-గంజాయి, డ్రగ్స్ కట్టడిలో ఏపీ విఫలం
-కాపులకు హక్కుగా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి
-ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం… దానం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వడం లేదు
-పోర్టుల నిర్మాణ ప్రగతిని పరిశీలించాకే రుణ మొత్తాన్ని విడుదల చేయాలి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
గంజాయి, మాదకద్రవ్యాలకట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విఫలమయింది. ఈ మేరకు ఒరిస్సా రాష్ట్రం నుంచి ఫిర్యాదులు అందాయి. గంజాయి, మాదకద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని పొరుగు రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసింత కటువుగానే చెప్పినట్లు తెలిసిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు.
ప్రధానమంత్రి తో ముఖ్యమంత్రి భేటీ కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే ముగిసినట్టు తనకు సమాచారం ఉందని అన్నారు. ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి, శాలువాలు కప్పి సన్మానించడానికి ఒకటి రెండు నిమిషాల వ్యవధి పట్టి ఉంటుందన్నారు. ఇక తన వెంట తీసుకువెళ్లిన వినతి పత్రాన్ని అందజేసి ఉంటారన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సాక్షి దినపత్రికలో సడలని పట్టు అన్న శీర్షికతో వార్తా కథనం రాశారని ఎద్దేవా చేశారు. ఎన్నాళ్లపాటు సడలని పట్టు అంటూ ఆయన ప్రశ్నించారు.
సడలని పట్టు అంటే ఏమిటో చెప్పాలని నిలదీశారు. గత మూడున్నర ఏళ్లుగా చెప్పింది చెప్పి, దాన్ని సడలని పట్టు అంటారా అంటూ అపహాస్యం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రధానికి వివరించినట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,888 కోట్లు ఇవ్వడం లేదని ఇప్పించాలని కోరినట్లు, పోలవరం నిర్మాణానికి పదివేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించాలని, గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసినట్లుగాని మంజూరు చేయాలని కోరినట్లు చెప్పుకొచ్చారన్నారు. ప్రధానమంత్రిని అప్పు అడగడానికి వెళ్లిన ముఖ్యమంత్రి గెటప్ అదుర్స్ అని రఘురామకృష్ణం రాజు అపహస్యం చేశారు.
తెలుగుదేశం పార్టీ, జనసేన రానున్న ఎన్నికల్లో కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించినట్లు సాక్షి దినపత్రిక తో పాటు, ఆంధ్రప్రభ లో కథనాలు రాశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సాక్షి దినపత్రికలో ప్రధానితో ముఖ్యమంత్రి గంట సేపు మాట్లాడినట్లు వార్తా కథనాన్ని ప్రచురించగా, ఆంధ్రప్రభ లో 45 నిమిషాలు ముచ్చటించుకున్నట్లుగా వార్తా కథనాన్ని రాశారు. అదే ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలలో ఇదే తరహా వార్తా కథనాలు వచ్చి ఉంటే… ఏ బల్ల కింద కూర్చొని విన్నారని,ఎక్కడ నక్కి విన్నారని ప్రశ్నించే వారిని, ఇప్పుడు ఆంధ్రప్రభ ప్రతినిధి ఇప్పుడు ఈ బల్ల కింద కూర్చొని విన్నారని… ఎక్కడ నక్కి ఉండి విన్నారని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ, జనసేన లతోపాటు మీరు కూడా కలిసి వెళ్తే బ్యాడ్ అవుతారని ప్రధానికి జగన్మోహన్ రెడ్డి సూచించారట. మీరు వారితో కలవకపోవడం మంచిదని పేర్కొన్నారట. రానున్న ఎన్నికల్లోనూ మనమే గెలుస్తున్నామని చెప్పారంట అని ఆంధ్రప్రభ, సాక్షి దినపత్రికలలో వచ్చిన వార్తా కథనాలను అపహాస్యం చేశారు. అలాగే ప్రధానమంత్రి , ముఖ్యమంత్రి సూచనలపై సానుకూలంగా స్పందించినట్లు రాసుకున్నారని ఎద్దేవా చేశారు. అయితే, ముఖ్యమంత్రి మరింత అప్పు కావాలని అడగగా, నిబంధనల ప్రకారమే వెళ్తామని చెప్పడం జరిగిందన్నారు. సంబంధిత శాఖ మంత్రి తో మాట్లాడమని చెప్పినట్లుగా తనకు సమాచారం అందింది అన్నారు.
