Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం, జనసేన కలయికతో ప్రజా చైతన్యం

-ప్రజా చైతన్యానికి విశాఖలో వెలసిన బ్యానర్లే నిదర్శనం
-నోటుకు ఓటు అమ్ముకోవద్దు… ఓటును అమ్ముకోవడం నేరం
-ప్లాట్ల పంపిణీకి లేఅవుట్ అన్నది ముఖ్యం… లేఅవుట్ లేకుండానే ఉచితంగానైనా ప్లాట్లను ఎలా పంపిణీ చేస్తారు?
-హైకోర్టులో తీర్పులను రిజర్వులో పెట్టడం వల్ల ఆలస్యం అవుతున్న న్యాయం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తెలుగుదేశం, జనసేన పార్టీల అధినాయకుల కలయికతో ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తుతోంది. రాబోయే ఎన్నికల్లో విజయం తమదేననే దమ్ము, ధైర్యం ఆ రెండు పార్టీల శ్రేణులకు వచ్చింది. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ, విశాఖపట్నంలో జన జాగరణ సమితి పేరిట దారి పొడవునా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లే ప్రజల్లో వచ్చిన చైతన్యానికి నిదర్శనమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. టిడిపి, జనసేన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, వారిలో తెలియని ఏదో భయం ఉండేది. ఈ రాక్షసుడు ఎవరిని పడితే వారిని అక్రమంగా అరెస్టు చేయించి బాదేస్తున్నాడని ఆందోళన కనిపించేది. ఒక ఎంపీ ని అక్రమ కేసులో అరెస్టు చేసి లాకప్లో చిత్రహింసలకు గురి చేయగా, మాజీ మంత్రిని అక్రమ కేసులో అరెస్టు చేయడం, మాజీ ముఖ్యమంత్రి పై రాళ్లదాడి వంటి ఘటనలతో నిన్న, మొన్నటి వరకు టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు భయాందోళనలో ఉన్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలితే తాము అధికారంలోకి రాగలమా? అనే భయం ఆ పార్టీ శ్రేణులలో ఉన్న మాట నిజం.

భయం లేదని సరిపెట్టుకున్న, ఉన్నమాట వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలయికతో రానున్న ఎన్నికల్లో గెలుపు పై రెండు పార్టీలలోను దీమా కనిపిస్తోందన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘు రామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మాజీ మంత్రి శంకర్ నారాయణ పై తమ పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు చేశారంటే అదేమీ చిన్న విషయం కాదు. యలమంచిలి ఎమ్మెల్యే ను కూడా ప్రజల ఘోరవ్ చేయబోతే, ఆయన వారిపై చేయి చేసుకున్నట్లుగా తెలిసింది. ప్రజల్లో వచ్చిన ఈ చైతన్యం దినదినాభివృద్ధి కాదు… క్షణక్షణాభివృద్ధి చెందుతుందన్నారు.

ధర్మాన చేసిన వ్యాఖ్యలు మరొకరు చేసి ఉంటే… సిఐడి పోలీసులు కేసు నమోదు చేసేవారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు మరొకరు చేసి ఉంటే సిఐడి పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి ఉండేవారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రజలు రోడ్డు బాగాలేదని ఆయన దృష్టికి తీసుకురాగా, ఆగ్రహం వ్యక్తం చేస్తూ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించడమే కాకుండా, రోడ్డు వేయడానికి డబ్బులు కావాలి… ప్రజలు తమ వ్యక్తిగత అకౌంట్లోను డబ్బులు జమ చేయమంటారు,ఇక ప్రభుత్వ ఖజానాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని ఎదురు ప్రశ్నించారు.

అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రిని సైకో, పిచ్చోడు అంటారా అని ఎవరు అన్నారో చెప్పకుండా, మంత్రి పేర్కొనడం ఆశ్చర్యకరం. ముఖ్యమంత్రిని తాము ప్రేమిస్తున్నట్టుగా, ధర్మాన ప్రసాదరావు ప్రేమిస్తున్నట్టు లేదు. అందుకే శల్య సారథ్యం వహిస్తున్నట్టనిపిస్తోంది. ధర్మాన మాటలను అర్థం చేసుకుంటే మా ప్రభుత్వానికి పార్టీకి మంచిది. బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు పార్టీ పదవి అవసరం లేదని రాజీనామా చేశారు. గతంలో ఎవరికీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అందరినీ పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.

తాను పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నాలుగు మంచి మాటలు చెబితే తనని లోక్ సభ సభ్యుడిగా అనర్హుడి గా ప్రకటించాలని కోరుతూ, ఢిల్లీ లో తీవ్ర ప్రయత్నాలు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అలిగితే, పిలిపించుకొని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, ఒక్క రెడ్లను మాత్రమే పిలిపించుకొని మాట్లాడుతారా?, ఇతర కులాల వారిని పిలవరా?, తన పేరు కూడా రఘురామకృష్ణం రెడ్డి అయితే పిలిచి ఉండేవారేమో?, తనని ఒక వేళ పిలిచిన ఒప్పేసుకొని వచ్చే వాని కాదు. తనని పిలవకపోవడం మంచిదయ్యింది. బానిస మనస్తత్వం కలిగిన వారే ఈ తరహా ప్రలోభాలకు లొంగి పోతారన్నారు.

అమరావతి పై జగన్ పగ బునారు
ప్రతిపక్ష నేత హోదాలో ఎన్నో కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మాట మార్చడమే కాకుండా, అమరావతిపై పగ బునారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన 1134 ఎకరాల భూమిని, పేదలు గుడిసెలు వేసుకోవడానికి పంచాలని నిర్ణయించారు. తనది కానీ భూమిని, పేదవానికి పంచనివ్వరా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమరావతి రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్ర హైకోర్టులో ఐదు నెలల క్రితం రిజర్వ్ చేసిన తీర్పు ఇప్పటికీ వెలువరించలేదు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన పనులను తాను చేసుకుంటూనే ఉంది. వారం రోజుల వ్యవధిలోనే అమరావతిలో పేదలకు భూములు పంచాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

పేదలకు ప్లాట్లను ఉచితంగా పంచాలన్నా, ప్లాట్లు అభివృద్ధి చేసి విక్రయించాలన్న అర్బన్ డెవలప్మెంట్ చట్టం ప్రకారం లే అవుట్ ను రూపొందించి సంబంధిత ప్రభుత్వ శాఖ నుంచి అనుమతి పొందాలి. మునిసిపాలిటీ ప్రాంతంలో 50వేల మంది ప్రజలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించినప్పుడు, ప్రజలకు నీటి సౌకర్యం, డ్రైనేజీ వసతి వంటివి అభివృద్ధి చేయకుండానే ప్లాట్లను ఉచితంగా పంపిణీ చేస్తే సరిపోతుందా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్లాట్ల పంపిణీకి లేఅవుట్ రూపొందించడం అన్నది తప్పనిసరి అని మున్సిపల్ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదా?, వారికి ఇంగిత జ్ఞానం లేదా?, లేకపోతే అధికారులకు దిమాక్ దొబ్బిందా?, పేదలకు పంచుతానని చెబుతున్న స్థలం అమరావతి లో తుప్పల మధ్య ఉన్నది. లేఅవుట్ అభివృద్ధి చేయకుండానే, అలాగే ఎలా పంచుతారని రఘురామకృష్ణం రాజు నిలదీశారు.

