-మోదీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారు
-పేపర్ లీకేజిపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది
-నిరసన కార్యక్రమాల నేపథ్యంలో ఏప్రిల్ 6 వరకు యాత్ర వాయిదా
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడం దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తోందని… అందులో భాగంగానే రాహుల్‌పై అనర్హత అని ధ్వజమెత్తారు. దేశం అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. ప్రధాని మోదీ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి వైఖరి దుర్మార్గమని అన్నారు. కోర్టు కూడా 30 రోజులు అప్పీల్‌కు టైం ఇచ్చిందని.. అలాంటప్పుడు అనర్హత వేటు ఎందుకు అని ప్రశ్నించారు. మోదీ కాల గర్భంలో కలిసిపోతారని శాపనార్థాలు పెట్టారు. రాహుల్‌కు తాము అంతా అండగా ఉంటామని తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ ఎండగట్టారని.. దాన్ని మోడీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మోదీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదానీ – మోదీ చీకటి స్నేహంపై రాహుల్ గాంధీ నిలదీశారన్నారు. అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోదీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు. ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
యాత్ర వాయిదా
ఏప్రిల్ 2వ వారంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ నిరసన కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పాదయాత్రను ఏప్రిల్ 6 వరకు తన పాదయాత్రను వాయిదా వేసుకున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు పేపర్ లీకేజిపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని. విద్యార్థుల జీవితాలను ఈ ప్రభుత్వం చీకట్లోకి నెడుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్టులను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. 50 లక్షల నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ చెలగాటమాడుతోందని విమర్శించారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీలో 24, 25న నిరసన తెలపాలనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిరసనలో పాల్గొని నిరుద్యోగులకు అండగా నిలబడాలనుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడతో మమ్మల్ని నిర్బంధించిందని ధ్వజమెత్తారు. ఓయూలో నిరుద్యోగ నిరసనలో పాల్గొనాల్సిన నన్ను వందలాది మంది పోలీసులను పెట్టి గృహానిర్బంధం చేశారు. అక్రమ నిర్బంధాలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ ఆటవిక చర్య. కాంగ్రెస్ నాయకులను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేరాల్ని కప్పిపుచుకోవడానికె ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడుతోందన్నారు. అనర్హులను టీఎస్పీఎస్సీలో సభ్యులుగా నియమించారు. నిబంధనలు ఉల్లంఘించి టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించడాన్ని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినాయక రెడ్డి కోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంపై హైకోర్టు జడ్జి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం ఎలా తీసుకుందని కౌంటర్ వేయాలని హైకోర్టు సూచించింది. కానీ ప్రభుత్వం కౌంటర్ వేయకుండా వాయిదాలు తీసుకుంది. అనర్హులకు అందలం వేయడం వల్లే ఈ అనర్థం జరిగిందన్నారు.
ఆ 90 మంది స్పెషలా
లాలాగూడలోని ఎస్ ఎఫ్ ఎస్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో 90 మంది అభ్యర్థులకు మధ్యాహ్నం 1 నుంచి 3.30 వరకు గ్రూప్-1 పరీక్ష రాయించినట్లు పత్రికల్లో వచ్చాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే నిర్వహించాల్సిన పరీక్షను సమయం దాటిన తరువాత కొందరికి పరీక్ష నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు కనిపిస్తున్నా.. పరీక్షల నిర్వహణలో లోపాలు జరిగాయని స్పష్టంగా ఉన్నా… ఈ అంశాలపై సిట్ అధికారి విచారణ చేయడం లేదు. ఈ వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చిందంటే ఇందులో పెద్దల హస్తం ఉంది. ఇది మా నిర్దిష్టమైన ఆరోపణ
సిట్ వెనుక గూడుపుఠానీ
కేసు సిట్ కు బదిలీ చేయడం వెనక గూడుపుఠానీ దాగుంది. కేసును నీరుగార్చడానికే పేపర్ లీక్ కేసును సిట్ కు బదిలీ చేశారు. ఈ కేసులో మొదట విచారణ చేయాల్సింది కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మీనే. నిందితురాలిగా ఉండాల్సిన శంకర లక్ష్మీని విట్ నెస్ గా చూపించారు. ఈ కేసులో ఏ1 ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగి. నిబంధనల మేరకు ప్రభుత్వాన్నిసమాచారాన్ని తిరస్కరించి అమ్ముకునందుకు ప్రవీణ్ పై అవినీతి నిరోధక సెక్షన్స్ పెట్టాల్సి ఉంది. తద్వారా ఏసీబీ కోర్టులో నిందుతుడి విచారణ త్వరగా జరిగేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆ ఆపని చేయలేదు. ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులను కూడా సిట్ లో పెట్టాలి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రత్యక్షంగా కేటీఆర్ కు సంబంధం ఉంది. ఈ కేసులో ఏ2 రాజశేఖర్ రెడ్డి..ఐటీ శాఖ పరిధిలోని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ (టీఎస్ టీఎస్) ద్వారా ఔట్ సోర్సింగ్ ఏజెన్నీ ద్వారా నియమితుడైన వ్యక్తి. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, వాటికి సంబంధించి చెల్లిస్తున్న జీతాలకు సంబంధింది 2016 వరకు సమాచారం వెబ్ సైట్లో ఉంది. తర్వాత సమాచారాన్ని వెబ్ సైట్ నుంచి తొలగించారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2021 టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. లాలగూడలోసమయం దాటినా తరువాత జరిగిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి అందరినీ విచారించాలి. అవినీతి నిరోధక శాఖ పరిధిలో ఉండే సెక్షన్ అన్నింటినీ కేసులో పొందుపరచాలి. శంకర లక్ష్మీ చేతిలో ఉండాల్సిన తాళాలు ఎవరి చేతిలోకి వెళ్లాయో తేల్చాలి. పెద్ద తలల్ని సిట్ విచారణ చేయాల్సిందే. శంకర లక్ష్మిని సాక్షిగా కాదు.. నిందితులుగా చేర్చాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆందోళనలకు పిలుపు
కాంగ్రెస్ శ్రేణులంతా ఓయూ నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొనాలి ఓయూ నిరసన దీక్షలో పాల్గొనేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా అన్నారు. 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని యూనివర్సిటీల విద్యార్థులను కలవాలని నిర్ణయించుకున్నాం. ముఖ్య నాయకులతో ఢిల్లీకి వెళ్లి ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు పిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దీక్షకు వెళ్లకుండా రేవంత్ హౌస్ అరెస్ట్
శుక్రవారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించాలని రేవంత్ రెడ్డి కి ఓయూ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. “ పోలీసులను పంపి, నన్ను గృహనిర్భందం చేయడం కాదు… కేసీఆర్ – కేటీఆర్ లకు దమ్ముంటే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల కుంభకోణం పై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో చర్చకు రావాలి. మీరు సచ్ఛీలురైతే, స్కాంలో మీ పాత్రలేకపోతే నా సవాల్ ను స్వీకరించాలి” అని తన హౌస్ అరెస్టును నిరసిస్తూ ట్వీట్ చేశారు.