వచ్చే ఏడాది ఇచ్చే అప్పు కూడా, ఇప్పుడే అడ్వాన్స్ గా ఇవ్వాలని కోరగా … ప్రధానమంత్రి తన పరిమితులకు లోబడే అప్పును ఇవ్వగలరని చెప్పారు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రధానమంత్రికి వ్యక్తిగతంగా ఎంత ప్రేమ, ఆప్యాయత ఉండి ఉన్నప్పటికీ ఇవ్వటానికి వ్యక్తిగతంగా ఆయనకు అధికారం అనుమతి ఇవ్వదన్నారు. నిబంధనల ప్రకారం అది అంత సులువేమీ కాదని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 266, 293 కు పూర్తి విరుద్ధంగా రుణాలను మంజూరు చేయలేరన్నారు. రూల్స్ బెండు తీసి తమ ప్రభుత్వం ఇప్పటికే అప్పులు చేసిందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
పెన్షన్ తీసుకునే వారిపై ఆడిట్ జరిపిస్తామని చెబుతున్న ప్రభుత్వం, కార్పొరేషన్ అప్పులపై ఆడిట్ కు అవసరమైన కాగితాలను సమర్పించడం లేదన్నారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసిన జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం సభ్యులు ఋషికొండలో తామేమి నిబంధనలను ఉల్లంఘించలేదని చెప్పుకొచ్చినట్లు తెలిసిందన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం ఉందన్న ఆయన, దమ్మిడి పని చేయకపోయినా ఊరుకుంటున్న రాయలసీమ వాసులు ఎంతో గొప్ప వారిన్నారు. లక్షలు కోట్ల రూపాయల అప్పులు చేస్తున్న, ఇప్పటివరకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతిని ఎందుకు సాధించలేదో చెప్పాలన్నారు. ప్రధానిని 12 మెడికల్ కాలేజీ ల కోసం అనుమతి ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి, ముందుగానే ఎలా శంకుస్థాపన చేశారని ప్రశ్నించారు.
పోర్టుల నిర్మాణ ప్రగతిని పరిశీలించి అప్పులు ఇవ్వండి
మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులలో పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు అడిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందుకు సంతోషం. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించాక, నిధులను మంజూరు చేస్తున్నట్లుగానే, పోర్టుల నిర్మాణ ప్రగతిని చూసి… అప్పు మొత్తాన్ని విడుదల చేయాలని కోరాను. ఈ మేరకు సంబంధిత శాఖ మంత్రి ఆర్కేసింగ్, పి ఎఫ్ సి, ఆర్ ఐ సి చైర్మన్ లకు లేఖ రాశాను.
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను అణ పైసలతో సహా పూర్తిగా వారికి తెలిసే విధంగా వివరించాను. పోర్టుల కోసం అప్పులు చేసి, ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ మొత్తాన్ని దారి మళ్లించే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే, ఎత్తివేసిన పథకాలు ఎక్కువ అని తెలిపారు.
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం హక్కుగా భావించాలి
అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు కల్పించడం హక్కుగా భావించాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల రాసిన లేఖను ఈ సందర్భంగా ఆయన చదివి వినిపించారు. కాపులకు రిజర్వేషన్లను దానంగా ఇవ్వమని ముద్రగడ పద్మనాభం అడగడం కాపు సోదరులను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్న ఆయన, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ఈ పదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు వర్తింప చేయడానికి గత ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే నన్నారు.
అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టు కేసులను సాకుగా చూపెట్టి , ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు వర్తింప చేయలేదన్నారు. ఐక్యంగా ఉన్న కాపులను విడదీసే ప్రయత్నం మంచిది కాదన్నారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లను ఈ ప్రభుత్వం కాపులకు వర్తింప చేయకుంటే, రానున్న ప్రభుత్వం లో వర్తింప చేసేలా చర్యలు తీసుకుందామన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒకటవ రోజు రెండవ రోజు అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లను హక్కుగా తీసుకుందామని చెప్పారు. అంతేకానీ బిక్షగా అడగవద్దని కోరారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉన్నదని, జగన్మోహన్ రెడ్డి ఏమి తన సొంత ఆస్తులను దానం చేయడం లేదన్నారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు కాపులు పొందడం హక్కు అని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్న విషయం తెలిసిందేనన్నారు. పవన్ కళ్యాణ్ ను తాను ఏనాడు కాపు నేతగా చూడలేదన్న ఆయన ప్రజానేత గానే చూశానని పేర్కొన్నారు. ప్రజల్లో భాగమైన కాపుల హక్కుల కోసం ఆయన పోరాడుతున్నారన్నారు.
పోలీసు, ప్రభుత్వ వైఫల్యమే
చంద్రబాబు నాయుడు రోడ్ షో కి వేలాది మంది జనం హాజరవుతారని తెలిసిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ పరంగా నష్టపరిహారం ప్రకటించడం… పెనువెంటనే ప్రధానమంత్రి సైతం నష్టపరిహారాన్ని అందజేస్తున్నట్లుగా పేర్కొనడం జరిగిందన్నారు. ఇక ముఖ్యమంత్రికి ఇష్టం లేకపోయినా, ప్రభుత్వపరంగా నష్టపరిహారాన్ని ప్రకటించారని తెలిపారు.
ఈ సంఘటనపై మంత్రులు మాట్లాడిన తీరు ఘోరంగా ఉందని విమర్శించారు. సభకు కిక్కిరిసిన జనం హాజరు కావడంతో చంద్రబాబు నాయుడు ముందస్తుగానే హెచ్చరికలు చేశారని గుర్తు చేశారు. ఇరుకు సందులను మరింత ఇరుకు చేశారని సాక్షి దినపత్రికలో రాయడం విస్మయాన్ని కలిగించిందన్నారు. ఒక దుర్ఘటన జరిగితే బాధ్యత కలిగిన దినపత్రిక వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికే మసకబారిన మన ప్రతిష్టను, మరింత దిగజారిచే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు రోడ్ షోలకు ఇంతమంది జనం హాజరయ్యారా? అంటూ ప్రశ్నించిన ఆయన, 2019 లోని సీన్ మళ్లీ రిపీట్ అవుతోందని అన్నారు . గతంలో జగన్ సభలకు కూడా ఇలాగే ప్రజాస్పందన లభించిందని గుర్తు చేశారు. ఇప్పుడు వ్యక్తులు మారారు అంతే… అని అన్నారు. ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సభలకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, బస్సులు ఏర్పాటు చేసి, బిర్యానీ ప్యాకెట్లు పంచిన జనం హాజరు కావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు రోడ్ షోలకు జనం స్వచ్ఛందంగా హాజరవుతున్నారని చెప్పారు.
ప్రధాన కూడలిలో మీటింగు ఏర్పాటు చేయవచ్చు కదా అని సాక్షి దినపత్రికలో ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాన కూడలిలో మీటింగు ఏర్పాటు చేస్తే, ట్రాఫిక్ ఇబ్బందులను సాకుగా చూపి అనుమతి ఇస్తారా అంటూ నిలదీశారు. చంద్రబాబు నాయుడు రోడ్ షోలకు హాజరవుతున్నట్లుగా, మన సభలకు ప్రజలు హాజరు కావాలంటే వారి హృదయాలను గెలుచుకోవాలని సూచించారు. నిజాలు చెప్పే వాళ్లను ఎలా తిట్టించాలో… ఎలా కొట్టించాలో అని ఆలోచించడం మాని, అకృత్యాలను వీడాలన్నారు.
గతంలో జగన్ మంచి మాటలు మాట్లాడేవారని, ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దన్నారు. కందుకూరు లో జరిగిన దుర్ఘటనపై తక్షణమే స్పందించిన చంద్రబాబు నాయుడు ను, ఆ పార్టీ నేతలను అభినందిస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలియజేశారు.