న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన బార్ కౌన్సిల్ చైర్మన్, సభ్యులు
హైదరాబాద్, డిసెంబర్ 24: న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి తగినంత సహకారం అందిస్తామని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు . అరణ్య భవన్ లో శనివారం న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, ఇతర కౌన్సిల్ సభ్యులు కలిసి, న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధికి ప్రతి ఏడాదికి రూ. 10 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని, దీని వల్ల ఫండ్ లోని సభ్యులకు, మరణించిన న్యాయవాదుల కుంటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రికి వివరించారు.
అలాగే మరణించిన న్యాయవాది యొక్క నామినీకి న్యాయవాదుల సంక్షేమం నిధి ద్వారా రూ. 4 లక్షలు చెల్లిస్తున్నామని, ప్రభుత్వం తరపున అదనంగా మరో రూ. 4 లక్షలు చెల్లించాలని, అంతేకాకుండా వెల్ఫెర్ ఫండ్ స్టాంప్ లను ప్రభుత్వ న్యాయవాదులు (లా అఫీసర్స్) అతికించడం లేనందున న్యాయవాదుల సంక్షేమ నిధికి సంవత్సరానికి రూ. 10 కోట్లు మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు మూడు సంవత్సరాల కాల పరిమితికి గానూ ప్రతీ నెల రూ. 5000 ఉపకార వేతనం చెల్లించేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి… న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ఈ అంశాలను సీయం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హమీనిచ్చారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా మొట్టమొదటిసారిగా న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని, నిధుల నిర్వహణ బ్యాధతను అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు అప్పగించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ట్రస్ట్ ద్వారా వేలాది మంది న్యాయవాదులకు ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నామని, కరోనా సమయంలో 15వేల మందికిపైగా అడ్వకేట్లు, క్లర్కులకు రూ.25కోట్లును సహాయంగా అందించామని తెలిపారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వారిలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్ రావు, రాజేందర్ రెడ్డి, అనంతసేన్ రెడ్డి, కొండారెడ్డి, జితేందర్ రెడ్డి, ఫణీంద్ర భార్గవ్, ముఖీద్, మధుసుదన్ రావు, జనార్ధన్, రామారావు, పాలకుర్తి కిరణ్, భుజంగరావు, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్ పాల్గొన్నారు.