– 11మంది జిల్లా అధ్యక్షుల తొలగింపుపై అగ్రనేతల మధ్య విబేధాలు?
– అంతమందిని తొలగించవద్దంటున్న సంఘటనా మంత్రి మధుకర్?
– ఏపీ రాష్ట్ర ఇన్చార్జి మురళీధరన్‌దీ అదే మాట
– కోర్ కమిటీలో చర్చించకుండా ఈ నిర్ణయాలేమిటి?
– ఎన్నికైన తమను ఎలా తొలగిస్తారంటున్న జిల్లా అధ్యక్షులు
– నిధులివ్వకుండా ప్రతి నెలా ఉద్యమాలు ఎలా సాధ్యమంటున్న జిల్లా అధ్యక్షులు
– సోమును తిరిగి అధ్యక్షుడిగా ప్రకటించకుండా ఈ అభిప్రాయ సేకరణలేమిటి?
– సోమునే తొలగిస్తున్నప్పుడు ఈ ప్రక్రియ ఎందుకంటున్న జిల్లా అధ్యక్షులు
– సోము వీర్రాజు, సునీల్ దియోధర్ తీరుపై జిల్లా అధ్యక్షుల తిరుగుబాటు
– తిరుగుబాటుదారులకు సునీల్ తాయిలాల ఎర
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పదవీ కాలం ముగియకుండానే జిల్లా అధ్యక్షుల మార్పు ప్రక్రియ ప్రారంభించడంపై , ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుగుబాటు బావుటా ఎగరవేయడం పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర ఇన్చార్జి-కేంద్రమంత్రి మురళీధరన్, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్‌జీ జిల్లా అధ్యక్షుల మార్పును అంగీకరించడం లేదన్నది మరో సమాచారం. అయినా సరే భారీ స్థాయిలో జిల్లా అధ్యక్షులను మార్చాలంటూ.. రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలపై, జిల్లా నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేసిన వైనం బీజేపీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ రాజ్యాంగం ప్రకారం.. ఓటింగు ద్వారా, ఎన్నికల ప్రక్రియలో గెలిచిన తమను తొలగించి, తమ స్థానంలో నామిటేడెట్ ద్వారా మరొకరిని ఎలా నియమిస్తారన్న ప్రశ్నలు సంధిస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా పదవీకాలం ఫిబ్రవరితో ముగియనుంది. అదే సమయంలో సహజంగానే రాష్ట్ర అధ్యక్షుల పదవీకాలం కూడా ముగుస్తుంది. గతంలో ఏపీ పర్యటనకు వచ్చిన, బీజేపీ జాతీయ సహ సంఘటనా సహాయ కార్యద ర్శి శివప్రకాష్‌జీ.. తిరిగి నద్దానే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారని వెల్లడించారు. అయితే రాష్ట్ర అధ్యక్షులు కూడా తమ పదవుల్లో కొనసాగుతారని, అవన్నీ వారి పనితీరు ఆధారంగా మార్పులు ఉంటాయని, పార్టీ నేతల భేటీలో స్పష్టం చేశారు.
ఆ ప్రకారంగా నద్దాను.. తిరిగి జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించడానికి, మరికొంత సమయం ఉంది. ఈలోగా వచ్చిన హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో, బీజేపీ ఘోర పరాజయం పాలయింది. దానితో సొంత రాష్ట్రంలోనే పార్టీని గెలిపించుకోలేని నేతగా, నద్దా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను తిరిగి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించకపోవచ్చన్న ప్రచారం మొదలయింది.
ఆయన స్థానంలో అమిత్‌షాకు ప్రధాన అనుచరుడైన కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను నియమించవచ్చన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సంఘ్ మాత్రం ధర్మేంద్రప్రధాన్ పేరు సూచిస్తోంది. అయితే మధ్యే మార్గంగా నద్దానే తిరిగి అధ్యక్షుడిగా కొనసాగిస్తారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఈవిధంగా అసలు జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన రానిదే, తమను జిల్లా అధ్యక్షులుగా ఎలా తప్పిస్తారంటూ.. ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు సోము వీర్రాజునే తొలగిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంటే, తమను ఏ విధంగా తొలగిస్తారని రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ విషయంలో సోము వీర్రాజుకు విధేయుడైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒకరు, తన పరిథికి మించి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు.
కొద్దిరోజుల క్రితం ఒంగోలు వేదికగా.. రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమ బీజేపీ జోనల్ కమిటీ సమావేశాలు జరిగాయి. అందులో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర కో ఇన్చార్జి సునీ దియోధర్ జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. తిరిగి జిల్లా అధ్యక్షులుగా ఎంతమంది కొనసాగుతారు? ఎంతమంది పార్టీకి పూర్తి సమయం ఇస్తారు? ఎంతమంది డబ్బు ఖర్చుపెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. అయితే తామంతా ఇప్పటికే ప్రతినెల, సొంత ఖర్చుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తాము జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతామని వారంతా స్పష్టం చేశారు.
