Suryaa.co.in

Andhra Pradesh

నిత్య కృషీవలుడు…. నిరంతర పోరాటయోధుడు

• నిరంతరం ప్రజాక్షేత్రంలో…
• నవ్యాంధ్ర విధ్వంసానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం
• ప్రతి అడుగు యజ్ఞసమానమే
• వయసుతో నిమిత్తం లేకుండా నిరంతర శ్రమ
• చంద్రబాబు పోరాటపటిమ చూసి విస్మయం చెందుతున్న ప్రజలు
• పదిరోజుల జలపోరాటంతో వెల్లివిరుస్తున్న ప్రజాచైతన్యం
• జగనాంధకారం త్వరలో వీడిపోతుందని ప్రజలకు చంద్రబాబు భరోసా
– ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నా, లేకున్నా విరామం లేకుండా కష్టపడతారని గత 40ఏళ్లకు పైగా ఆయన రాజకీయ జీవితాన్ని గమనించిన వారందరికీ తెలుసు. అయితే… వయసు మీరుతున్నా గత రెండేళ్లుగా జగన్ రెడ్డి దెబ్బకు విధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి ఆయన చేస్తున్న శ్రమ ప్రజలను, రాజకీయ నాయకులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అందరి నోళ్లల్లో ఒకటే ప్రశ్న… ఈ వయసులో చంద్రబాబుకు అంతశక్తి, ఉత్సాహం ఎలా వస్తున్నాయని?

ఏ వ్యక్తికైనా సామాజికహితం కోసం బలమైన దీక్ష ఉన్నప్పుడు ఆ వ్యక్తి సహజ శక్తి పలు రెట్లు పెరుగుతుందని మానసిక నిపుణుల అభిప్రాయం. వ్యక్తిగత ప్రయోజనం కోసం ఆరాటపడేటప్పటి కంటే పలువురి హితం కోసం పాటుపడే వారు మరింత బలశాలులు అవుతారు. ఈ సూత్రం 72 ఏళ్ల యువకుడు చంద్రబాబుకి పూర్తిగా అన్వయిస్తుందని వారంటున్నారు.

చంద్రబాబు దీక్ష – వికసిత నవ్యాంధ్ర
తప్పనిసరి పరిస్థితుల్లో నవ్యాంధ్ర ఏర్పడిన అనంతర ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒక దీక్ష పట్టారు. ఆనాటి అగమ్యగోచర పరిస్థితుల్లో పసికూన నవ్యాంధ్రను శీఘ్రగతిన ప్రగతి తీరాలకు చేర్చి ప్రజలకు, యువతకు ఓ ఉన్నత భవిష్యత్ ను కలిగించాలనే తపన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు ఆయన్ని నడిపించింది.

రేయింబవళ్లు శ్రమించి నూతన నవ్యాంధ్రకోసం పక్కా ప్రణాళికలు రూపొందించి కొద్దికాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటపై పరుగులెత్తిం చారు. అయితే… 2019 ఎన్నికల్లో ప్రజల ఆలోచన వేరుగా ఉండటంతో… నవ్యాంధ్ర గాడి తప్పింది. దీంతో.. తాను కన్న కల చెదిరిపోవడంతో చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

బాధ్యత కలిగిన ప్రతిపక్షనాయకునిగా రెట్టించిన పట్టుదల, శక్తితో రోడ్డెక్కి ప్రజలను చైతన్యవంతుల్ని చేసి నవ్యాంధ్ర విధ్వంసాన్ని అడ్డుకోవడానికి నిరం తరం చంద్రబాబు కృషిచేస్తున్నారు. ఆయనకు ప్రజలనుంచి వస్తున్న స్పందనను చూసి కలవరపడిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి… చంద్రబాబుని అడ్డుకోవడానికి చేయని అకృత్యం లేదు. అధికారపార్టీ, పోలీస్ యంత్రాంగం దురాగతాల నన్నింటినీ అధిగమిస్తూ ప్రజలకోసం చంద్రబాబు ముందుకు సాగుతూ వచ్చారు.

ప్రజావ్యతిరేకత పెల్లుబుకి తనకు అధికారగండం తప్పదని భావించిన జగన్ రెడ్డి ఇంకా దిగజారి చంద్రబాబుపై దాడుల తీవ్రతను ఉధృతం చేశాడు. ప్రజాస్వామ్య పరిధుల్లోనే నడుచుకుంటూ జగన్ రెడ్డి కుట్రలను ధీటుగా చంద్రబాబు అడ్డుకోవడంతో అధికార శిబిరం ఇంకా కలవరపడింది. అధికారపార్టీ, పోలీస్ యంత్రాంగాల అరాచ కాలకు గురవుతున్న తెలుగుదేశం నాయకులు, శ్రేణులకు పూర్తి అండగా ఉంటూ వారిలో ధైర్యాన్ని ఇనుమడింపచేశారు చంద్రబాబు.

