జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
అధికార పక్షం బాధ్యత విస్మరించిన చోట కచ్చితంగా ప్రతిపక్షం ప్రజల కోసం నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది కీలక భూమిక. ప్రతిపక్ష పార్టీలను నిలువరించాలని చూస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బ తింటుంది. ఈ రోజు ప్రకాశం జిల్లా యరగొండపాలెంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమంపై రాళ్ళ దాడికి పాల్పడటాన్ని ఖండిస్తున్నాను. ఆయన భద్రత సిబ్బందికి గాయాలు అయ్యాయని తెలిసింది. ప్రతిపక్ష నాయకుల పర్యటనలకు తగిన భద్రత కల్పించడంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను చూసి అధికారంలో ఉన్న వైసీపీ ఎందుకింత అభద్రతకు లోనవుతుందో అర్థం కావడం లేదు. వైసీపీ పాలకులు తమ పాలన ప్రజాహితంగా ఉందని భావించి ఉంటే ఇలాంటి అభద్రతకు గురై ఉండేవారు కాదు. ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే ప్రతి సందర్భంలో అధికార పక్షం అసహనానికి లోనవుతోంది.
నేను విశాఖలో జనవాణి కార్యక్రమానికి వెళ్లినప్పుడు పాలకులు వ్యవస్థలను వాడుకొని ఏ విధంగా ప్రవర్తించారో చూశారు. పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి దాడులకు పాల్పడి, ఆటంకాలు కల్పించడం ద్వారా- తాము ఏం కోల్పోబోతున్నారో ముందుగానే వెల్లడిస్తున్నట్లు ఉంది.