– రాజ్యం రెడ్ల భోజ్యమా అని నిలదీసిన రఘురామకృష్ణంరాజు
– కుప్పం రైతుఆత్మహత్యకు కారణమెవరు?
– కండకావరం కబ్జాలవుతున్న వేళ
– బక్కరైతుల పాలిట అధికారపార్టీ నేతలు బాహుబలులవుతున్న వైనం
– ఇంకెంతమంది రైతుల ఉసురు తీసుకుంటారన్న ఎంపి రఘురామకృష్ణంరాజు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇది మాటలకందని విషాదం. ఆరుగాలం కాయకష్టం చేసే ఆ రైతును, రాజకీయ స్వార్ధం అమాంతం మింగేసింది. వాలంటీరును నమ్మి, తన వివరాలన్నీ ఇచ్చేసిన ఆ అమాయక రైతు, చివరాఖరకు తాను మోసపోయానని.. కాదు.. కాదు.. వాలంటీరు తనను, అధికార పార్టీ వారికి అమ్మేశారని గ్రహించి.. తహశీల్దారు కార్యాలయంలోనే తనువు చాలించిన విషాద ఘటన ఇది.
మానవత్వం మంటకలసి.. అధికారం వెర్రితలలు వేసి… అత్యాశ పరాకాష్ఠకు చేరి.. ఓ సాధారణ రైతు తన జీవితాన్ని తన చేతులతో ముగింపచేసుకున్న, ఈ విషాదానికి కారణమైన ఆ వాలంటీరును పల్లకీనెక్కిద్దామా? తన స్వార్ధానికి రైతు ఆస్తిని అధికార వైసీపీ నేతలకు తాకట్టు పెట్టిన, ఆ వాలంటీరుకు జేజేలు పలుకుదామా? వాలంటీర్లను విమర్శించిన జనసేన అధిపతి పవన్ చెప్పింది అక్షరసత్యమే అని అంగీకరిద్దామా?
కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో ఒక ఎకరం ఉంది ఈ రైతుకు. అదే ఆయనకు ఆధారం. ఆయన సర్వస్వం. అలాంటి అమాయక రైతుకు అక్కడి వాలంటీరు వల వేశాడు. నీకు పెన్షన్ ఇప్పిస్తానని ఆశ పెట్టాడు. రైతు కదా.. ఆశపడ్డాడు. పెన్షన్ వస్తే మంచిదేగా అనుకున్నాడు.
అంతే.. ఆ రైతు ఆశే వాలంటీరు కోరిక గుర్రాలయింది. ఆ రైతుకు ఉరికొయ్యగా మారింది. ఆథార్ కార్డు ఇవ్వమన్నాడు. దానితోపాటు ఆ పిచ్చి రైతు వేలిముద్ర తీసుకున్నాడు. కానీ ఆ క్షణంలో ఆ పిచ్చి రైతుకు తెలియదు. అదే తన పాలిట మరణశాసనమవుతుందని! అడిగిన చోటల్లా వేలిముద్ర వేశాడు. కొద్దిరోజుల తర్వాత, చివరాఖరకు తేలిందేమిటంటే… తన ఎకరం పొలాన్ని వైసీపీ నేత ఆక్రమించేసుకున్నారని! తన ఫోర్జరీ సంతకాలతో, తన జీవితానికి ఏకైక ఆధారమైన ఒకే ఒక ఎకరాన్ని, వాలంటీరు సాయంతో అధికార వైసీపీ నేత కబళించేశారని!!
నిజం తెలుసుకున్న రైతన్న తహశీల్దార్ దగ్గరకు వచ్చి, తనకు జరిగిన మోసాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. తనకు న్యాయం చేయమని కాళ్లావేళ్లా పడ్డాడు. అయినా తహశీల్దార్‌లో చలనం లేదు. కనిపించిన వారికల్లా తనకు జరిగిన అన్యాయం వివరించాడు. తనకున్న ఒకే ఎకరాన్ని కాపాడాలని వేడుకున్నాడు. ఎక్కడా న్యాయం జరుగుతుందన్న భరోసా కనిపించలేదు. దానితో జీవితంపై విరక్తి చెందిన ఆ రైతన్న.. అదే తహశీల్దార్ ఆఫీసులో ఉన్న ఫ్యానుకు తన జీవితాన్ని లంగరు వేసి, కనిపించని లోకానికి వెళ్లిపోయాడు… ఎమ్మార్వో ఆఫీసులో ఉన్న సీఎం జగన్ ఫొటో సాక్షిగా!