దీనితో ఖంగుతిన్న నాయకత్వం.. మిమ్మల్ని మార్చాలని పార్టీ నిర్ణయిస్తే, అందుకు మీరు సహకరిస్తారా? అని ప్రశ్నించింది. దానితో ఆగ్రహించిన పలువురు జిల్లా అధ్యక్షులు.. ఇప్పటివరకూ రాష్ట్ర పార్టీ నుంచి నయా పైసా రాకపోయినా లక్షలు ఖర్చు చేసి, సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మీడియాలో సహకారం లేకపోయినా, మూడేళ్లు జిల్లాల్లో పార్టీ విస్తరణకు కృషి చేశామని గుర్తు చేశారు.
అయినా కోర్ కమిటీలో చర్చించకుండా, అసలు జాతీయ నాయకత్వం మారకుండా ఇప్పటినుంచే ఈ అభిప్రాయసేకరణ ఏమిటని నిలదీశారు. ఇది రాష్ట్ర పార్టీ నాయకత్వం, జాతీయ పార్టీ అనుమతి మేరకు నిర్వహిస్తుందా? లేక సోము వీర్రాజు, సునీల్ దియోథర్ వ్యక్తిగతంగా నిర్వహిస్తున్నదా తేల్చాలని డిమాండ్ చేశారు. తాము జిల్లా అధ్యక్షులుగా విఫలమైతే, సోము వీర్రాజు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా విఫలమయినట్లే కదా అని ప్రశ్నిస్తున్నారు.
దీనితో వ్యూహం మార్చిన సునీల్ దియోధర్ ఆ 11 మందికి తాయిలాలు ఎర వేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. వారిలో కొందరికి రాష్ట్ర కమిటీలో పదువులు, మరికొందరికి అసెంబ్లీ టికెట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. తామంతా పార్టీ రాజ్యాంగం అనుసరించి, జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనందున.. తప్పిస్తే సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.
ఇదిలాఉండగా.. ఏపీలో మొత్తం 11 మంది జిల్లా అధ్యక్షులను మార్చేందుకు, రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, కాకినాడ, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, అనకాపల్లి, నరసాపురం, ఏలూరు వంటి.. పలు జిల్లా అధ్యక్షులను మార్చాలన్న పట్టుదల రాష్ట్ర నాయకత్వంలో కనిపిస్తోంది. ఆ మేరకు ఆయా జిల్లాల్లో పలువురికి రాష్ట్ర ప్రముఖుడొకరు ..చాలారోజుల క్రితమే జిల్లా అధ్యక్ష పదవి హామీ ఇచ్చారని, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిలో ఎక్కువమంది, గతంలో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నియమితులయిన వారే కావడం గమనార్హం. అయితే తామంతా పార్టీ రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినవాళ్లమని గుర్తు చేస్తున్నారు. తమను తొలగించి , ఆ స్థానంలో తన వర్గాన్ని నియమించుకోవాలన్న లక్ష్యంతో జరుగుతున్న ఈ ప్రయత్నాలను అడ్డుకుని తీరతామని జిల్లా అధ్యక్షులు హెచ్చరిస్తున్నారు.
ప్రధానంగా కాకినాడ-రాజమండ్రి జిల్లా అధ్యక్షుల మార్పుపై, సోము వీర్రాజు చాలా పట్టుదలగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తన సొంత జిల్లాలో, తన వర్గం వారు జిల్లా అధ్యక్షులుగా లేకపోవడమే దానికి కారణమని చెబుతున్నారు.
కాగా..ఒకేసారి భారీ స్థాయిలో జిల్లా అధ్యక్షుల మార్పు వ్యవహారాన్ని, ఆ పార్టీలోని అగ్రనేతలే వ్యతిరేకిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా రాష్ట్ర సంఘటనా మంత్రి మధకర్‌జీ, దీనికి అంగీకరించడం లేదని సమాచారం. పనితీరు బాగోలేని ఒకరిద్దరిని మార్చాలే తప్ప, ఒకేసారి అంతమందిని మార్చడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని, ఆయన రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం.
అదేవిధంగా రాష్ట్ర నాయకత్వ ప్రయత్నాలకు, రాష్ట్ర ఇన్చార్జి-కేంద్రమంత్రి మురళీధరన్ ఆమోదం కూడా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది పార్టీలో తిరుగుబాటుకు బీజం వేసినట్లేనని, అటు సీనియర్లు కూడా స్పష్టం చేస్తున్నారు.
అయితే పార్టీలో కీలక అంశాలపై చర్చించాల్సిన కోర్ కమిటీని.. రాష్ట్ర నాయకత్వం నిర్వీర్యం చేసి, దానిని ఉత్సవ విగ్రహం చేసిందన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వంటి కోర్ కమిటీ సభ్యులకు.. రాష్ట్ర నాయకత్వం, ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నా దానిపై సంఘటాన మంత్రి గానీ, రాష్ట్ర ఇన్చార్జి మంత్రి గానీ దిద్దుబాట చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. సోషల్‌మీడియాలో పార్టీ పేజీని, సోమువీర్రాజు పర్సనల్ పేజీలా మార్చారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
కోర్ క మిటీ సమావేశం నిర్వహించినా, కీలకమైన అంశాలపై రాష్ట్ర అధ్యక్షుడు, కో ఇన్చార్జి, సంఘటనా మంత్రి మాత్రమే కీలకపాత్ర పోషిస్తున్నారంటున్నారు. పార్టీ వ్యవహారాలు చక్కదిద్దాల్సిన సంఘటనా మంత్రి కూడా.. ఒక వర్గ నేతగా వ్యవహరించడం, సరైన విధానం కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.