Suryaa.co.in

Andhra Pradesh

రావిని ఇప్పుడెదుర్కోవడం అంత “ఈజీ కాదు”

– టిడిపికి కలిసి రాని కొత్త అభ్యర్థుల ఫార్ములా
– గుడివాడలో పూర్వవైభవం దిశగా తెలుగుదేశం పార్టీ
– టిడిపి అధిష్టానం పరీక్షలను ఎదుర్కొని నిలబడిన రావి
– ప్రజల మద్దతును కూడగట్టడంలోనూ విజయం

గుడివాడ, డిసెంబర్ 24: కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును ఇప్పుడు ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది లేదు. దీనికి కారణం గెలుపు గుర్రాన్ని చేతిలో పెట్టుకుని టిడిపి అధిష్టానం ఊరంతా వెతుకుతోందన్న విమర్శలు వినిపించాయి.

గుడివాడ టీడీపీ సీటు విషయంలో ఆ పార్టీ అధిష్టానం తప్పటడుగులు వేయడం కొత్తేమీ కాదు. 2004 ఎన్నికల్లోనే దీనికి బీజం పడిపోయింది. అప్పటివరకు ఎన్టీఆర్ తర్వాత మాజీ ఎమ్మెల్యే దివంగత రావి శోభనాద్రి చౌదరి కుటుంబమే గుడివాడ రాజకీయాలను శాసిస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి 2000 వ సంవత్సరం వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్క 1989 ఎన్నికలు మినహా అన్నిసార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది.
2004 వరకు గుడివాడ ఎమ్మెల్యేగా రావి వెంకటేశ్వరావు పనిచేశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి టిడిపి అధిష్టానం ఒక్కసారిగా అభ్యర్థిని మార్చేసింది. అప్పట్లో టిడిపి అధిష్టానం అవలంబించిన ఫార్ములా వర్క్ అవుట్ అయినట్టు కన్పించింది. 2004, 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ గుడివాడలో మాత్రం వరుస విజయాలను నమోదుచేసింది. ఇక్కడే టిడిపికి కొత్త ట్విస్ట్ ఎదురయింది.

మాజీ ఎమ్మెల్యే రావిని కాదని 2004, 2009 ఎన్నికల్లో టిడిపి అధిష్టానం కొత్త అభ్యర్థులకు సీటు ఇచ్చినప్పటికీ 2014 ఎన్నికల నాటికి టీడీపీ ఎమ్మెల్యేగా వున్న కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. వెళ్తూ, వెళ్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్యులు, నాయకులు, కార్యకర్తలను కూడా వెంట తీసుకెళ్లడం జరిగింది. దీంతో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం సగానికి పడిపోయింది.

ఈ పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ పగ్గాలను తిరిగి రావి చేపట్టాల్సి వచ్చింది. అప్పటికే 2014 ఎన్నికలు సమీపించడంతో గుడివాడలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కష్టతరంగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనప్పటికీ గుడివాడలో పార్టీ పూర్వ వైభవం కోసం రావి కృషి చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల నాటికి టిడిపి పటిష్టంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం పాత పద్దతిలోకి వచ్చి మరోసారి రావిని పక్కన పెట్టింది. మళ్లీ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించింది.

విజయవాడ నుండి దేవినేని అవినాష్ ను టిడిపి అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూనే పెద్ద మనసుతో రావి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఈసారి కూడా కొత్త అభ్యర్థుల ఫార్ములా తెలుగుదేశం పార్టీకి కలిసి రాలేదు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన అవినాష్ ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అవినాష్ ఓటమికి నాన్ లోకల్ అభ్యర్థిని రంగంలోకి ఎక్కించడమే కారణమని అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీంతో మళ్లీ గుడివాడలో తెలుగుదేశం పార్టీకి కష్టాలు మొదలయ్యాయి.

పార్టీ కష్ట కాలంలో ఉందని తెలిసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే రావి మరోసారి గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బాధ్యతలను చేపట్టారు. గత మూడు ఏళ్లుగా పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మంచి ఊపు, ఉత్సాహాన్ని తీసుకువస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం రావి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పెడుతున్న పరీక్షలన్నింటిని రావి ఎదుర్కొంటూ నిలబడ్డారు.

ఇటీవల కాలంలో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన “బాదుడే బాదుడు” కార్యక్రమానికి వచ్చినంత స్పందన ఏ కార్యక్రమానికి రాలేదు. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” అనూహ్య స్పందన వస్తోంది. రోజుకు ఐదారు గంటలు ప్రజల మధ్య గడుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలను కలిసి వారి మద్దతును కూడగడుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు, వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులను ఎండగడుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజల మద్దతును పొందడంలో రావి విజయం సాధించారు. గుడివాడలో ఎన్టీఆర్, దివంగత రావి శోభనాద్రి చౌదరి తర్వాత తెలుగుదేశం పార్టీలో తిరుగులేని శక్తిగా రావి ఎదిగారనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొత్త అభ్యర్థుల ఫార్ములాను వదిలి గెలుపు గుర్రంగా ఉన్న రావిపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు రావి కూడా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు టిడిపి శ్రేణులతో కలిసి విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలన్న కసి రావిలో కన్పిస్తోంది. నిత్యం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై విమర్శనాస్రాలతో విరుచుకుపడుతున్న ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించి బదులు తీర్చుకుంటానని మాజీ ఎమ్మెల్యే రావి చెబుతున్నారు.

LEAVE A RESPONSE