-యువగళం పాదయాత్రలో షేక్ హుసేన్ బేగ్ తో లోకేష్ మాటా మంతీ
-వృద్ధురాలి చిరకాల కోరిక హజ్ యాత్ర వెళ్లేందుకు తానే సాయం అందిస్తానని భరోసా
– షేక్ హుసేన్ బేగ్ ఆత్మవిశ్వాసం, సేవాగుణం చూసి అభినందించిన లోకేష్
ఆ నిరుపేద ముస్లిం వృద్ధురాలికి హజ్ యాత్ర చేయాలనేది చిరకాల కోరిక. అరవై ఏళ్లు దాటిపోయాయి. ఏడాది క్రితం భర్త చనిపోయాడు. బతుకుబండిని నడిపిస్తున్న అవ్వకు మనవడిలా నడిచొచ్చి భరోసా ఇచ్చాడు నారా లోకేష్. నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, పార్నపల్లి గ్రామం మీదుగా యువగళం పాదయాత్ర సాగుతుండగా, దారిపక్కన షేక్ హుసేన్ బేగ్ అనే అరవై ఏళ్లకి పైబడిన వృద్ధురాలు సైకిల్ పంక్చర్ల షాపు నడుపుతూ లోకేష్‌కి కనిపించింది.
ఆ అవ్వతో మాట్లాడిన లోకేష్ అచ్చెరువొందారు. భర్త షేక్ అబ్దుల్ హకీమ్ (70) పంక్చర్ షాపు నడుపుతూ తనను పోషించేవాడని చెప్పింది. ఏడాది క్రితం కిడ్నీ సమస్యతో భర్త చనిపోవడంతో, గతంలో తాను నేర్చుకున్న సైకిల్ పంక్చర్లు ఇప్పుడు ఉపాధిగా మారిందని వివరించింది. రోజంతా పనిచేస్తే రూ.150 ఆదాయం రావడం కష్టంగా ఉందని, నెలకి కరెంటు బిల్లు మాత్రం రూ.500 దాటిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
హజ్ యాత్రకి వెళ్లాలనేది జీవితకాల కోరిక అనీ, దాని కోసం తినీ తినక ఓ పదివేలు దాచుకున్నానని, హజ్ వెళ్లాలంటే లక్షలు ఖర్చవుతాయని తెలిసి, దాచుకున్న ఆ పదివేలతో పేద మహిళలకి చీరలు కొని పంచేశానని చెప్పింది.
అరవై ఏళ్లు పైబడిన ఆ వృద్ధురాలు ఎవరిపై ఆధారపడకుండా, తన కాళ్లపై తాను నిలబడడం చూసిన లోకేష్ ఆమెని అభినందించారు. నిస్సహాయురాలైనా కలత చెందకుండా కష్టపడే తత్వం, దానగుణంతో నలుగురికి సేవ చేస్తున్న షేక్ హుసేన్ బేగ్ ఆదర్శ మహిళ అని కొనియాడారు. ఆమె జీవితకాల కోరిక అయిన హజ్ యాత్రకి తన సొంత ఖర్చుతో పంపుతానని లోకేష్ షేక్ హుసేన్ బేగ్ కి భరోసా ఇచ్చారు.