నవ్యాంధ్ర పునరుజ్జీవన కోసం ఆరాటం, పోరాటం ఒకవైపు… సహచరులను కాపాడుకోవడం నిరంతర రాజకీయ పోరాటం మరోవైపు..ఈ సవాళ్లతో రెట్టించిన ఉత్సాహం, శక్తితో ఈ వయసులో నూతన చంద్రబాబు ఆవిష్కరింపబడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

నిరంతర పోరుబాట
కరోనా మబ్బులు వీడగానే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి దూకి, అధికార పార్టీ విధ్వంసాలకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు నడిపించారు. బాదుడే బాదుడు, ఇదేంఖర్మ రాష్ట్రానికి వంటి చైతన్యపూరిత కార్యక్రమాలతో పార్టీ యంత్రాంగాన్ని, ప్రజలను ఉత్తేజపరిచారు. ప్రతి కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టారు. 45 ఏళ్ల ముఖ్యమంత్రి నిరంతరం తాడేపల్లి ప్యాలెస్ లో విలాసంగా జీవిస్తూ పబ్జీ, ఇతర ఆన్ లైన్ క్రీడల్లో మునిగి తేలుతుంటే.. 70 ఏళ్లు దాటిన చంద్రబాబు సుడిగాలిలా రాష్ట్రామంతా పర్యటిస్తూ కష్టాల కడలిలో ఈదు తున్న సామాన్యుడికి .. నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మానసికత, మంత్రులు, సీనియర్ నేతల అక్రమాలు, అరాచకాలను ఎండగడుతూ… వాటి పర్యవసానంగా సామాన్యుడు పడుతున్న కష్టాలను కళ్లకు అద్దినట్టు చంద్రబాబు వివరిస్తున్నారు. నల్లమబ్బులు ఎల్లకాలం ఉండవని … నవ్యాంధ్రను కమ్ముకున్న జగనాంధకారం త్వరలోనే వీడిపోతుందని, ప్రజలకు ఉజ్వల భవిష్యత్ తిరిగి సాక్షాత్కారమవుతుందని చెప్తూ ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు చంద్రబాబు.

జలంకోసం.. జనంకోసం
రాష్ట్రంలో దాదాపు 70శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఇప్పటికీ జీవిస్తున్నారు. రైతు బాగుంటేనే పేదలు, కూలీలు సుఖంగా ఉంటారనేది సర్వ విదితం. దీనికి సాగునీటి లభ్యత అత్యవసరం. ఈ కనీస జ్ఞానం కూడా లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ విధ్వంసం చేశాడు. వ్యవసాయరంగం కోలుకోకపోతే నవ్యాంధ్ర ప్రగతి పూర్తిగా కుదేలవుతుం దని ఆందోళన చెందిన చంద్రబాబు జగన్ విధ్వంసంపై ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం కోసం నాలుగంచెల ప్రణాళిక రూపొందించారు.

ఈ నెల మొదటిన యుద్ధభేరి యాత్ర ప్రారంభించక ముందు కేంద్ర పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాల్లో… మొదటగా రైతన్నకు జగన్ శాపంగా మారిన వైనాన్ని, తరువాత రాష్ట్రంలోని మూడుప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యంచేసిన తీరును పూసగుచ్చినట్టు వివరించారు. అనంతరం యుద్ధభేరి యాత్ర ప్రారంభించి జిల్లాలు, ప్రాజెక్టులు వారీగా నేటి దుస్థితిని ప్రజల దృష్టికి తీసు కొచ్చారు.

పదిరోజుల యుద్ధభేరి యాత్రలో 20 జిల్లాల్లో 3వేల కిలోమీటర్లు ప్రయాణంచేసి… 15 ప్రాజెక్టులు సందర్శించి… 35 ప్రజంటేషన్లు, రోడ్ షోలు, బహిరంగసభల ద్వారా సమస్యను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో చంద్రబాబు విజయం సాధించారు.

