Suryaa.co.in

Andhra Pradesh

చుక్కల భూముల పరిష్కారం వెనుక భారీ కుంభకోణం

– జగన్ రెడ్డి చెప్పే ప్రతి స్కీం వెనుక ఒక స్కాం
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

జగన్ రెడ్డి చెప్పే ప్రతి స్కీం వెనుక ఒక స్కాం దాగి ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. చుక్కల భూమి సమస్య పరిష్కారం పేరిట ఆయనిప్పుడు చేస్తున్న ఆర్భాట ప్రచారం వెనుక కూడా భారీ కుంభకోణం దాగి వుంది. దాని విలువ లక్ష కోట్లా లేక అంతకు రెట్టింపా అన్నది లోతైన విచారణ జరిపితే తప్ప బయట పడదు.

నిషేధిత భూముల పరిష్కారం కోసం రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్ట్ ఆదేశం ప్రకారం ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కమిటీ నియమించాలి. ప్రతి కమిటీలో ఒక రిటైర్డ్ జిల్లా జడ్జి తప్పనిసరిగా ఉండాలి. జిల్లా జడ్జి పర్యేవేక్షణలోనే నిషేధిత భూములకు విముక్తి కల్పించాలి. అందుకోసం ప్రజల నుంచి దరకాస్తులు ఆహ్వానించాలి.

ఈ ఆదేశాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2016 లో జి.ఓ నెంబర్ 300 , మళ్ళీ 2018 లో జీ.ఓ నెంబర్ 575 జారీ చేసింది. వాటి ప్రకారం అధికారులు ఒక పద్దతి ప్రకారం నిషేధిత భూముల సమస్య పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వ కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్ల పాటు ఆ ఆ సమస్యను పక్కన పెట్టేసారు. ఎన్నికల సంవత్సరంలో ఇప్పుడు వున్నట్లుండి చుక్కల భూములు, నిషేధిత భూముల విముక్తి పేరిట హడావుడి చేస్తున్నారు. ఇది చిత్తశుద్ధితో , ప్రజల సమస్య పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నం కాదు.

చుక్కల భూమి విముక్తి పేరుతో దేవాదాయ శాఖతో సహా వివిధ ప్రభుత్వ భూములను అక్రమంగా స్వంతం చేసుకోవడానికి జరుపుతున్న భారీ కుట్ర. వాన్ పిక్ కోసం సేకరించి, వివాదంలో వున్న భూములను సైతం ఆరగించేందుకు చుక్కల భూమి విముక్తి ప్రచారం చేస్తున్నారు. హైకోర్ట్ ఆదేశాల ప్రకారం తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రజలు దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే కమిటీ పరిశీలన చేయాలి.

కానీ ఎవరూ కోరకుండానే, ఎవరి నుంచి దరఖాస్తులు రాకున్నప్పటికీ, సుమోటోగా అధికారులతో వెరిఫికేషన్ చేయించి, వేలాది ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తప్పిస్తున్నారు. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేయడానికి కుట్ర చేస్తున్నారు. జగన్ చెప్తున్నది – 2 లక్షల ఎకరాల భూములకు విముక్తి కల్పించామని. కానీ అందులో ప్రజలకు సంబంధించి వివాదంలో వున్న భూములు కేవలం 35 వేల ఎకరాలు మాత్రమే. మిగతా లక్షా 75వేల ఎకరాల భూమిని జగన్ అనుచరులు, వైకాపా నాయకులు తేరగా స్వంతం చేసుకొంటున్నారు. వాటి విలువ లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుంది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని ముఠాలు నిషేధిత జాబితాను భూస్వాహాకు మార్గంగా వాడుకొంటున్నాయి. తమ మాట వినని, తాము అడిగిన చవక ధరకు భూములు అమ్మని వారిని, నిషేధిత జాబితాలో చేర్చేశామని బెదిరించిన సంఘటనలు కోకోల్లలు. రాష్ట్రంలో చుక్కల భూములు, నిషేధిత జాబితాలో వున్న భూములు 24 లక్షల ఎకరాల వరకు ఉన్నాయని అధికారుల అంచనా.

అంత భారీ సంఖ్యలో సమస్య వున్నప్పుడు రెండు లక్షల ఎకరాలను మాత్రం జాబితా నుంచి తొలగించి, చుక్కల భూముల సమస్య పరిష్కారం చేసేశామని ప్రచారం చేసుకోవడం ఏమిటి? ప్రభుత్వానికి నిజంగా చిట్టా శుద్ధి ఉంటే, మొత్తం నిషేధిత జాబితా భూముల మీద హైకోర్ట్ ఆదేశాలను పాటించి, జిల్లా జడ్జి నేతృత్వంలో పరిశీలన జరిపించాలి. చుక్కల భూములు, భూరక్ష, శాశ్వత భూమి హక్కు వంటి మోసపూరిత పథకాలతో ప్రజల భూములను దురాక్రమించే ప్రయత్నం మానుకోవాలి.

LEAVE A RESPONSE