-అల్లర్లు సృష్టించి లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రమాదం
-ప్రజాస్వామ్య వ్యవస్థలో అప్రజా స్వామిక వ్యక్తులు చొరబడడం దురదృష్టకరం
-పురోగమనం లో తెలంగాణ… తిరోగమనం లో ఆంధ్ర ప్రదేశ్
-రాష్ట్ర ప్రజల నెత్తిన ఈ ఏడాది ఇప్పటికే 80 వేల కోట్ల అప్పులు
-కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కాదని ప్రైవేటు సంస్థ లకు పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులా?
-రూపాయి, అర్ధ రూపాయికి ఓట్లను అమ్ముకోవద్దు… ప్రలోభాలకు లొంగకుండా ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు కావాలి
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
సవాలక్ష ఆంక్షలను విధించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు అనుమతిని ఇచ్చామని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విమర్శించారు. లోకేష్ నిర్వహించనున్న యువ గళం పాదయాత్రకు 29 ఆంక్షలను విధించి పలమనేరు డి.ఎస్.పి సుధాకర్ రెడ్డి అనుమతి ఇచ్చారు. పోలీసులు విధించిన 29 ఆంక్షలను వేరు, వేరుగా చూడాలని చిత్తూరు ఎస్పీ వివరణ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. పాదయాత్రలో భాగంగా పాటలను పెట్టడం, నాలుగు కూడలి చౌరస్తాలో ప్రసంగించడం, డీజే లను వినియోగించడం పట్ల ఆంక్షలను విధించడం తీవ్ర అభ్యంతరకరం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై హైకోర్టు స్టే ను పొడిగించకపోవడం వల్లే , పోలీసులు ఈ తరహా ఆంక్షలను విధించినట్లుగా కనిపిస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు. గతంలో పాదయాత్ర పొడవునా మంగ్లీ ఆలపించిన పాటలను పెట్టుకుంటూ, నాలుగు కూడళ్ల చౌరస్తాలో ప్రసంగిస్తూ, ఎటువంటి ఆంక్షలు లేకుండా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను నిర్వహించారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు గత ప్రభుత్వం పూర్తిగా భద్రతను కల్పిస్తే, లోకేష్ పాదయాత్రకు భద్రత కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడం సిగ్గుచేటు. మగ, ఆడవాలంటీర్లను నియమించుకొని భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడం రాష్ట్ర పోలీసులకే చెల్లిందని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఏకైక ప్రజా ప్రతినిధిగా ఎవరు పాదయాత్ర నిర్వహించిన, ఆ పాదయాత్ర విజయవంతం కావాలని తాను కోరుకుంటానని తెలిపారు.
ఏదో ఒక రకంగా లోకేష్ పాదయాత్రను అడ్డుకోనున్న జగన్
లోకేష్ నిర్వహించనున్న యువ గళం పాదయాత్రను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా అడ్డుకుంటారని ఆయన మనస్తత్వం ఎరిగిన వ్యక్తిగా చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన నియోజకవర్గానికి విచ్చేసినప్పుడు, తనని ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు జగన్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అటువంటి వ్యక్తి, ఎన్నో ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పాదయాత్రకు అంత సునాయాసంగా అనుమతిని ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకమే?. ఏదో ఒక కుట్ర చేసి, పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు అనుమతిని ఇవ్వకపోవడాన్ని జగన్ తల్లి విజయమ్మ తప్పు పడుతున్నారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా కొనసాగిస్తానని షర్మిల తేల్చి చెబుతున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం తప్పని, ప్రభుత్వానికి బుద్ధి ఉందా అంటూ ఒకవైపు విజయమ్మ నిలదీస్తుంటే, మరొకవైపు ఆమె తనయుడు జగన్, ప్రతిపక్ష పార్టీకి చెందిన లోకేష్ నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారు. అన్న ఒకలా వ్యవహరిస్తుంటే, ఆయన చెల్లి, తల్లి మరొకలా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా అప్రజా స్వామికంగా వ్యవహరించే వ్యక్తులు చొరబడడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే షర్మిల, విజయమ్మలు తెలంగాణకు వెళ్ళిపోగా, అదే కుటుంబానికి చెందిన వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ, పాదయాత్ర అడ్డుకునేందుకు చెత్త ఆంక్షలు విధించడం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 ని న్యాయస్థానం రద్దు చేస్తే, లోకేష్ పాదయాత్రకు విధించిన ఆంక్షల పై సడలింపులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ జీవో పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పు రిజర్వులో ఉంది. కోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి మరో వారం రోజుల వ్యవధి పట్టవచ్చు. ఈ లోగా లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు తమ పార్టీకి చెందిన వారే నాలుగు టపాకాయలను కాల్చి ఆటంకాలను సృష్టించే అవకాశాలు లేకపోలేదు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో తమ పార్టీకే చెందిన నాయకులే ఘర్షణలు సృష్టించి, లోకేష్ ప్రాణాలు మాకు ముఖ్యం కాబట్టి పాదయాత్రను రద్దు చేస్తున్నామని పోలీసుల ద్వారా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. లోకేష్ పాదయాత్ర తమ ప్రభుత్వం నుండి ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగాలని తాను కోరుకుంటున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు.
