-మోదీ-షా పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి
-ఖర్గేకు అండగా కన్నడ ప్రజలు ఉండాలి
-150 సీట్లతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది
-కర్ణాటక తీర్పుతో మోదీ-షాకు దిమ్మతిరగాలి
-ఖర్గే నేతృత్వంలో తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం
-కర్ణాటక ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
“కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మోదీ-షా ఓట్లు ఆడుగుతున్నారు” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంద్, చించోలి, సేడం నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
బీజేపీ నేతలు చెబుతున్నట్లు అభివృద్ధి జరిగితే మోదీ-షా ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తాం, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, 15 లక్షల నల్లధనం తెస్తాం, పేదలందరికి ఇళ్లు కట్టిస్తాం అని మాటచ్చి వాటిల్లో ఒక్కటీ నేరవేర్చకుండా ఇప్పుడు సిగ్గు లేకుంటా ఓట్ల కోసం మోదీ-షా గల్లీ గల్లీ తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు.
“గుజరాత్ ఎన్నికలప్పుడు..గుజరాతీలగా గుజరాత్ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు మోదీకే ఉందన్నారు బీజేపీ నేతలు. మల్లికార్జున ఖర్గే కర్ణాటక భూమి పుత్రుడు. ఆ లెక్కన కర్ణాటకలో ఓటు అడిగే హక్కు ఖర్గేకు మాత్రమే ఉంది. గుజరాతీ ఎన్నికల్లో మోదీ వెనుక ఆ రాష్ట్రం ఉన్నట్లే.. మల్లికార్జున వెనుక నిలబడాల్సిన బాధ్యత కన్నడ ప్రజలపై ఉంది. ఖర్గేకు అండగా నిలవాల్సిన సమయం అసన్నమైంది. గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఇందిరాగాంధీ వంటి వారు నిర్వహించిన ఏఐసీసీ అధ్యక్ష పదవిలో ఇప్పుడు ఖర్గే ఉన్నారు.
కర్ణాటక బిడ్డ మల్లికార్జున ఖర్గేను బీజేపీ కుట్ర చేసి ఓడించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షునిగా ఖర్గేను చేసి గౌరవించింది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటమెరుగని యోధుడు. మల్లికార్జున్ ఖర్గే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. 9 సార్లు అసెంబ్లీకి, 2 సార్లు పార్లమెంటు ఎన్నికైన నిఖార్సైన నేత. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర, కేంద్ర మంత్రిగా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. అటువంటి యోధుడిని ఓడించడానికి రాజ్ నాథ్ సింగ్ ను ఇంచార్జిగా నియమించి కుట్రను చేసింది. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను దుర్వినియోగం చేసి ఖర్గేను లక్ష్యంగా పని చేసి ఓటమి పాలయ్యేలా చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
“ కర్నాటకలో 40 శాతం కమీషన్ సర్కార్ అంట కదా… అని పక్క రాష్ట్రాల్లో పరువు తక్కువగా మాట్లాడే దుస్థితి ఈ బీజేపీ వల్ల వచ్చింది. సర్కారు 40 శాతం కమీషన్ తీసుకుంటుంటే చించోలి, అలంద్ ఎమ్మెల్యేలు అంతకు మించి 50 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఢిల్లీలోని మోదీ-షాకు దిమ్మతిరిగేలా కర్ణాటక ప్రజలు తీర్పునివ్వాలి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో సామాన్యుడి బతకలేని పరిస్థితి వచ్చిందన్నారు రేవంత్. పెట్రోల్ రూ. 55 నుంచి రూ.110, రూ.400 ఉన్న గ్యాస్ ధర రూ.1200 అయిందన్నారు.
మల్లికార్జున ఖర్గే మొదటి అడుగులోనే పార్టీ విజయాల బాటపట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఖర్గే నేతృత్వంలో మొన్న హిమాచల్ ప్రదేశ్ లో గెలిచాం. ఇప్పుడు 150 సీట్లతో కర్ణాటకలో అధికారంలోకి రాబోతున్నాం. రేపు తెలంగాణలో విజయం సాధించబోతున్నామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మేము ఎక్కడి నుంచో రాలేదు. మనమంతా ఒకటే కుటుంబం. హైదరాబాద్-కర్ణాటక ఒకటే కుటుంబం. హైదరాబాద్-కర్ణాటక.. హైదరాబాద్-తెలంగాణగా, హైదరాబాద్-కర్ణాటకగా విడిపోయాయి. మీకు ఏ కష్టం వచ్చిన కొడంగల్ రండి, లేకుంటే హైదరాబాద్ రండి. మీకు ఏ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉంటా” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఖర్గేను ఓడించడానికి మోదీ-షా ఇక్కడికి వచ్చి కుట్రలు చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు. వారి కుట్రలను భగ్నం చేసి మోదీ-షాకు దిమ్మదిరిగేలా కర్ణాటకలోని 40 శాతం కమీషన్ సర్కారును బొందపెట్టాలి, కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మోజార్టీతో గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.