-ఎస్పీ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు.? ఐపిఎఎస్ అధికారుల సంఘం ఉంది కదా?
– “ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్” ఎస్పీ వ్యవహార శైలిపై స్పందించాలి
– మీ జీతాలు ప్రతినెలా ఒకటో తారీఖున వచ్చేటట్లు చూసుకోండి.
– అధికార పార్టీకి ఎస్పీ కొమ్ముకాస్తున్నది నిజం కాదా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ వారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుత ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ గా మీరు కానిస్టేబుళ్ల దగ్గర నుంచి సర్కిల్ ఇన్పెస్టర్ల వరకు వారి సంక్షేమం గురించి మాట్లాడవలసి ఉండగా, ఎస్పీ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు.? ఐపిఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడానికి ఐపిఎఎస్ అధికారుల సంఘం ఉంది కదా? వారెందుకు మాట్లాడటం లేదు? ఐపిఎస్ అధికారుల సంఘానికి పల్నాడు ఎస్పీ పక్షపాత వైఖరి బాగా తెలుసు. అందుకే వారు మాట్లాడటం లేదు.
మాచర్లలో 16 వ తారీఖున తెదేపా చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమం పోలీసులకు ముందస్తుగా తెలియదని చెప్పడం చాలా అన్యాయం. రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో, ప్రతీ పట్టణంలో ఇదే ఖర్మ కార్యక్రమం జరుగుతున్న విషయం రాష్ట్ర పోలీసులందరికీ తెలుసు. మాచర్లలో ఇదేం ఖర్మ కార్యక్రమం ఉందనే పోలీసులు పట్టణంలో కార్డాన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం ఇదేం ఖర్మ కార్యక్రమానికి ముందే అధికారపార్టీ చల్లా మోహన్ రావు పట్టా కత్తితో స్వైరవిహారం చేస్తే మీ పోలీసులు అతన్ని ఎందుకు కంట్రోల్ చేయలేదు.
తెదేపా వారి ఇదేం ఖర్మ కార్యక్రమం జరుగుతుంటే వైకాపా వారిని ఎందుకు అనుమతించారు? వారిని ఎందుకు ముందస్తు అరెస్టు చేయలేదు? అయినదానికి కానిదానికి తెదేపా వారిని గృహనిర్భంధం అంటూ ముందస్తు అరెస్టులంటూ నిర్భందించే పోలీసులు ఆ రోజు వైకాపా వారిని యదేచ్చగా ఎందుకు రోడ్డుపైకి వదిలారు? దాదాపు మూడున్నర గంటలు వైకాపా వారు ఇళ్లపై పడి దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించింది నిజంకాదా?
రెండు కార్లు తగులబెట్టి, 5 కార్లు పూర్తిగా ధ్వంసం చేసి పలు మోటారు సైకిళ్లు పగులగొట్టి తెదేపా ఇళ్లపై దాడులు చేసి, ఇళ్లల్లోని డబ్బు, బంగారం కొట్టేసి, అపార్ట్ మెంటులో పార్కు చేసిన కార్లు పగులగొట్టి, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టి, కర్రలు, కత్తులు పదునైన రాళ్లతో తెదేపా వారిపై దాడి చేస్తే మీ ఎస్పీకి అవి చిన్న, చిన్న సంఘటనలా కనపడతాయా?
దీనికి మీ సంఘం ఏం సమాధానం చెబుతుంది? మీ ఎస్పీ ఉద్దేశం ఏంటి? పదిపదిహేను మంది తెదేపా వారిని హత్య చేయాలనా? అప్పుడు పెద్ద సంఘటనగా పరిగణిస్తాడా? నిస్పందేహంగా పల్నాడు ఎస్పీ పక్షపాత దోరణితో అధికారపార్టీకి వత్తాసు పలుకుతున్నాడన్నది నిర్వివాద అంశం. మొమ్మాటికి నిజం. సంఘటన జరిగి వారం రోజులైనా దాడి చేసిన ఒక్క వైకాపా దుండగుడిని కూడా అరెస్టు చేయకపోవడం ఎస్పీ పక్షపాత దోరణికి నిదర్శనం. సెక్షన్ 144 మిషతో మాచర్లలో బాధితులైన తెదేపా వారిని పరామర్శించడానికి తెదేపా నాయకులను మాచర్లకు అనుమతించకుండా స్థానిక ఎమ్మెల్యేను, అధికార పార్టీ నాయకులను యదేచ్చగా తిరగనిస్తున్న ఎస్పీ వైఖరి సమర్ధనీయమా?
అధికార పార్టీకి ఎస్పీ కొమ్ముకాస్తున్నది నిజం కాదా? అటువంటి ఎస్పీ వ్యవహార శైలిని చంద్రబాబు , పార్టీ ముఖ్యనేతలు తప్పుపట్టడంలో తప్పేముంది? ఇప్పటికైనా మీ సంఘ సభ్యుడికాని ఎస్పీ గురించి మీరు మాట్లాడకుండా, సంబంధిత సంఘమైన “ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్” ఈ కళంకిత ఎస్పీ వ్యవహార శైలిపై స్పందించాలని కోరుతున్నాను. అవగాహన లేకుండా మా అధినేత చంద్రబాబును తప్పు పట్టిన మీరు, మీ సంఘం పరిధులు గుర్తించి, మీ జీతాలు ప్రతినెలా ఒకటో తారీఖున వచ్చేటట్లు చూసుకోండి.
10 నెలల నుంచి ప్రభుత్వం మీకు టిఏ మరియు డీఏలు ఇవ్వడం లేదు. దాని గురించి అడగండి. మీ సరెండర్ లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ఆగిపోయింది. దాని గురించి అడగండి. అడిషనల్ సరెండర్ లీవ్, ఎన్ క్యాష్ మెంట్ లేదు. దాని గురించి ప్రశ్నించండి. మీకు యూనీఫాం అలవెన్సు బకాయి ఉన్నది. దాని గురించి అడగండి.
ఎందరో సిఐలు, ఎస్.ఐలు వేకెన్సీ రిజర్వ్ (వీఆర్) లో ఉంటూ జీతాలు లేక కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు. వాటి గురించి ప్రశ్నించండి. అది మీ సంఘం బాధ్యతని గుర్తించండి. ఎన్నో సంవత్సరాలుగా మీ సంఘానికి ఎన్నికలు లేవు. త్వరలో ఎన్నికలు నిర్వహించమని డీజీపీని అడగండి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ప్రభుత్వం స్పందించి ఎస్పీ రవిశంకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, దీని తెర వెనుక కథ నడిపిస్తున్న ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ సీతారామాంజనేయులను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.