దారి మళ్లుతున్న రుణ సొమ్ము
కార్పొరేషన్ల పేరిట అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ రుణ మొత్తాన్ని దారి మళ్లించి వినియోగిస్తున్నదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇదే విషయమై గత నెల 29వ తేదీన పి ఎఫ్ సి, ఆర్ ఎ సి చైర్మన్ల కు లేఖ రాశాను. ఈ ఏడాది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 80 వేల కోట్ల రూపాయల అప్పులను చేసింది. అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాను. అయినా, ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి పోర్ట్ అభివృద్ధి నిమిత్తం , పి ఎఫ్ సి, ఆర్ ఎ సి లు రుణాలను మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఆ రుణ మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలు తమకు కావలసిన కాంట్రాక్టర్ కు చెల్లించినట్లు సమాచారం. పోర్టు అభివృద్ధి కోసం అప్పు చేసిన సొమ్ము మొత్తం, అదే అకౌంట్లో ఉండాలి. ఇతరులకు చెల్లించడం ఎంతవరకు సమంజసం. ఇదే విషయాన్ని తాను వివరణ కోరుతానని తెలిపారు.
పెట్టుబడులు, నిర్మాణరంగంపై దృష్టి సారించిన తెలంగాణ… ఏపీలో విధ్వంసం తప్ప మరేమీ కనిపించడం లేదు
కరోనా కష్టాలను అధిగమించి తెలంగాణ రాష్ట్రం పురోగమన దిశగా అడుగులు వేస్తుంటే , ఆంధ్రప్రదేశ్ మాత్రం తిరోగమన దిశగా అడుగులు వేస్తోందని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య గత రెండేళ్లలో సాధించిన ఆర్థిక వృద్ధిని పరిశీలిస్తే ఈ వ్యత్యాసం స్పష్టం అవుతుంది. గత ఏడాది నవంబర్ ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం 88.618 కోట్లు కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 74.940 కోట్లు మాత్రమే. గత ఏడాది మార్చి ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం 1.50 లక్షల కోట్ల రూపాయలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 1.27 లక్షల కోట్ల రూపాయలు… తెలంగాణ ప్రభుత్వ ఆదాయం కంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం 26 నుంచి 27 వేల కోట్ల రూపాయల అధికం. 2022 నవంబర్ నాటికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం 96.457 కోట్ల రూపాయలు కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 96.615 కోట్ల రూపాయలు… ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి కంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర శాతం ఆదాయాన్ని పెంచుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు, నిర్మాణరంగం పై దృష్టి సారిస్తుంటే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం విధ్వంసాన్ని కోరు కుంటోంది. కరోనా కష్టాలను అధిగమించి తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం కరోనా కష్టాలనే వల్లించడం విడ్డూరంగా ఉంది. ఇకనైనా కరోనా కబుర్లను ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.
రుణ యజ్ఞ సమిధలు ప్రజలే…
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రుణ యజ్ఞ సమిధలు ప్రజలేనని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రుణ ఫలాలను నాయకులు ఎక్కువగా స్వీకరించి, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిసి వస్తే ఓటర్ కు రోజుకు సగటున అర్ధరూపాయ పంచి అదే డబ్బులతో ప్రజల ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు . అదే అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగితే, ఓటర్ కు సగటున ఒక్క రూపాయి ఇచ్చి ఓట్లను కొనుగోలు చేసేందుకు పథకాలను రచిస్తున్నారు. 25 ఎంపీ స్థానాలు ఉన్న ఒక రాష్ట్రం, ఈ ఏడాది ఇప్పటికే 80 వేల కోట్ల రూపాయల అప్పులను చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమి కాదని రఘు రామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
మనుషులను పశువుల్లాగానైనా చూడండి
పశువుల కోసం 120 కోట్ల రూపాయలను వెచ్చించి ఆంబులెన్స్ వాహనాలను ఖరీదు చేశారట . దానికి నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు చేసి, పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం అవసరమా?. అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఆంబులెన్స్ వాహనాలలో ఇప్పటివరకు అత్యవసర చికిత్స కోసం పశువులను తీసుకువచ్చిన దాఖలాలే లేవు. గతంలో పశువుల ఆసుపత్రులే లేనట్టు, ఈ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేసినట్టు పేర్కొనడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. పశువుల కోసం ఆంబులెన్స్ వాహనాలను ఖరీదు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు, ప్రజల శవాలను మాత్రం సైకిళ్ళు, తోపుడు బండ్లు, రిక్షాలలో తరలిస్తుంటే ఏమి చేస్తున్నారు?. పశువుల పట్ల పాలకులకు, నిజమైన నిబద్ధతే ఉంటే, ప్రజలను కూడా కనీసం పశువుల మాదిరిగానైనా చూడాలి. నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలరింగ్ వృత్తి చేసుకునే వారికి ఏడాదికి పదివేల రూపాయలు అందజేసే విధంగా జగనన్న చేదోడు అనే పథకాన్ని గతంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకంలో భాగంగా ఇప్పటికే రెండేళ్లపాటు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వలేదని తెలిసింది. తాజాగా, ఒక్కరోజు వ్యవధిలోనే గ్రామ సచివాలయాలనుంచి తాము దుకాణాన్ని కలిగి ఉన్నామని ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు. గతంలో మీ సేవ నుంచి లబ్ధిదారులు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకు వస్తేనే, జగనన్న చేదోడు పథకంలో భాగంగా వారి అకౌంట్లోకి డబ్బులను జమ చేశారు. ఇంతలోనే వారు నాయి బ్రాహ్మణులు, రజకులు కాకుండా పోయారా?, వారు షాపులను నిర్వహించడం లేదన్న అనుమానం ఎలా, ఎందుకు…వచ్చిందా??. ఇకనైనా ఇటువంటి ఆంక్షలు విధించడం మాని, ప్రభుత్వ సొమ్మును ప్రజలకు కష్టం లేకుండా అందజేయాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.
