-వేలం పాట ద్వారా సత్తుపల్లిలోని కోయాలగుడెం – lll కోల్ బ్లాక్ ను ఔరో కోల్ ప్రైవేట్ సంస్థకు ఆగస్ట్ 10 న అప్పగించిన కేంద్ర ప్రభుత్వం
-కోల్ బ్లాక్స్ లేకుంటే సింగరేణి సంస్థ ఏం పని చేయాలి – మూత పడుతుంది కదా
-రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణిని కావాలనే నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
-సింగరేణి సంస్థను చంపేందుకే కేంద్ర ప్రభుత్వ భారీ కుట్ర
-అందుకే కోల్ బ్లాక్స్ ను వేలం వేస్తున్న కేంద్ర ప్రభుత్వం
-కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోల్ బ్లాక్స్ ను సింగరేణి సంస్థకు అప్పగించండి
-కోల్ బ్లాక్స్ ను వేలం వేసే పనులకు స్వస్తి పలకండి
-ఇంత చిన్న వాస్తవం తెలియని వ్యక్తి బిజెపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేసి, నిర్వీర్యం చేసి చంపేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేస్తోందని, కానీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మాత్రం ఈ కుట్ర ఎందుకు అర్థం కావడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు.
సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కోల్ బ్లాక్స్ ను వేలం పాట ద్వారా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు స్పష్టంగా ముందుకు వెళుతోందని వినోద్ కుమార్ తెలిపారు.
ప్రైవేటీకరణకు, వేలం పాటకు మధ్య ఉన్న తేడాను ముందు బండి సంజయ్ తెలుసుకోవాలని, ఈ విషయం తమకు స్పష్టంగా తెలుసు అని వినోద్ కుమార్ అన్నారు.
సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు భాగంగానే ఆగస్ట్ 10 వ తేదీ 2022 నాడు నిర్వహించిన వేలం పాటలో ఔరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సత్తుపల్లిలోని కోయలగూడెం – lll కోల్ బ్లాక్ ను అప్పగించిన వాస్తవాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గమనించాలని వినోద్ కుమార్ సూచించారు.
రాష్ట్రానికి చెందిన ప్రతిష్టాత్మక సింగరేణి సంస్థకు కోల్ బ్లాక్స్ ఇవ్వకుండా వేలం పాట వేయడంలో దాగి ఉన్న మర్మం ఏమిటో స్పష్టం చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
కోల్ బ్లాక్స్ లేకుండా సింగరేణి సంస్థ ఏం చేయాలి అని ఆయన ప్రశ్నించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సుమారు 50,000 మంది కార్మికులు ఉద్యోగులను రోడ్డున పడవేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడుతోందని వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.
ప్రైవేటీకరణ పదం వాడకుండా వ్యూహాత్మకంగా కోల్ బ్లాక్స్ వేలం వేసి సింగరేణి సంస్థను నీరు గార్చుతున్నారని వినోద్ కుమార్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోల్ బ్లాక్స్ ను సింగరేణి సంస్థకు అప్పగించాలని.. కోల్ బ్లాక్స్ ను వేలం వేసే పనులకు స్వస్తి పలకాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయబోమని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూనే.. మరోవైపు కోల్ బ్లాకులను వేలం వేయడం ద్వారా సింగరేణి సంస్థకు ఆ కోల్ బ్లాకులు దక్కకుండా ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించుతున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు.
కోల్ బ్లాకులు లేకుంటే సింగరేణి సంస్థ ఏం పని చేయాలని వినోద్ కుమార్ ప్రశ్నించారు. బొగ్గు గనులు అందుబాటు లేకుంటే సింగరేణి సంస్థ మూతపడే ప్రమాదం ఉందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 82 కోల్ బ్లాకులు ఉండగా, అందులో సింగరేణి సంస్థ 40 కోల్ బ్లాకులను వినియోగిస్తున్నదని వినోద్ కుమార్ తెలిపారు. మిగిలిన 42 కోల్డ్ బ్లాకులను కూడా సింగరేణి సంస్థకు అప్పగించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం తాము కోల్ బ్లాకులను వేలం వేస్తున్నామని, బహిరంగ వేలంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో సింగరేణి సంస్థ పోటీపడి వాటిని దక్కించుకోవాలని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అటు పార్లమెంటు నిండు సభలో, ఇటు బహిరంగ ప్రకటన ద్వారా పదేపదే చెబుతున్నారని, దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిజెపి రాష్ట్ర నాయకులు జవాబు చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి లు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు, కోల్ బ్లాకులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు స్పష్టంగా చేతల ద్వారా తెలుపుతున్న ఈ వాస్తవం మాత్రం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎందుకు అర్థం కావడం లేదని వినోద్ కుమార్ సూటిగా ప్రశ్నించారు.