వెలుగులోకి వచ్చిన ఇలాంటి రైతుల విషాదాలు కొన్నే. ఇక వెలుగుచూడని విషాదాలు ఇంకెన్నో?! ఈ బక్క రైతు బలవన్మరణానికి బాధ్యులెవరు? వెనుకా, ముందు ఎవరూ లేని ఇలాంటి బక్క రైతుల భూములు.. చెరబడుతున్న భూబకాసురుల ఆశలకు అంతమెప్పుడు? అధికారం ఉందన్న అహంకారంతో ఇంకెంత మంది రైతులను ఉరికొయ్యలనెక్కిస్తారు? ఇదేనా రాజన్న రాజ్యం అన్నది సగటు రైతు సంధిస్తున్న ప్రశ్న!
‘‘ ఆ రైతు ఉసురు జగన్ సర్కారుకు ఊరకపోదు. రాజ్యం రెడ్ల వీరభోజ్యమా? రైతుల ఉసురు తీసుకున్న ఏ పాలకుడూ మనుగడ సాగించిన చరిత్రలో లేదు. మా పార్టీ నేతల రౌడీయిజం, గుండాయిజం, దౌర్జన్యాలతో ఇప్పటికే ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది. రౌతును బట్టి గుర్రం! గౌరవంగా జీవించేవారు, మర్యాదగా బతికేవారెవరూ మళ్లీ మా పార్టీకి ఓటు వేసే అవకాశం లేదు. రైతులు మనం ఎన్ని పథకాలు ఎరవేసినా మనల్ని క్షమించరు. ఉన్నన్ని రోజులు దౌర్జన్యం చేసి, నాలుగు డబ్బులు సంపాదించాలనే ఆలోచన తాడేపల్లి నుంచి తడ వరకూ కనిపిస్తోంది. ఇంకెంతమంది రైతుల ఉసురు తీసుకుంటారు? అమరావతి రైతుల ఉసురు తీసింది సరిపోదా? మీ ధనదాహానికి రాష్ట్రంలోని రైతులందరినీ బలితీసుకుంటారా?’’ అని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అని ప్రశ్నించారు.
‘‘మీరంటారే.. పైన దేవుడున్నాడని! అవును.. పైన వెంకన్న అన్నీ చూస్తున్నాడు. మీ లెక్కలు సరైన సమయంలో సరిచేస్తాడు’’ అని వ్యాఖ్యానించారు. రైతులను బలితీసుకునే పార్టీలో ఉన్నందుకు, తనను క్షమించమని ఆయన వేడుకున్నారు. ‘‘అప్పటికీ నేను ఈ పాపపంకిల విధానాన్ని ఎదిరిస్తూనే ఉన్నా. రైతులను వేధించే నాయకత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని ఎదిరించినందుకు నేనూ శిక్ష అనుభవించా. అయినా సహనం కోల్పోలేదు. నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ ఈ రాక్షస ప్రభుత్వ నిర్ణయాలపై పోరాడతా. అంతవరకూ మీరు బతికుండి, నాకు చేయూతనివ్వండి. రైతులెవరూ మనోస్ధైర్యం కోల్పోయి ఇలా ఆత్మహత్యలు చేసుకోవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.
‘‘ముందున్నది మంచికాలం. ఈ ప్రభుత్వం పీడ విరగడయ్యే కాలం మరెంతో కాలంలో లేదు. కొంచెం సహనం వహించండి. బతికి సాధించండి. ఈ సర్కారుకు సమాధి కట్టేందుకు ఉద్యమించండి. ఇదొక్కటే నేను మీకిచ్చే భరోసా’’ అని రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు.
ఈ ఘటనతో వాలంటీర్లు గ్రామాల్లో ఎంత అమానుషాలకు పాల్పడుతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దీన్నిబట్టి జనసేన పవన్ కల్యాణ్.. వాలంటీరు వ్యవస్థపై చేసిన ఆరోపణలు, అక్షర సత్యమని తేలిపోవడం లేదూ?