ప్రైవేటు సంస్థ లకే పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులా?
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ( ఎన్ హెచ్ పి సి ) ని కాదని, ప్రైవేటు సంస్థలకే పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ట్రాన్స్ఫార్మర్ల కంపెనీ అయిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండో సోల్ అనే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 4,300 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును కట్టబెట్టింది. ఈ రెండు సంస్థల ప్రమోటర్ కడప జిల్లాకు చెందిన నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి. అరబిందో కు మరో 1600 మెగావాట్లు , గ్రీన్ కో కు 3500 మెగావాట్లు, అదా నీ కంపెనీకి 5300 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అదాని కంపెనీకి కూడా హైడ్రో పవర్ ప్రాజెక్టులలో ఇప్పటివరకు ఎటువంటి అనుభవం లేదు. అదే ఎన్ హెచ్ పి సి ఈ రంగంలో అనుభవం కలిగిన, లిస్టెడ్ కంపెనీ. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో 70 నుంచి 75% ప్రాజెక్టులను ఆ సంస్థ నే నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, నిర్వాహణ బాధ్యతను ఎన్ హెచ్ పి సి కే కట్టబెట్టింది. అటువంటి సంస్థ కు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు ఇవ్వలేదు?. హైడ్రో ప్రాజెక్టు ఏర్పాటుకు నిధులను తామే సమకూర్చుకుంటామని, 26% అయిన, 49 శాతం అయినా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్య ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి కూడా సంసిద్ధతను వ్యక్తం చేసినప్పటికీ, ఎన్ హెచ్ పి సి కి హైడ్రో ప్రాజెక్టును అప్పగించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది స్పష్టం అవుతోంది. ఎన్ హెచ్ పి సి కి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును కూడా అప్పగించకపోవడాన్ని, కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు ప్రశ్నించలేదన్నది అర్థం కావడం లేదు. రాష్ట్రంలో హైడ్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు అందరికంటే ముందుగానే ఎన్ హెచ్ పి సి దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఎన్ హెచ్ పి సి ని కాదని శిరిడి సాయి, అదాని, అరబిందో రియాల్టీ, గ్రీన్ కో లకు హైడ్రో ప్రాజెక్టులు కట్టబెట్టడం వెనుక మతలబు ఏమిటో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తెలియజేయాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.
ఓట్ల కొనుగోలుకు వస్తే చెప్పుతో కొట్టండి
ఎన్నికల ముందు ఎవరైనా ఓట్ల కొనుగోలు కోసం వస్తే, వారిని చెప్పుతో కొట్టాలని రఘురామకృష్ణం రాజు ఓటర్లకు పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో ఓటర్ బాధ్యతను వివరించారు. ఓటుకు 2000 నుంచి 3000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రజల సొమ్మును మదించినవారు సిద్ధమవుతున్నారు. ఐదేళ్ల కాల పరిమితికి ఓటుకు రెండు నుంచి మూడు వేల రూపాయలిచ్చి, మన జీవితాలను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అటువంటి వారికి రూపాయి, అర్ధ రూపాయి ఇచ్చి తమ జీవితాలను కొనుగోలు చేయలేరని తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో దుర్మార్గులను దూరం పెట్టడానికి ఓటు అనేది ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటును ఎవరు అమ్ముకోవద్దు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజా ప్రభుత్వం ఏర్పాట్లు భాగస్వాములు కావాలని రఘురామకృష్ణం రాజు కోరారు.