ఇంజనీర్ కంటే మిన్నగా
రాష్ట్రంలోని 69 ప్రదాన నదులను పోలవరం కేంద్రంగా అనుసంధానం చేసి, ప్రతి ఎకరాకు నీరు ఏ విధంగా అందించవచ్చునో చంద్రబాబు వివరంగా తెలిపారు. అదే రీతిన రాష్ట్రంలోని మూడుప్రాంతాల్లో కూడా స్థానికంగా లభ్యమయ్యే నీటిని ఒడిసిపట్టి… అనుసంధానం ద్వారా గోదావరి, కృష్ణా జలాలను వాడుకొని ఏ విధంగా ప్రతిరైతుకు నీరందించవచ్చో తెలిపారు.

ఈ విషయాలపై పలుచోట్ల ప్రజంటేషన్లు చేసినప్పుడు, చంద్రబాబు సాంకేతిక అంశాలను వివరించినప్పుడు నిపుణులు, పాత్రికేయులు, సామాన్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఒక ఇరిగేషన్ ఇంజనీర్ కూడా చెప్పలేని విధంగా అందరికీ అర్థమయ్యేలా చంద్రబాబు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఒక రాజకీయ నాయకునికి క్లిష్టతరమైన నదుల అనుసంధానంపై అంత పట్టు ఉండటం సామాన్యమైన విషయం కాదు. అయినా చంద్రబాబుకి అదెలా సాధ్య మైందంటే… సాగునీటి ప్రాధాన్యత పట్ల అవగాహన, నదీ జలాలు సముద్రంలో కలిసి వృథా కాకుండా పొలాలకు పారించాలన్న పట్టుదల, వ్యవసాయరంగానికి ఊతమిచ్చి రైతులను, పేదలను, కూలీలను ఆదుకొని ఆర్థికప్రగతికి గట్టి పునాదు లు వేయాలన్న తపన, క్లిష్టమైన అంశాలను కూడా ఆకళింపు చేసుకోగలిగిన సమర్థత, ఈ విషయాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలన్న ఉద్దేశం ముఖ్య కారణా లు. ఇందువలనే.. చంద్రబాబు ఇతర రాజకీయ నాయకుల కంటే భిన్నంగా కనిపిస్తారు.

అట్టి చంద్రబాబుని దోషిగా నిలిపిన జగన్ రెడ్డి
నవ్యాంధ్ర ఉన్నతికోసం వయసుని కూడా లెక్కచేయకుండా ఆ విధంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న చంద్రబాబుని అడ్డుకోవడానికి ఆయనపైన కుట్రపూరితంగా హత్యాయత్నం కేసులు పెట్టే నీచస్థాయికి దిగజారారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. చంద్రబాబు పులివెందుల పర్యటన భారీగా విజయవంతం కావడంతో బెంబేలెత్తిన జగన్ శిబిరం అంగళ్లు, పుంగనూరు వద్ద ఆయన్ని అంతంచేయాలని చూసి వీలుకాక, తిరిగి ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ కేసులు ఏ శిక్షాస్మృతి ప్రకారం నమోదుచేశారో న్యాయకోవిదులు ఎవరికీ అర్థంకావడంలేదు.

జగన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ – జగన్ పీనల్ కోడ్
సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేసి పరిపాలించింది చంద్రబాబు. శీఘ్ర ఆర్థిక ప్రగతితోనే పేదలు, యువత బాగుపడతారని దానికోసం శ్రమించింది చంద్రబాబు. నవ్యాంధ్రకు ఒక బలమైన అభివృద్ధి ఇంజన్ లా అమరావతిని రాజధానిగా తయారుచేయాలని నిరంతరం శ్రమించింది చంద్రబాబు. బడుగు, బలహీన వర్గాల ఉన్నతిని కాంక్షించింది చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి వివక్షరహిత మైన, శాంతిసామరస్యాలతో కూడిన వాతావరణం నిరంతరం విలసిల్లాలని కాంక్షించింది చంద్రబాబు. ఆధునిక సాంకేతికతతో, ప్రపంచీకరణతో లభిస్తున్న అవకాశాలను మనయువతకు అందచేయాలని ప్రణాళికలు రచించింది చంద్ర బాబు.

ఇవన్నీ పచ్చినేరాలు… ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టిలో. దేశవ్యాప్తంగా అమలు లో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ మన రాష్ట్రంలో వర్తించవ ని జగన్ శాసనం. ఆయన రూపొందించిన జగన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు జగన్ పీనల్ కోడ్ మాత్రమే ఇక్కడ నడుస్తాయి. వాటిప్రకారం చంద్రబాబు దోషి. అయితే నవ్యాంధ్ర ప్రజలందరూ ఒకే మాటపైకి వచ్చారు… జగనాంధకారం పోవాలి.. చంద్రోదయం కలగాలి.

LEAVE A RESPONSE