-జర్నలిస్టులకు కొనసాగుతున్న ఉపాథి హామీ పథకం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రాలో జర్నలిస్టులకు ‘ఉపాథి హామీ’ పథకం బాగానే అమలవుతోంది. పాలకవర్గాల పల్లకీ మోసే జర్నలిస్టులకు, వారు చేసిన శ్రమదానం బట్టి పదవులివ్వడం చాలా ఏళ్ల నుంచీ జరుగుతున్నదే. పార్టీలు మారినా ఆ పరంపర కొనసాగుతోంది. ఇప్పుడు జగనన్న సర్కారు చేస్తున్నదీ అదే. ఇప్పటికే చాలామంది జర్నలిస్టులు జగనన్న కొలు వులో సేదదీరుతున్నారు.
సలహాదారుల అవతారమెత్తిన వారికి జీతాలు కూడా బాగానే గిట్టబాటవుతున్నాయి. మామూలుగా అయితే ఏ మీడియా సంస్థలో పనిచేసినా జీతం లక్షకు మించదు. అదే సర్కారీ సేవలో తరిస్తే, 3 నుంచి 4 లక్షల వరకూ గిట్టుబాటవుతాయి. మళ్లీ కార్లు, నౌకర్లు, పెర్కులు మన్ను మశానం అంతా కలిపి లక్షల్లోనే ఉంటాయి. ఇక ప్రొటోకాల్ సంగతి సరేసరి.
సహజంగా పార్టీల్లో కష్టపడి పనిచేసిన వారికి, అధికారం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు వరిస్తుంటాయి. వారంతా ఆర్ధికంగా, శారీరకంగా ఎంతో నష్టపోయినందుకు, పార్టీ నాయకత్వాలు వారికిచ్చే బహుమతులవి. కానీ, పార్టీలకూ అనధికార సలహాదారుల్లా పనిచేసి, పార్టీ పల్లకీలను కనిపించి ఒకరు-కనిపించకుండా ఇంకొకరు మోసినందుకు, జర్నలిస్టులకూ నామినేటెడ్ పోస్టులిచ్చే సంప్రదాయం తెలుగునాట చాలా ఏళ్ల క్రితమే మొదలయింది.
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పాల్గొని..ఆంధ్రా-తెలంగాణ విడిపోవాలంటూ, కత్తులు- కటార్లూ తిప్పిన ఉద్యమకారుడయిన దేవులపల్లి అమర్ అనే వశిష్ట పాత్రికేయుడు, మూడేళ్ల నుంచి అదే ఆంధ్రా
సర్కారుకు సలహాదారుగా సేవలందిస్తున్నారు. వైసీపీ అధికార ‘సాక్షి’ మీడియాలో ఆయన శ్రమదానానికి మెచ్చిన జగనన్న, అమరన్నకు జమిలిగా రెండు పదవులిచ్చి గౌరవించారు. ఇప్పుడాయన రెండు పడవల్లో కాళ్లు పెట్టి, సుఖంగా కాలం వెళ్లదీస్తున్నారు.
ఆరకంగా జగనన్న సర్కారు జర్నలిస్టులను ఉపాథి హామీ పథకంతో సత్కరిస్తోంది. మంచిదే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, తమవారికి పీఆర్వో ఉద్యోగాలిచ్చి సత్కరించినట్లే.. వైసీపీ కూడా తన వారికి, అవే ఉద్యోగాలిచ్చి ‘పనికి ఆహారపథకాన్ని’ విజయవంతంగా కొనసాగిస్తోంది.
ఇక తాజాగా ప్రఖ్యాత జర్నలిస్టు కమ్ వ్యాఖ్యాత కమ్ విశ్లేషకుడు కమ్ జగన్ వీరాభిమాని అయిన కొమ్మినేని శ్రీనివాసరావును, జగనన్న సర్కారు ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవితో సత్కరించింది. జర్నలిస్టులకు ఇది ‘కమ్మ’ని కబురే. ఎందుకంటే ఇప్పటివరకూ జగనన్న సర్కారు.. రెడ్డి-బ్రాహ్మణ జర్నలిస్టులను తప్ప, కమ్మ జర్నలిస్టులను పట్టించుకున్న దాఖలాలు లేవు. చంద్రబాబు జమానా తర్వాత, ప్రభుత్వంలో కమ్మ జర్నలిస్టులు వెలిగిన దాఖలాలు లేవు. అసలే కమ్మ సామాజికవర్గం అమరావతి కోణంలో, జగనన్న సర్కారుపై అసంతృప్తితో రగిలిపోతోంది.
ఈ నేపథ్యంలో వైసీపేయులకు నిత్యం ఆనందం కలిగిస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ ‘కమ్మ’టి విశ్లేషణ చేసి, జగనన్న అభిమానుల కడుపునింపే కొమ్మినేనికి.. ప్రెస్ అకాడెమీ పదవి ఇవ్వడం ద్వారా, ఆ కులం వారి పెదవులపై జగనన్న చిరునవ్వులు పూయించినట్లే లెక్క. అయితే.. కమ్మ కులానికి చెందిన కొమ్మినేనికి పదవి ఇస్తే, రాష్ట్రంలోని కమ్మవారందరికీ ఇచ్చినట్లు కాదు కదా? ఈ వార్త వైసీపీలోని కమ్మవారికి కమ్మటికబురేమో గానీ, టీడీపీలోని కమ్మవారికి కమ్మనివార్త కాదు కదా అని ప్రశ్నిస్తే.. దానికి జవాబు చెప్పడం కష్టం.
ఏమాటకామాట. కొమ్మినేని కష్టానికి, టీడీపీపై ఆయన చేసిన యుద్ధానికి, ఆయన చేస్తున్న శ్రమదానంతో పోలిస్తే ఈ పదవి చిన్నదే. నిజానికి ఆయనను ఎప్పుడో వరించాల్సిన హోదా ఇది. మూడున్నరేళ్లు ఆలస్యమైనా, ఆయనకు తగిన పదవి ఇది. ఇప్పటికే అధికార పార్టీ మీడియాలో, రాళ్లెత్తిన కలం కార్మికులకు సర్కారు తగిన ప్రతిఫలం అందిస్తోంది. ఆ పరంపరలో కొమ్మినేని వారు కొలువు దీరడంలో పెద్ద వింతేమీ లేదు. అయినా కొమ్మినేని పరాయివాడేమీ కాదు కదా?!
పైగా కొమ్మినేని స్వతహాగా ఆంధ్రావాడే కాబట్టి, ఆంధ్రా-తెలంగాణ ఉద్యమంలో ఆయనేమీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి, నిర్మొహమాటంగా ఆ పదవి తీసుకోవచ్చు. అయినా.. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దేవులపల్లి అమర్ వంటి ఫక్తు తెలంగాణవాది.. ఎలాంటి శషభిషలు లేకుండా, లోకం విమర్శలు పట్టించుకోకుండా, నిర్భయంగా జగనన్న కొలువులో చేరగా లేనిది.. ఫక్తు ఆంధ్రావాడయిన కొమ్మినేని చేరితే, తప్పేమీలేదన్నది సీనియర్ జర్నలిస్టుల ఉవాచ.
ఇప్పుడు దేవులపల్లి అమర్, గతంలో రామచంద్రమూర్తి వంటి ప్రముఖులను ‘లబ్థిదారులు’గా ఎంపిక
చేసిన జగనన్న సర్కారు.. ఆ స్థాయిలో ఇప్పుడు కొమ్మినేనికి పెద్దపీట వేయడం, జర్నలిస్టు లోకాన్ని గౌరవించడమే. మధ్యలో పాలకుల పోకడ నచ్చక రామచంద్రమూర్తి మధ్యలోనే నిష్ర్కమించినా, దేవులపల్లి అమర్,కొమ్మినేనికి అలాంటి పట్టింపులు, శషభిషలు ఉండకపోవచ్చు. అందుకే అమరన్న ఇంకా తన సర్కారీ సేవలను నిరంతరం విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
బహుశా కొమ్మినేని కూడా రామచంద్రమూర్తి మాదిరిగా ఆత్మగౌరవం- ఆవకాయ లాంటివి ఆలోచించకుండా, ఎంచక్కా అమరన్న మాదిరిగా తన పదవీకాలాన్ని పూర్తి చేస్తారన్నది, ఆయన కాలపు జర్నలిస్టుల ఉవాచ. తనకు అప్పగించిన పని, దాని మంచి చెడ్డల గురించి చర్చించేందుకు.. జగనన్న సమయం ఇవ్వకపోవడంతో చిరాకుపడిన రామచంద్రమూర్తి, తన పదవికి రాజీనామా చేశారన్నది అప్పట్లో నడిచిన చర్చ. అయితే అమరన్న, కొమ్మినేనికి జగన్ అపాయింట్మెంట్ ఇచ్చినా-ఇవ్వకపోయినా ఫర్వాలేదు కాబట్టి సమస్య ఉండదు.
ఇక కొమ్మినేని సారధ్యంలో ఏపీ ప్రెస్ అకాడెమీ, దేదీప్యమానంగా వెలగబోతోందన్నమాట. మీరంతా మా మాదిరిగానే జగనన్న కీర్తన చేస్తే, సమస్యలు పరిష్కారమవుతాయని సమాచారశాఖ మంత్రి తొలిరోజుల్లో సెలవిచ్చి, జర్నలిస్టులకు ఒక దారి చూపారు. మరి కొమ్మినేని కూడా, పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏమి సెలవిస్తారో చూడాలి.