Suryaa.co.in

Editorial

అయితే.. వివేకా హత్య ‘నారాసుర రక్తచరిత్ర’ కాదన్నమాట!

– వివేకా అల్లుడే అసలు హంతకుడట
– కోర్టులో అవినాష్‌ లాయర్‌ కొత్త వాదన
– మరి నాడు బాబుపై వేసిన బురద మాటేమిటి?
– రెండో పెళ్లి, ఆస్తి పంచాయితీ ఆరోజు మీడియాకు చెప్పలేదేం?
– అల్లుడే హంతకుడని అదేరోజు ఎందుకు చెప్పలేదు?
– సిట్‌కు అవినాష్‌ అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
– చెబితే అప్పుడే పోలీసులు అల్లుడిని అరెస్టు చేసేవారు కదా?
– అంటే వివేకా హత్య కేసులో బాబును రాజకీయ బలిపశువును చేసినట్టేనా?
– వివేకా అల్లుడు హంతకుడైతే మరి రక్తం తుడిచెందెవరు?
– డెడ్‌బాడీకి కుట్లు వేయమని చెప్పిందెవరు?
– వివేకా హత్య కేసులో అన్నీ అనుమానాలే
– అవినాష్‌ లాయర్‌ ఆరోపణలతో కథ కొత్త మలుపు
( మార్తి సుబ్రహ్మణ్యం)

అబద్ధం చెబితే అది అతికినట్లు ఉండాలి. ఆ కుట్లు-అల్లికలు ఓ ఆర్ట్‌. కుదిరితే ఓకే. కుదరకపోతే తప్పులో కాలేసినట్లే. అది ఫిర్యాదు లేదా ఆరోపణలు చేసే మనుషులైనా.. విచారించే దర్యాప్తు సంస్థలయినా సరే. పోలీసులు ఒకరిపై పెట్టే కేసులో సరుకు లేకపోతే కోర్టులో దొరికిపోతారు. అదే వ్యక్తులు ఆరోపణలు చేసి కేసు పెడితే, అందులో నిజం లేకపోతే విచారణ సంస్థలకు దొరికిపోతారు. కలసి వెరసి జనం ముందు నవ్వులపాలవుతారు.

ఈ సీజన్‌లో కడప మాజీ ఎంపీ- మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు కథకు, ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. ముందు బాబాయ్‌ది గొడ్డలి పోటు.. ఆ తర్వాత గుండెపోటు కథలు ముగిసి, చివరాఖరకు ఇప్పుడు అల్లుడే అసలు హంతకుడని వాదించే దశకు, వివేక హత్య కథ కొత్త మలుపు తిరిగింది. అంటే నారాసుర రక్త చరిత్ర కాస్తా, కుటుంబరక్త చరిత్రగా మలుపుతిరిగిందన్నమాట. ఆ కథేమిటో చూద్దాం.

వివేకా అసలు హంతకుడు, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డేనని.. ఈ కేసులో సీబీఐ విచారిస్తోన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తరఫున వాదించిన లాయర్‌ సంచలన ఆరోపణ. వివేకా రెండో పెళ్లి చేసుకున్న తర్వాత.. ఆయన కుటుంబం వివేకాను దూరం పెట్టడంతోపాటు, ఆయన చెక్‌ పవర్‌నూ లాగేసుకుందన్నది, అవినాష్‌రెడ్డి లాయర్‌ కోర్టులో చేసిన వాదన. హత్యకె ఆ నేపథ్యమే కారణమన్నది ఆయన తెరపైకి తెచ్చిన లాజిక్‌.

దానితో వివేకా చేతలో డబ్బు లేక ఆర్ధిక ఇబ్బందులు పడేవారని, రెండో భార్య కొడుకును వారసుడిగా ఎంపిక చేసుకునే క్రమంలో.. కుటుంబంలో వచ్చిన కలతలే, ఆయన హత్యకు కారణమన్నది అవినాష్‌రెడ్డి లాయర్‌ గారి కవి హృదయం. ఆరోపణ కూడా. అసలు సీబీఐ ఆ కోణంలో ఎందుకు విచారించడం లేదన్నది ఆయన ప్రశ్న. ఇదే కోణంలో వైసీపీ అధికార మీడియా కూడా చాలా కథనాలు రాసింది. ఇదే వేరే విషయం. అవినాష్‌ న్యాయవాది వాదనను తప్పుపట్టాల్సిన పనిలేదు. తన క్లయింట్‌ను కాపాడటం న్యాయవాదిగా ఆయన ధర్మం.

కాబట్టి ఆ కోణంలో కాసేపు, ఇదంతా నిజమే కావచ్చనుకుందాం. అవినాష్‌రెడ్డి లాయర్‌ చేసిన ఆరోపణ కూడా, ఆయన వాదన ప్రకారం నిజమే కావచ్చనుకుందాం. బాబాయ్‌ను అల్లుడే వేసేశారనుకుందాం. వివేకా ఫ్యామిలీ పంచాయితీ వల్లే, ఆయన ఖర్చయిపోయారనుకుందాం. ఆయన చెక్‌పవర్‌కు కుటుంబసభ్యులే కత్తెర వేసి, ఆర్ధిక కష్టాల్లోకి నెట్టేశారనుకుందాం. ఇవన్నీ పెద్దాయన గొడ్డలిపోటుకు కారణమనుకుందాం. ఇవన్నీ కోర్టులో అవినాష్‌రెడ్డి తరఫున లాయర్‌ చెప్పారంటే.. అది అవినాష్‌రెడ్డి అభిప్రాయమే అన్నది, మెడ మీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.

ఆ ప్రకారంగా అవినాష్‌రెడ్డి లాయర్‌ చెప్పిందే నిజమైతే.. వివేకా హత్య, వైసీపీ నేతలు ఆరోపించినట్లు అది ‘నారా’సుర రక్తచరిత్ర కానే కాదన్నమాట. ఇప్పుడు చివరాఖరకు తేల్చింది అదేనని స్పష్టమవుతుంది. అప్పట్లో ఎన్నికల అవసరార్ధం.. బాబాయ్‌ హత్యను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని, చంద్రబాబును బకరా లేదా బలిపశువును చేశారని అర్ధమవుతూనే ఉంది. ఈ క్రమంలో మెడపై తల ఉన్న బుద్ధిజీవులకు వచ్చే సందేహాలేమిటో ఓసారి చూద్దాం.

వివేకా అల్లుడే.. మామను చంపిన విషయాన్ని, ఇప్పుడు బయట ప్రపంచానికి చెబుతున్న అవినాష్‌రెడ్డి.. వివేకా హత్య మరుసటి రోజు మీడియాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? వివేకా భౌతిక కాయం వద్ద అవినాష్‌ కుటుంబసభ్యులంతా, వివేకా కుటుంబాన్ని ఎందుకు ఓదార్చారు? నిజంగా వివేకా అల్లుడే ఆయన హత్యకు కారణమయిన సమాచారం అవినాష్‌రెడ్డి వద్ద ఉండి.. హత్య కేసును విచారించిన ‘సిట్‌’కు ఆ ముక్క చెప్పి ఉంటే, వివేకా అల్లుడిని పోలీసులు అప్పుడే అరెస్టు చేసే వారు కదా? జగన్‌ సీఎం అయిన ఏడాది వరకూ మనుగడలో ఉన్న సిట్‌కు వివేకా అల్లుడిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు? పోనీ నిజాయితీగల అధికారి శంకరయ్యకు ఓ మాట చెబితే, అల్లుడుగారిని అరెస్టు చేసేవారు కదా?

అప్పుడు అవినాష్‌ కుటుంబం పులుకడిగిన ముత్యంలా, ఇలా విచారణాధికారుల చుట్టూ తిరగనవసరం లేకుండా, నిందల నుంచి బయటపడేది కదా? అసలు సునీతకే ఆ నిజం చెప్పిఉంటే, ఆమె కోర్టులో పిటిషన్‌ వేసేదే కాదు కదా? ఆ పని అప్పుడు చేయకుండా, నింపాదిగా ఇన్నేళ్లకు కోర్టులో వాదించడమేమిటి? అదే నిజమైతే.. ‘నారాసురరక్త చరిత్ర’ నిందలో నిజం లేనట్లే కదా?! అన్నది బుద్ధిజీవుల సందేహం.

అంతేనా?.. మరి వివేకా అల్లుడే అసలు హంతకుడయితే, హత్య జరిగిన ప్రాంతంలో రక్తపుమరకలు తుడిచిందెవరు? మృతదేహానికి కుట్లు వేసిందెవరు? కొంపదీసి వివేకానే బతికి పైకిలేచి తన రక్తాన్ని తానే తుడుచుకుని, తన కుట్లు తానే వేసుకున్నారా? అసలు ఆ కార్యక్రమానికి కర్మ-కర్త-క్రియ ఎవరు? సీబీఐ చెప్పినట్లు తెల్లవారుఝాము నుంచి గంటలపాటు ఫోన్లలో చర్చించుకుంది ఎవరు? ఆ చర్చల్లో అల్లుడు కూడా ఉంటే, సీబీఐ విచారణలో అది ఎందుకు బయటపడలేదు?

అసలు అల్లుడే హంతకుడయితే, గుండెపోటుతో మరణించారని ఎంపి విజయసాయిరెడ్డి ఎలా ఖచ్చితంగా చెప్పారు? వైసీపీ అధికార మీడియా కూడా, తొలుత గుండెపోటు మరణంగా ఎలా ప్రకటించింది? ఆ తర్వాత దానిని ‘నారా’సురరక్త చరిత్ర గా ఎలా తేల్చారు? ఎవరు తేల్చారు? అప్పుడు నిజంగా వివేకా హత్య వెనుక చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించిన ఇప్పటి ప్రభుత్వంలోని ప్రముఖులు.. మరి ఇప్పుడు కోర్టులో నాలుక మడతేసి, వివేకా అల్లుడే అసలు హంతకుడన్న నిర్ధరణతో ఎలా వాదిస్తారు? అంటే.. వివేకా హత్య కేసులో ‘నారాసుర రక్తచరిత్ర ’ కాకుండా.. ఎవరైనా గానీ దానివెనుక ‘కుటుంబ రక్తచరిత్రే’ ఉన్నట్లు, మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధం కావడం లేదూ?!

 

LEAVE A RESPONSE