– టీడీపీ-ఎల్లో మీడియా తోడు దొంగలు..
-ఉచిత పంటల బీమా అమలులో దేశానికే ఏపీ రోల్ మోడల్
– నూటికి నూరు శాతం ప్రీమియం భరిస్తూ.. పంటల బీమా చెల్లిస్తున్న రాష్ట్రం ఏపీనే
– వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న సీఎం జగన్
– రైతుల్ని రెచ్చగొట్టేలా ఈనాడు రాతలు
– ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు టెండర్లు పిలిచాం
– మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి
రైతు కోసం ఎంతో చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి టీడీపీ – ఎల్లో మీడియా పనిగట్టుకుని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్థన రెడ్డి మండిపడ్డారు. వీరికి పవన్ కల్యాణ్ వంతపాడుతూ, వారికి తానాతందానా అంటున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు-పవన్ కల్యాణ్ లు రాష్ట్రానికి రాహు-కేతువుల్లా తయారై, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని కాకాణి మండిపడ్డారు. ప్రీమియంకు సంబంధించి, ఒక్క రూపాయి కూడా రైతుల దగ్గర నుంచి తీసుకోకుండా, ఉచిత పంటల బీమా అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఆ విషయాన్ని ఏనాడూ రాయని ఎల్లో ఈనాడు, ‘బీమా ఆశలపై నీళ్ళు..’అంటూ కొంతమందికి బీమా సొమ్ము అందలేదంటూ రాతలు రాయడాన్ని మంత్రి కాకాణి తప్పుబట్టారు. ఇదే ఈనాడు గతంలో అనర్హులైన రైతులకు బీమా సొమ్ములు ఎలా ఇస్తారని రాతలు రాసిందని, ఇప్పుడు అర్హులైన రైతులను గుర్తిస్తుంటే.. అనర్హులకు అందలేదని మళ్ళీ అడ్డగోలు రాతలు రాయడం ఈనాడు రామోజీకే చెల్లిందని విమర్శించారు. రైతుల నుంచి ఒక్క నయా పైసా తీసుకోకుండా పూర్తిగా ఉచిత పంటల బీమాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా తోడు దొంగలుగా తయారై.. ప్రభుత్వంపై బురదచల్లుతున్నారని మండిపడ్డారు. మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
రైతుల్ని రెచ్చగొట్టేలా ఈనాడు రాతలు
భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా వసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక పథకం ప్రకారం టీడీపీ తన అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేస్తుంది. అందులో భాగంగానే ఎల్లో మీడియాలో రోజూ పుంఖానుపుంఖాలుగా తప్పుడు కథనాలు రాస్తున్నారు. అవన్నీ ప్రభుత్వంపై బురదచల్లటానికి పనిగట్టుకుని రాసే కథనాలే తప్ప అందులో ఎలాంటి పస లేదని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. దాంతో ప్రతి రోజూ కొత్త ఎత్తుగడతో ఎల్లో శక్తులన్నీ పనిచేస్తున్నాయి. వ్యవసాయరంగాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ‘బీమా ఆశలపై నీళ్ళు..’అంటూ ఈనాడు పత్రిక రైతులకు బీమా పరిహారం అందటం లేదని ఇవాళ కూడా ఓ కథనాన్ని వండి వడ్డించింది. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ప్రతిసారి వివరణ ఇస్తున్నాం. కానీ, అవే తప్పుడు రాతలు పదే పదే రాస్తున్నారు. గతంలోనూ బీమాపై ఇలాంటి వార్తలే ఈనాడు రాసింది. హెడ్డింగ్ ఒకటి… లోపల రాసేది మరొకటి. లోపల రాసిన వార్తకు ఎటూ గ్రావెటీ ఉండదు కాబట్టి.. హెడ్డింగ్ తోనే ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలు ఈనాడు చేస్తుంది.
ఉచిత పంటల బీమా అమలులో దేశానికే ఏపీ రోల్ మోడల్
రైతులపై ఎటువంటి భారం పడకుండా… పూర్తి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తూ.. ఉచిత పంటల బీమాను అమలు చేస్తోంది. వాస్తవానికి, గతంలో నిర్ధారించిన ప్రీమియంలో 25శాతం రైతులు కట్టాల్సి ఉంటే, మిగిలినదాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేలా విధివిధానాలు ఉండేవి. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదే ఒక్క రూపాయి ప్రీమియంతో ఇన్సూరెన్స్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఈ క్రాప్ విధానం అమలులోకి రావడంతో, రెండో ఏడాది నుంచి ఆ రూపాయి కూడా చెల్లించనక్కర్లేకుండా ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్నాం. మన తర్వాత, రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ విధానాన్ని భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అమలు పరిచాయి. ఉచిత పంటల బీమా అమలులో ఏపీ రోల్ మోడల్ గా నిలిచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి.. దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయాలని సూచించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగస్వామ్యమైంది. అయినప్పటికీ ఒక్క రూపాయి కూడా రైతులు ప్రీమియం చెల్లించకుండా, రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమాను అమలు చేయనుంది.
