– ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ నేతపంచుమర్తి అనురాధ
– సాంకేతికంగా టీడీపీ ఎమ్మెల్యేల బలం 23
– ఎమ్మెల్సీ ఎన్నికకు కావలసిన ఎమ్మెల్యేల సంఖ్య 22
– వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి ఓట్లు టీడీపీకే
– బాబుతో టచ్‌లో ఉన్న 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు?
– నేరుగా హైదరాబాద్‌కు వచ్చి బాబుతో మంతనాలు
– జిల్లా టీడీపీ నేతలకు తెలియకుండానే బాబుతో వైసీపీ ఎమ్మెల్యేల భేటీలు
– నెల్లూరు తమ్ముళ్లకు తెలియకుండానే బాబుతో ఆనం, కోటంరెడ్డిల భేటీ
– అదే తరహాలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు
-వైసీపీని చిక్కుల్లో నెట్టనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు
– వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలపై టీడీపీ వల
– సీటు హామీ ఇస్తే ఓటుకు సిద్ధమని కొందరు వైసీపీ ఎమ్మెల్యేల హామీ
– వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు అంత సాహసం చేస్తారా?
– లేక కొంతకాలం వరకూ వేచిచూస్తారా?
– వైసీపీని గురిచూసి కొడుతున్న టీడీపీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎంకిపెళ్లి సుబ్బిచావు కొచ్చిటనట్లు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో అధికార వైసీపీకి ఇరకాటంగా పరిణమించాయి. నిన్నటి వరకూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిరాసక్తంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ఇప్పుడు వ్యూహం మార్చి తన పార్టీ అభ్తర్ధిని తెరపైకి తీసుకువచ్చి, వైసీపీకి షాక్ ఇచ్చింది. బీసీ నేత, పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధను, పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నిర్ణయించింది. ఆ మేరకు ఆమెకు సమాచారం ఇవ్వడంతో, చీరాలలో ఉన్న అనూరాధ హుటాహుటిన అమరావతి వెళ్లారు.
ఎన్నికల ముందు వైసీపీలో అసమ్మతిని సొమ్ము చేసుకునే చివరి ప్రయత్నాలకు టీడీపీ తెరలేపింది. అందులో భాగంగా.. మార్చి 23న జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా, టీడీపీ అధికార ప్రతినిధి అనూరాధను అనూహ్యంగా బరిలోకి దింపింది. ఎమ్మెల్సీ ఎన్నికకు 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. కాగా టీడీపీకి సాంకేతికంగా 23 మంది ఎమ్మెల్యేలున్నారు.
అయితే వారిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి తమ పదవులకు రాజీనామా చేయకుండా వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో విప్ జారీ చేయడం కుదరదు. కాబట్టి ఎన్నికల్లో అధికారికంగా టీడీపీకి 19 ఓట్లు మాత్రమే అవకాశం ఉంది.
అయితే.. వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ ఓట్లు టీడీపీకే పడటం ఖాయం. అప్పుడు టీడీపీ బలం 21కు చేరుతుంది. కాగా.. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో వైసీపీలో సీట్లు రావని నిర్థరించుకున్న పలువురు ఎమ్మెల్యేలు టీడీపీతో రాయబారాలు ప్రారంభించినట్లు సమాచారం. తమకు సీటు హామీ ఇస్తే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తామన్నది వారి ప్రతిపాదన.
ఇప్పటి వరకూ 8 మంది వైసీపీ ఎమ్మెల్యేల ప్రతిపాదనలు, పార్టీ నాయకత్వం వద్దకు వచ్చినట్లు సమాచారం. వీరిలో ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలున్నట్లు చెబుతున్నారు. కాగా కర్నూలు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో ఓ మాజీ మంత్రి మంతనాలు జరుపుతుండగా.. వైసీపీలో చేరిన ఓ ఎమ్మెల్యేతో కూడా ఆ మాజీ మంత్రి చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరిన ప్రధాన నగరానికి చెందిన ఆ ఎమ్మెల్యేకు పోటీగా, వైసీపీ సమన్వయకర్తను నియమించటమే సదరు ఎమ్మెల్యే అసంతృప్తికి కారణమని చెబుతున్నారు.
వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలతో నేరుగా చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నట్లు పార్టీ వర్గాల కథనం. ఈ విషయంలో ఆయా జిల్లా నేతలతో ఏమాత్రం సంబంధం లేకుండా, చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి పార్టీలో చేరే విషయం, ఆ జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో చర్చించకుండానే ఖరారు చేయడమే దీనికి నిదర్శనం. కోటంరెడ్డి హైదరాబాద్‌కు వచ్చి బాబుతో మాట్లాడేవరకూ, ఆ విషయం నెల్లూరు జిల్లా టీడీపీ నేతలకు తెలియకపోవడం విశేషం.
తాజాగా ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా , టీడీపీ నాయకత్వంతో చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి విజయానికి అవసరమైన దాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు.
నిజానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, టీడీపీ నాయకత్వం తొలి నుంచీ విముఖంగా ఉంది. అయితే వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్యేల తిరుగుబాటు, అంతర్గతంగా మారుతున్న పరిణామాలతోపాటు, హైదరాబాద్‌కు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్ద చేసిన ప్రతిపాదనలు… టీడీపీ నిర్ణయం మార్చుకునేందుకు కారణమయ్యాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు నాయుడు వద్దకు వచ్చిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు… తమకు నియోజకవర్గాల్లో ఏమాత్రం పనులు కావడం లేదని, ప్రభుత్వ నిర్ణయాల వల్ల తమకు రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని వాపోయినట్లు సమాచారం. కాంట్రాక్టర్లకు బిల్లులతోపాటు, తమను గెలిపించిన సర్పంచుల బిల్లులు కూడా, ఇప్పించలేకపోతున్నామని వారు బాబు వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
అందువల్ల వచ్చే ఎన్నికల్లో తమకు సీటు విషయంలో హామీ ఇస్తే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదించినట్లు, పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మధ్యవర్తులెవరూ లేకుండా, నేరుగా చంద్రబాబు నాయుడే.. వారితో హైదరాబాద్‌లో చర్చలు జరిపినట్లు సమాచారం.
టీడీపీ తాజా వ్యూహం ఫలిస్తే, వైసీపీ రాజకీయంగా చిక్కుల్లో పడక తప్పదు. పార్టీ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు వేసే ఆనం, కోటంరెడ్డిపై వైసీపీ నాయకత్వం చర్య తీసుకునే అవకాశాలు ఉండవు. అయితే.. చంద్రబాబు వద్దకు వెళ్లిన వారికి ఎలాంటి హామీ లభించిందన్న దానిపై, ఇంకా స్పష్టత కనిపించడం లేదు. నిజంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటేసే ధైర్యం చేస్తారా? లేక ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉన్నందున, అధికారంలో ఉన్న జగన్‌ను ఎదిరించడం ఎందుకన్న ముందుచూపుతో, పార్టీ ఆదేశాలు అమలు చేస్తారా? అన్నదే చూడాలి.