మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది బాలికలను ఒక్క చోటకు చేర్చారు. సమాజంలో రాణించేందుకు అవసరమైన ఏకాగ్రత, ఆత్మరక్షణ, నిబ్బరం, చైతన్యం వంటి అంశాలలో శిక్షణ ఇస్తున్నారు. బాలికా శక్తి సంగమం శిబిరాన్ని విద్యాపీఠం దక్షిణమధ్య క్షేత్రం అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు ఐఎఎస్ (రిటైర్డ్), తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ.తిరుపతిరావు, భారతీయం నిర్వాహకులు సత్యవాణి ప్రారంభించారు. విద్యాభారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారి లింగం సుధాకర్ రెడ్డి కీలక ప్రసంగం చేసి, విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
విద్యార్థులను ఉత్తేజ పరిచేందుకు వివిధ వృత్తులలో ఉన్నత స్థానాల్లో నిలిచిన మహిళలతో సమాలోచనలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ, అనేక మంది మహిళలు ఉన్నత శిఖరాలకు చేరుకొన్నారని సమయం డిజిటల్ ఎడిటర్ అమృత విశ్లేషించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా అనేక మందిని ఉదాహరణగా చెప్పుకోవచ్చని వివరించారు. విద్య అంటే బట్టీలు, మార్కులు మాత్రమే కాదని సర్వతో ముఖాభివృద్ది ముఖ్యం అని ఆమె వివరించారు. ఈ దిశగా చదువుకొంటే నైపుణ్యాలు సాధించుకోవచ్చని, అంతిమంగా మెరుగైన స్థితికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. జీవితంలో సక్సెస్ కావాలంటే శ్రద్ధ, ఆసక్తి ముఖ్యం అని, ఏ రంగాన్ని ఎంచుకొన్నా శ్రద్ధ పెట్టి పనిచేస్తే విజయాలు సాధించవచ్చని అమృత వివరించారు. సక్సెస్ కు షార్ట్ కట్స్ లేనే లేవని, మహిళలు మల్టీ టాస్కింగ్ లోనూ రాణించగలరని వివరించారు.
ఇటువంటి బాలికా శిబిరం వంటి కార్యక్రమాలతో బాలికల్లో నిమిడీకృతమైన శక్తిని వెలికితీయటం సాధ్యం అవుతుందని చైల్డ్ హెల్ప్ కమిషన్ సభ్యులు అపర్ణ, ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ నీరజ, హెచ్ ఆర్ డీ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ అభిప్రాయ పడ్డారు. బాలికలను చైతన్య పరచటం ద్వారా సమాజానికి విలువైన శక్తిని అందించ గలుగుతామని, అంతిమంగా దేశ పురోగతికి దోహద పడుతుందని వివరించారు.
బాలికా శక్తి సంగమం కార్యక్రమంలో పథ సంచలనం కన్నుల పండువగా సాగింది. వేలాది బాలికలు బారులు తీరుతూ నగర వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బాలికాశక్తి సంగమం కార్యక్రమాన్ని విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు, బాలికా విద్యా ప్రముఖ్ లక్ష్మీ, శిశువాటికా ప్రముఖ్ ఉమ సమన్వయం చేశారు.