గత తెలుగుదేశం ప్రభుత్వం పంటల బీమాను ఎగవేసినా, ఇన్ పుట్ సబ్సిడీలను ఎగవేసినా.. ఇదే ఈనాడు రామోజీ కళ్ళకు కనిపించవు. వినిపించవు. 2014-2019 మధ్య గత తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు పంటల బీమా ఎగనామం పెట్టింది. గత ప్రభుత్వం ఇవ్వకుండా బకాయిలు పెట్టిన వాటిని కూడా మా ప్రభుత్వం రెండు విడతల్లో రూ. 716 కోట్లు చెల్లించింది. వాస్తవాలు ఇలా ఉంటే.. ఫిర్యాదులు వచ్చాయని అడ్డగోలుగా వార్తలు రాయడం దుర్మార్గం. రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకుంటున్న మా ప్రభుత్వాన్ని గందరగోళ పరిచే ప్రయత్నాలను ఇకనైనా మానండి.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు టెండర్లు పిలిచాం
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు టెండర్లు పిలిచాం. ఆ ప్రక్రియ చివరిదశలో ఉంది. ఖరీఫ్ లో సాధారణంగా తుఫానులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున రైతులు పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. దానికి బీమా వర్తిస్తుంది. అదే రబీలో నష్టపరిహారం అనేది ఉండదు. ఇన్ పుట్ సబ్సిడీ మాత్రమే వర్తింస్తుంది. దాన్ని కూడా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ నష్టపరిహారం ఇవ్వలేదంటూ కథనాలు రాయడం దుర్మార్గం. ఎప్పుడూ జరగనివన్నీ.. ఇప్పుడే జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయడం, లేని సమస్యను ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఈ ఏడాది ఖరీఫ్ కు, రబీకి పంట నష్టపరిహారం అందుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ద్వారా ప్రీమియంకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశాం. పంట దిగుబడిని బట్టి ఒక పద్ధతి, వాతావరణ పరిస్థితిని బట్టి మరో పద్ధతిలో బీమా వర్తిస్తుంది.
టీడీపీ-ఎల్లో మీడియా తోడు దొంగలు
అబద్ధాలు, అసత్యాలతో రోజూ అడ్డగోలుగా వార్తలు రాస్తున్న ఓ వర్గం మీడియా సంస్థలను సూటిగా అడిగే ప్రశ్న ఒక్కటే. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వందల కరువు మండలాలు ప్రకటించారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక అలాంటి పరిస్థితి రాలేదు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో పంటల పండుతున్నాయి. కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరం కూడా రాలేదు. దీనిపై మీరు ఎప్పుడు అయినా, మీ దినపత్రికల్లోగానీ, మీ టీవీ ఛానళ్ళల్లోగానీ రాసిన, చూపించిన సందర్భాలు ఉన్నాయా? అని అడుగుతున్నాం. కరువు మండలం అనేది లేకుండా ఉందంటే ముఖ్యమంత్రిగారి పాలనకు ప్రకృతి కూడా ఏవిధంగా సహకరిస్తోందనేది చెప్పుకోవాలి. ఏ గణాంకాలు తీసుకున్నా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సరాసరి, సగటున ప్రతి ఏడాది14 లక్షల టన్నుల ధాన్యం అధికంగా దిగుబడి వస్తోంది. ఏదైనా ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వడం ముఖ్యమా? లేక.. 70 శాతం చేశామని, 80 శాతం చేశామని డప్పాలు కొట్టుకోవడం ముఖ్యమా?. లేక ప్రాజెక్ట్ లు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇచ్చామనే క్రెడిట్ తీసుకుంటారా?. ఎల్లో మీడియాలో వస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలు ఎప్పుడైనా చూశామా? విన్నామా? . మీ వైఖరి ఎలా ఉందంటే మేము రాసే వార్తల్ని కనీసం పదిశాతం మంది అయినా నమ్మక పోతారా అనేలా ఉంది. తెలుగుదేశం పార్టీకి రైతు ప్రయోజనాలు అవసరం లేదు. కేవలం స్వార్థ, స్వప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. మీడియా అనేది వార్తల్ని, వాస్తవాల్ని ప్రజలకు చేరవేయాలేగానీ.. వాస్తవాలను పక్కనపెట్టి, ఎలాగోలా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే, ఆ ముసుగులో తాము కూడా దోపిడీకీ పాల్పడవచ్చనే దుర్మార్గపు ఆలోచనలతో ముందుకు వెళుతున్నాయి.
