-ఎన్ని కేసులు పెట్టినా.. ఎంత వేధించినా.. బీసీలంతా టీడీపీతోనే
-ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ అరెస్టు.. జగన్ రెడ్డి అరాచకానికి పరాకాష్ట
-ఎంత తొక్కితే.. అంత పైకి లేస్తాం.. జగన్ రెడ్డిని పాతాళానికి తొక్కుతాం
బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అక్రమ కేసులు పెట్టడం, వేధింపులకు దిగడం, ఆర్ధిక మూలాలను దెబ్బతీయడం ద్వారా బీసీలను ఎదగనీయకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు.
ఎలాంటి చిన్న ఫిర్యాదు కూడా లేనప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గకుండా ప్రజాస్వామ్యబద్దంగా ఓటు వేసినందుకు ఆదిరెడ్డి భవానీ భర్త, మామపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడు జగన్ రెడ్డి. సుమారు 11 సీబీఐ కేసులు, 8 ఈడీ కేసులు సహా 38 కేసులు నెత్తిన ఉన్నాయి. దీనికితోడు బాబాయి బాత్రూం మర్డర్ కేసు, కోడికత్తి కేసు వంటి కేసులు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి ఒక్క రోజు కూడా కోర్టు విచారణకు హాజరవ్వకుండా ఎగ్గొట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు.
అదే సమయంలో వైసీపీ నేత, మళ్ల విజయ్ ప్రసాద్ సుమారు రూ.4వేల కోట్ల చిట్ ఫండ్స్ స్కాంలో ఒడిశా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. అయినప్పటికీ జగన్ రెడ్డి స్పందించలేదు. అదే విధంగా అగ్రిగోల్డ్ భూముల విషయంలోనూ జగన్ రెడ్డి మౌనం వహిస్తున్నాడు. ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఏ ఒక్క డిపాజిటర్ కూడా మోసపోయామని చెప్పలేదు. అయినా తప్పుడు కేసులు పెట్టి బీసీలను అణగదొక్కుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి బీసీలను అణగదొక్కాలని ప్రయత్నించడం అరచేతితో సూర్యుడిని అడ్డుకోవడమేనని జగన్ రెడ్డి తెలుసుకోవాలని పేర్కొన్నారు.
ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని పునాదులతో సహా కూల్చే మహాయజ్ఞానికి తొలి ఓటు బీసీలతోనే పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గంజాం రాఘవేంద్ర సహా పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.