-రాష్ట్రంలో యదేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘనలు
-విజయసాయికి పిల్లలే పుట్టలేదు
-ప్రభుత్వ ధనం తో సాక్షి దినపత్రిక కొనడం నేరాతి నేరం
-ఎంపీ రఘురామకృష్ణంరాజు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం ఒక్కరోజు ఆలస్యం అయినా ఆర్థిక ఎమర్జెన్సీ ని ప్రకటించాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ నెల లో ఇప్పటికే పది రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకింకా జీతాలు చెల్లించ లేదన్నారు . అనంతపురంలో విశ్రాంత ఉద్యోగులు తమకు పెన్షన్లు చెల్లించాలని ఆందోళనకు దిగారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించి, ఈ ప్రభుత్వం తక్షణమే వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కేంద్రం ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను చెల్లించాలని, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లను ముట్ట చెప్పాలని కోరారు. తాను ప్రజలకు ఇంత చేశాను… అంత చేశానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం జీతాలను చెల్లించరా? అంటూ ప్రశ్నించారు. జీతాలు చెల్లించలేని దుస్థితిలోకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లిందంటే అదేదో చిత్రంలో బాబు మోహన్ కు పట్టిన దుర్గతి పట్టినట్లేనన్నారు. జీతాలు చెల్లించాలని శ్రీకాకుళంలో ఉద్యోగస్తులు ప్లేట్లను స్పూన్లతో కొట్టి నిరసన తెలియజేయగా, అనంతపురంలో విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ల కోసం రోడ్డెక్కిన ఘటనలే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సజీవ సాక్ష్యాలని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు .
ఈ కష్టాలను భరించలేమని భావించి, తాము చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నట్లుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోలకు అశేష ప్రజానీకం తరలి వస్తున్నారన్నారు. మనం భోజనాలు ఏర్పాటు చేసి, తాగడానికి మద్యం సీసాలు ఇచ్చినా ప్రజలు ఎందుకనీ మన సభలకు రావడం లేదో ఆత్మావలోకనం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో యదేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు . అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని తాను రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయలేనని చెప్పారు . అసలు రాష్ట్రంలో మానవ హక్కులు అన్నవే లేవన్నారు. రాష్ట్రంలో డాక్టర్లకు మాస్కులు అడిగే అధికారం లేదని, ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు, ఎంపీకి సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే హక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆట ఇప్పుడే మొదలయ్యింది
రాష్ట్రంలో రాజకీయ క్రీడ ఇప్పుడే మొదలైందని, త్వరలోనే అందరి ఆట కట్టిస్తామని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్లు వాగడం వల్లే రాజ్యసభ ప్యానల్ చైర్మన్ పదవి నుంచి తొలగించారన్నారు. ఎంపీగా నియోజకవర్గంలో అడుగు పెట్టడం లేదని తనని విజయ సాయి విమర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఆగడాల గురించి ప్రతిరోజు ప్రజలకు వివరిస్తున్నానని, కోట్లాదిమంది ప్రజలు తాను చెబుతున్నది వింటున్నారని తెలిపారు.
తన నియోజకవర్గానికి వెళ్లడం లేదనే బాధ తనకు కూడా ఉందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు నేతల చేత విమర్శలు చేయిస్తూ ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను పోటీకి నిలుపుతావా అంటూ పవన్ ని రెచ్చగొడుతున్న, తనని నియోజకవర్గంలోకి అడుగుపెట్టడం లేదని విమర్శలు చేయడం వెనక ఉన్న మతలబు తనకు తెలుసునన్నారు. మీరు ట్రాప్ చేస్తున్నా… మీ ట్రాప్ లో మేము పడబోమని రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు.
ప్రభుత్వం జీవోలను ఇచ్చి ప్రజా ధనముతో సాక్షి దినపత్రిక కొనుగోలు చేయడం నేరాతి నేరమని రఘు రామ కృష్ణంరాజు అన్నారు. నేరుగా జరుగుతున్న ఈ నేరాన్ని న్యాయస్థానాలలో పిటిషన్ వేసి ప్రశ్నించాలని ప్రజాస్వామ్య వాదులను కోరారు. పత్రికలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ, ఒక్కటయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కొనుగోలు చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది వాలంటీర్లతో పాటు, లక్ష పాతిక వేల సచివాలయ సిబ్బందిని ప్రజాధనంతో సాక్షి దినపత్రిక కొనుగోలు చేయిస్తున్నారన్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే నెలకు 5 లక్షల రూపాయలు సాక్షి దినపత్రిక కొనుగోలు కోసం చెల్లిస్తున్నట్లు తెలిసిందన్నారు. రాష్ట్రంలోని 150 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తొమ్మిది లక్షల సాక్షి దినపత్రిక కాపీలను కొనుగోలు చేస్తున్నారన్నారు.
ఈ సర్కులేషన్ చూపించుకునే ఆ పత్రిక వ్యాపార ప్రకటనలను సంపాదిస్తుందన్నారు. ఇక ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ బిల్లులు, ఇతరులు ఎవరికి చెల్లించకపోయినా సాక్షి దినపత్రికకు మాత్రం తక్షణమే చెల్లిస్తున్నారన్నారు. అక్రమ సంపాదనతో ఏర్పాటుచేసిన పత్రిక పై గత 12 ఏళ్లుగా కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా , ముఖ్యమంత్రి అయి ప్రభుత్వ సొమ్మును ఇంత దారుణంగా దుర్వినియోగం చేస్తున్న ప్రజలు ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సాక్షి దినపత్రిక జగన్మోహన్ రెడ్డి ది కాదని చెప్పడానికి వీల్లేదు అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు జగతి పబ్లికేషన్లో పెట్టుబడులను పెట్టారని గుర్తు చేశారు. జగతి పబ్లికేషన్లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పై 31 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిన్న మొన్నటి వరకు సాక్షి దినపత్రిక చైర్మన్ గా ఆయన సతీమణి వైయస్ భారతి రెడ్డి కొనసాగారని గుర్తు చేశారు. విజయ సాయి రెడ్డి కుటుంబం నేర చరిత్ర గురించి రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. విజయ సాయి తండ్రి తన సోదరుని హత్య చేసిన కేసులో నిందితునిగా యావజీవ కారాగార శిక్ష అనుభవించారని, విజయసాయికి పిల్లలే పుట్టలేదన్నారు.
దత్తపుత్రికను పెంచుకొని తన కూతురుగా చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కంసుడు, నపుంసకుడు పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కనికా రెడ్డి విమానాలలో తరలించిన డబ్బుల్లో తీవ్రవాదుల ఫండింగ్ కూడా ఉన్నట్లు తెలిసిందన్నారు. విజయసాయి అల్లుడు అన్నయ్య అప్రూవర్ గా మారినట్లు, డ్రగ్స్ దందాలో కూడా వీరికి లింకులు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలలో వినికిడి అని అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం విచారణకు విజయసాయి నెల రోజుల వ్యవధిలో హాజరు కావడం ఖాయం అన్నారు. రాజ్యసభలో ఉన్న పదవులు అన్ని కానీ కొట్టేసి, తమ పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకోవడం విజయసాయిరెడ్డికి చెల్లిందని అపహాస్యం చేశారు.