– ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనూహ్య స్పందన
– శేరీదగ్గుమిల్లిలో ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన
– గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు
గుడివాడ, ఫిబ్రవరి 24: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పిస్తున్నామని కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం శేరీదగ్గుమిల్లి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజలు రావికి ఘనస్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై అవగాహన కల్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలపై మోపిన భారాలను వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్ళి ఎండగట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి గ్రామస్థులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయన్నారు. ప్రజాసమస్యలను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు.
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి గుడివాడ నియోజకవర్గ ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందన్నారు. గుడివాడ నియోజకవర్గ పరిస్థితులపై స్పష్టమైన అవగాహనతో ఉన్నానన్నారు. 2024 ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించడం. జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రావి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జన్ను శివకుమార్, వేమన ఆదిశేషు, కొప్పుల దుర్గా వెంకటేశ్వరరావు, చాట్ల భాస్కరరావు, ఈడే నాగేంద్ర, కొడాలి రామరాజు తదితరులు పాల్గొన్నారు.