తన స్వలాభాన్ని మాత్రమే చూసుకునే రామోజీరావుకు .. వయసు మీద పడినా, నీచమైన రాతలు రాయించడం దుర్మార్గం. మీరు ప్రెస్ మీట్ పెట్టండి మేము కథనాలు రాస్తాం, లేకుంటే మేము కథనాలు రాస్తే .. మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి.. అనేలా టీడీపీ, ఎల్లో మీడియా తోడు దొంగలుగా తయారయ్యాయి. రాష్ట్రానికి పట్టిన శని, పీడ, ఖర్మ కాకుంటే నారా లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటమా?.
ఏపీకి రాహు-కేతువుల్లా బాబు-పవన్
మరోకాయన పూటకో వేషం వేసుకుని వచ్చి వ్యవసాయం గురించి మాట్లాడతాడు. కౌలు అంటే ఏంటి, వ్యవసాయం అంటే ఏంటో చెప్పగలవా?. పది పంటలు చూపిస్తే అందులో అయిదు పంటలను కూడా గుర్తుపట్టలేని పవన్ కల్యాణ్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడమా?. ఇది దౌర్బాగ్యం అనుకోవాలా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆంధ్రరాష్ట్ర రైతులకు రాహు,కేతువుల్లా దాపురించారు. పవన్ కల్యాణ్ .. రైతులకు మేలు చేయాలని కాదు. చంద్రబాబుకు మేలు చేయాలనే వ్యవసాయం మీద రాద్ధాంతం. నిజంగా రైతుల సమస్యలు ఉంటే వాటిని పారదర్శకంగా రాస్తే వాటిలో ఉన్న లోపాలు, లోటుపాట్లును సరిదిద్దుకోవడానికి విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేనివాటిని ఉన్నట్లుగా చిత్రీకరించే వ్యవహారమే తప్ప మరొకటి లేదు.
జగన్ మోహన్ రెడ్డిగారు ఉత్తుత్తి బటన్ నొక్కుతున్నారంటూ వార్త రాశారు. దానిపై వివరణ ఇచ్చాం. మంత్రి కాకాణి బొంకారని, ఇంకా 78వేల మందికి డబ్బులు పడలేదని వార్త రాశారు. ఆ వార్త చూస్తే వారి ముఖాన రైతులు ఉమ్మేస్తారనే ఆలోచన కూడా లేదు. మా ముఖ్యమంత్రిగారు బటన్ నొక్కి 52 లక్షల మందికి రైతు భరోసా ద్వారా నగదు జమ చేస్తే.. ఎల్లో మీడియా మాత్రం ఉత్తుత్తి బటన్ నొక్కారని రాశాయి. దీన్ని బట్టే మీ నైజం, మీ శైలి ఏవిధంగా ఉందనేది బహిర్గతం అయింది. 98 శాతం మంది ఖాతాల్లో నగదు జమ అయ్యి, ఒక శాతమో, అర శాతం మందికో పడకపోతే.. అది ఉత్తుత్తి బటనా..?. మా ప్రభుత్వం రైతులకు అన్నివిధాల అండగా ఉంటుంది. పత్రికలు అనేవి రైతులను చైతన్యపరిచేలా ఉండాలే తప్ప, వారిని రెచ్చగొట్టే ధోరణిలో వార్తలు రాయడం సరికాదు. రామోజీరావు ఇంతగా దిగజారిపోతుంటే పత్రికలు, పాత్రికేయ విలువలు ప్రశ్నార్థకంగా మారాయి.
– తన స్వార్థ ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టాలనే ఆకాంక్షతోనో ప్రభుత్వం మీద బురదచల్లే కార్యక్రమం చేస్తుంటే… మా ప్రభుత్వం చేసేవీ చెప్పాలి, మీరు చేసే పొరపాట్లు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో జరిగే పొరపాట్లు ప్రశ్నించాల్సిన పత్రికల గురించి, ఆ పత్రికలు చేసే పొరపాట్లు గురించి మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం.
మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది కాబట్టే మీరు రాసింది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు రాసినందువల్ల రైతులకు మేము చేస్తున్న కార్యక్రమాలను వివరించే అవసరం, అవకాశం కలిగింది. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలహీనపరచాలి, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని, చంద్రబాబుకు భజన చేసేలా ఎల్లో మీడియా పనిచేస్తోంది. సుదీర్ఘకాలం పాత్రికేయ వృత్తిలో ఉన్న రామోజీరావు రాయాల్సిన రాతలు ఇవి కావు. రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో వ్యవసాయం పండుగలా మార్చడం కోసం మా ప్రభుత్వం అన్నివిధాల పనిచేస్తోందని మంత్రి కాకాణి చెప్పారు.