ఏ ప్రాతిపదికన ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయిస్తారు?
అమరావతి రాజధాని ప్రాంతంలో 50వేల మందికి సెంటు చొప్పున ప్లాట్ లను కేటాయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రాతిపదికన లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయిస్తుందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. పాట్లను కేటాయించడానికి అనుసరిస్తున్న విధానం ఏమిటో చెప్పాలి. లబ్ధిదారుల ఎంపికకు ఎంచుకున్న మార్గదర్శకాలు ఏమిటన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పష్టం చేయాలి. రాజధాని ప్రాంతంలో ప్లాట్లను కేటాయిస్తామని, పేదలను ఏమైనా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారా? అంటూ నిలదీశారు. అమరావతి అద్భుత నగరంగా అభివృద్ధి చెందుతుందని, రేపు మరొక ప్రభుత్వం ఏర్పడితే మహర్దశ ఖాయమని తెలిసే, విశాఖకు పారిపోతానని చెబుతున్న ముఖ్యమంత్రి, స్థానికంగా లేఅవుట్ రూపొందించకుండానే పేదలకు ఇంటి స్థలాలను మంచి పెడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడడం ఖాయమన్నారు.

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటమన్నట్టు అమరావతి రైతుల పరిస్థితి
పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా అమరావతి రైతుల పరిస్థితి తయారయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పై హైకోర్టులో అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలను విని తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం, మళ్లీ వాదనలను వింటానని పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తుంది. తీర్పు రిజర్వు చేసిన తర్వాత మళ్లీ వాదనలను వింటానని పేర్కొనడం వింతగా ఉంది. ఇప్పటికే ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి ఒకరు కారణాలు చెప్పకుండానే, బెంచ్ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. బుధవారం నాడైనా ఈ కేసులో వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువరిస్తారా?, మళ్లీ రిజర్వ్ లో పెడతారా అన్న సందేహాలు లేకపోలేదన్నారు.

సాక్షి కొనుగోళ్లపై కేసు వేసినందుకే రామోజీరావుకు వేధింపులు
సాక్షి దినపత్రిక ప్రతులను ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేయడాన్ని న్యాయస్థానంలో ఉషోదయ పబ్లికేషన్స్ పేరిట ప్రశ్నించినందుకే పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావును, రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తోంది. ప్రజాధనంతో సాక్షి దినపత్రిక కొనుగోలుకు జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో, ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీం కోర్టు ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదలాయిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిత్యం పని ఒత్తిడి లో ఉండడం వల్ల తీర్పులు ఇవ్వలేకపోతున్నారేమోనంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 1 పై కూడా రాష్ట్ర హైకోర్టు వాదనలు విని, తీర్పు రిజర్వు చేయడంతో పిటిషన్ దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర స్టే ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టుకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని పిటిషన్ దారులకు సుప్రీంకోర్టు సూచించింది. అలాగే సుప్రీం కోర్టు ఆర్డర్ ను చూపెట్టాలని పేర్కొంది. త్వరగా కేసులు తేల్చమని హైకోర్టును కోరాలని చెప్పిందన్నారు.

వ్యవస్థలపై నమ్మకం కోల్పోయే విధంగా వ్యవహరించవద్దు
న్యాయ స్థానాలు న్యాయం చేయడమే కాదు… న్యాయం చేస్తున్నట్లుగా కనిపించాలి. వ్యవస్థలపై నమ్మకం పోయే పరిస్థితి కల్పించవద్దు. సుప్రీం కోర్టుకు వెళ్తే కచ్చితంగా న్యాయం జరుగుతుంది. అలాగని హైకోర్టులో న్యాయం జరగదని చెప్పడం లేదు. హైకోర్టులో న్యాయం జరగడం ఆలస్యం అవుతోంది. అమరావతి ప్రాంతంలో ప్లాట్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదనకుతూహలంతో ఉన్నారు.

లేఅవుట్ రూపొందించకుండా ప్లాట్లు పంపిణీ చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పై స్టే ఇచ్చి, తీర్పు ఇచ్చే వరకు ప్లాట్ల పంపిణీ చేయకుండా నిరోధించండి. న్యాయస్థానాలలో రాజకీయ నాయకులను దగ్గరకు రానివ్వరు. రాజకీయ నేతల ప్రమేయం లేకపోయినప్పటికీ ఉందేమోనని అనుమానం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వ్యవస్థలకు ఏమాత్రం మంచిది కాదు. ప్రజల విశ్వాసం సన్నగిల్ల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.

LEAVE A RESPONSE