( రాజా రమేష్)
విజయవాడలో ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు గుండెపోటుతో మృతి చెందారు. రమేష్ కార్డియాక్ హాస్పటల్స్‌లో సుదీర్ఘ కాలంగా కార్డియాలజీ సర్జన్‌గా పేరొందిన డాక్టర్ పాటిమళ్ల శ్రీనివాస ప్రసాద్ మంగళవారం రాత్రి అనూహ్యంగా సైలెంట్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
వైద్యులైన శ్రీనివాస్ దంపతులు సుదీర్ఘ కాలంగా వైద్యులుగా గుర్తింపు పొందారు. డాక్టర్ శ్రీనివాస్ గుండె జబ్బుల వైద్యుడిగా కోస్తా జిల్లాల్లో గుర్తింపు పొందారు. కార్డియాక్ సర్జన్‌గా ఎంతో మందికి చికిత్సలు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వచ్చే వారిని శస్త్ర చికిత్సలతో ప్రాణాలు కాపాడారు. గుండె సమస్యలు తలెత్తే విధానం గురించి రోగులకు అర్థమయ్యేలా వివరించే వారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వచ్చే ఎంతోమందికి చివరి నిమిషాల్లో ప్రాణాలు నిలబెట్టారు. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన విజయవాడ రమేష్ హాస్పటల్లో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పొవడం వైద్యుల్ని కలిచి వేసింది.
పాతికేళ్లకుపైగా వేలాది మందికి బైపాస్ శస్త్ర చికిత్సలు చేశారు. కోస్తా జిల్లాల్లో హృద్రోగ నిపుణులు పెద్దగా లేని సమయంలో జిల్లాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి వ్యాధులను గుర్తించి వైద్యాన్ని సూచించేవారు. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్న వారికి బైపాస్ సర్జరీలను సమర్ధవంతంగా నిర్వహించారు. సోమవారం భార్యతో కలిసి హైదరాబాద్ నుంచి కారులో విజయవాడ వచ్చిన ఆయన అర్థరాత్రి దాటాక సైలెంట్ స్ట్రోక్‌తో ప్రాణాలు కోల్పోయారు.
డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ నగరంలోని గాంధీ నగర్‌లో సాయంత్రం పూట కార్డియాలజి క్లినిక్ సైతం నిర్వహించే వారు. కోవిడ్ నుంచి సొంత క్లినిక్ నడపడం ఆపేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత గుండెపోటుకు గురయ్యారు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఫ్రిడ్జిలో వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని హాల్లోకి వెళ్లిన ఆయన చాలా సేపటి వరకు లోపలకు రాలేదు. సైలెంట్ కార్డియాక్ అరెస్ట్‌కు గురి కావడంతో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. చాలా సేపటి వరకు డాక్టర్ శ్రీనివాస్ బెడ్‌రూమ్ లోపలకు రాకపోవడంతో బయటకు వచ్చి చూసిన భార్యకు ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు.
డాక్టర్ శ్రీనివాస్ గుండెపోటుకు గురైనట్టు గుర్తించిన ఆయన సతీమణి వెంటనే సిపిఆర్ చేశారు. అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. భార్య ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె నెదర్లాండ్స్ నుంచి బుధవారం వచ్చిన తరు వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
కార్డియాలజిస్ట్‌గా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేలాది మందికి శ్రీనివాస్ సేవలందించారు. ఆయన కుటుంబంలో పలువురు కార్డియాలజీ నిపుణులు ఉన్నారు. భార్య, అల్లుడు, వియ్యంకులు అంతా వైద్యులే ఉన్నా చివరి వరకు సైలెంట్ స్ట్రోక్‌ను ఎవరు గుర్తించలేకపోయారు. శ్రీనివాస్ గతంలో రోజుకు గంటపాటు వ్యాయామం చేసే వారని, ప్రస్తుతం రోజూ గంట పాటు వాకింగ్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎటువంటి అలవాట్లు లేని ఆయన రోజుకు 70-80 మంది రోగులను చూసి వైద్యం అందిస్తారు. తనకు ముంచుకొచ్చిన ముప్పును మాత్రం గుర్తించలేకపోయారని సహచర వైద్యులు విచారం వ్యక్తం చేశారు.