు
-బీజేపీ కొనుగోలు కుట్రను భగ్నం చేసిన మా ఎమ్మెల్యేలకు సెల్యూట్
– శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్:కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను చూసి ఓర్వలేక…మోడీ,అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ,అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. అమ్ముడు పోయి మునుగోడు ఎన్నిక తెచ్చిన రాజ గోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని,వారు ఉద్యమ కారులని,టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలన్నారు. ఒక్కో ఎమ్మేల్యేకు 100 కోట్లు,కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోబాలతో బీజేపీ కొనుగోలు కుట్రను తిప్పి కొట్టిన మా ఎమ్మెల్యేలకు యావత్ తెలంగాణ ప్రజల పక్షాన సెల్యూట్ అని అన్నారు. బీజేపీ మోడీ,అమిత్ షా కు కేసిఆర్ భయం పట్టుకుందని,వారి ఢిల్లీ పీఠం కదులుతుందనే ఈ కుతంత్రాలకు పాల్పడుతున్నారని మంత్రి వేముల మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేల ను కొంటూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల దోస్తున్న బీజేపీ కి తగినశాస్తి జరుగుతుందని తీవ్రంగా హెచ్చరించారు.
కేసీఆర్ తో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లే:బాల్క సుమన్
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా మంతనాలు సాగిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ముఠా వ్యవహారంపై ఆ పార్టీ యువ నేత, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘాటుగాస్పందించారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌజ్ పై సైబరాబాద్ పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన వ్యవహారంపై బుధవారం రాత్రి సుమన్ స్పందించారు.
సీఎం కేసీఆర్ తో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టేనని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ నేతలు దొడ్డి దారి పట్టారని ఆయన ఆక్షేపించారు. అంగట్లో సరుకులా రాజగోపాల్ రెడ్డి లాంటి వారిని బీజేపీ నేతలు కొనొచ్చేమో గానీ… టీఆర్ఎస్ నేతలను కొనలేరని సుమన్ అన్నారు. టీఆర్ఎస్ నేతలే కేంద్రం కుట్రలను బయటపెట్టారని ఆయన అన్నారు. రూ.100 కోట్లకు పైగా డబ్బుతో పాటు కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. ప్రలోభాలతో చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆగం చేయాలని యత్నించిన బీజేపీ నేతలే ఆగమయ్యారని సుమన్ అన్నారు. చండూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.