Suryaa.co.in

Editorial

‘పువ్వు’ భలే.. రాంచిలక!

– సమరం సమరమే.. సాయం సాయమే
– బీజేపీ నేతలపై వైసీపీ దాడులు, ఆరోపణలు
– అయినా కేంద్రం నుంచి ఆగని కాసుల వరద
– తాజాగా కేంద్రం నుంచి ఊహించని ఆర్ధిక సాయం
– 3 వేల కోట్ల కొత్త అప్పులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
– అదేరోజు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై వైసీపీ దాడి
– గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాపై విజయసాయి 20 కోట్ల ముడుపుల ఆరోపణలు
– అయినా పట్టించుకోని ఢిల్లీ నాయకత్వం
– ఓవైపు వైసీపీపై పోరాడాలని సత్యకుమార్‌కు నద్దా ఫోన్ పిలుపు
– కానీ అధికారికంగా ఖండించని బీజేపీ జాతీయ నాయకత్వం
– మరోవైపు అప్పులిచ్చి ఆదుకుంటున్న అదే కేంద్రం
– ఇంకోవైపు జగన్ సర్కారు అప్పులపై ఏపీ బీజేపీ నేతల విమర్శల వర్షం
– కాసుల సాయం చేసేదీ, అప్పులపై ఆగం చేసేదీ కమల దళాలే
– కేంద్రంతో జగన్ దోస్తీ.. రాష్ట్ర బీజేపీ నేతలతో మాత్రం కుస్తీ
– వర్ధిల్లుతున్న ఫ్లవర్-ఫ్యాన్ బంధం
– జనంలో నవ్వుల పాలవుతున్న ‘పువ్వు’పార్టీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

సుబ్బారావు-అప్పారావు మిత్రులు. మిత్రులంటే మరీ అంత మిత్రత్వం కాదు. అలాగని కొట్టిపారేసేంత స్నేహమూ కాదు. ఇద్దరికీ ఒకరి అవసరాలు మరొకరికి ఉన్నాయి. వీరిద్దరికీ కామన్ శత్రువు చంద్రయ్య. ‘కమలా’కర్ అనే ఆయన, ఢిల్లీలో ఉండే సుబ్బారావుకు చెందిన ‘ఫ్లవర్’ కంపెనీలో పనిచేసే రాష్ట్ర ప్రతినిధి.

ఈ కమలాకర్‌కు అప్పుల అప్పారావంటే గిట్టదు. అప్పారావ్ కనపడిన ప్రతిచోటా అప్పులు చేస్తున్నాడని, అతనికి ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ తెలియదని కమలాకర్ ప్రతిసారీ, ఢిల్లీ సుబ్బారావుకు ఫిర్యాదు చేస్తుంటాడు. పైగా అప్పారావు అనుచరులు మన వాళ్లను కొడుతున్నారని, వాట్సాప్ మెసేజీలు పెడుతుంటాడు. కాబట్టి అప్పారావును కంట్రోల్ చేయాలని ‘కమలా’కర్ ప్రతిసారీ చెబుతుంటాడు.

అయితే విచిత్రంగా.. అప్పారావుకు కాసుల కష్టం వచ్చినప్పుడల్లా, ఢిల్లీలో ఉండే సుబ్బారావు సాయం చేస్తుంటాడు. సుబ్బారావుకు ఇష్టమైన వెంకటేశ్వరస్వామి విగ్రహం బొమ్మలు ఇస్తుంటాడు. ఇక్కడేమో అప్పారావు అప్పుల వ్యవహారంపై, ‘కమలా’కర్-ఆయన అనుచరులు రచ్చబండ దగ్గర యాగీ చేస్తుంటారు.

అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే.. అప్పారావుకు అప్పులు ఇచ్చేదీ.. అప్పులు తీసుకుంటున్నారని విమర్శించేదీ ‘కమలా’కర్ కంపెనీనే! మరి లోకల్ ప్రతినిధి ‘కమలా’కర్, ఢిల్లీ సుబ్బారావుకు ఫిర్యాదు చేయడం, ఢిల్లీ సుబ్బారావేమో మీరంతా అప్పారావు సంగతి చూడండని ఉస్కాయించడం, కామెడీన్నర కామెడీ కదా? ఇదంతా చూసిన జనం నవ్వుకుంటున్నారంటే.. నవ్వుకోరు మరి!?
– చందమామ కథల పత్రిక మూతపడిన తర్వాత.. తాజా పరిణామాలపై, రాజకీయ కథలు రాసుకుంటున్న ఈ కాలంలో, లేటెస్టుగా వచ్చిన ఫ్లవర్-ఫ్యాన్ లవ్‌స్టోరీ ఇది!

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై అమరావతిలో వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడి, వాహనం ధ్వంసం చేశాయి. దానిపై జాతీయ అధ్యక్షుడు నద్దా స్పందించి, సత్యకు ఫోన్ చేసి, ‘నువ్వు ముందుండి పోరాడు. మేము నీ వెనుక ఉంటామని’ హిందీలో ఉస్కాయించారు. దానితో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కమలదళాలు పిలుపునిచ్చాయి. వైసీపీ ప్రేరేపిత దాడిని కమలదళాలు ఖండించాయి.

తర్వాత తెలుగుదేశం, బీజేపీ నేతలు సత్యకుమార్‌పై వైసీపీ కార్యకర్తల దాడిని ఖండించాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే.. సత్యపై జరిగిన దాడిని, బీజేపీ నేతల కంటే టీడీపీ నేతలే ఎక్కువమంది ఖండించటం. మొన్నీమధ్య రాహుల్‌పై సస్పెన్షన్ వ్యవహారంలో.. తెలంగాణ కాంగ్రెస్ కంటే, అధికార బీఆర్‌ఎస్ మంత్రులు- ఎమ్మెల్యేలే స్పందించినట్లు అన్నమాట!

సీన్ కట్ చేస్తే..
అదే రోజు.. అంటే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై, వైసీపీ కార్యకర్తలు దాడి జరిగిన రోజునే… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాసుల కటకటతో అలమటిస్తున్న జగనన్న సర్కారుకు, ఎండా కాలం సీజన్‌లో చల్లటి వరమిచ్చింది. సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఆర్‌బిఐ, ఆరవసారి అనుమతించింది. మార్చి నెల చివరి రోజు, చివరి నిమిషంలో 3 వేల కోట్ల అప్పులకు కేంద్రం పెద్దమనసుతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది.

అదే ఆర్బీఐ మరో 3 వేల కోట్ల ఇండెంట్‌కూ ఓకే చెప్పేసింది. అంటే ఆ ప్రకారంగా.. 6 సంవత్సరాలకు వెయ్యి కోట్లు, 9 ఏళ్లకు మరో వెయ్యి కోట్లు, పదేళ్లకు ఇంకో వెయ్యి కోట్ల బాండ్ల వేలానికి, కేంద్ర ఆర్ధిక శాఖ ‘నిర్మల హృదయం’తో అంగీకరించింది. విచిత్రంగా దేశంలోని ఏ రాష్ట్రం కూడా, ఈ ఆర్ధిక సంవత్సరం చివరన ఇలా ఇండెంట్ పెట్టలేదు.

అంటే… తాజాగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి, ప్రధాని మోదీ-ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహాలు ఇచ్చి, శాలువ కప్పినందుకు ప్రతిఫలం బాగానే దక్కినట్లు అర్ధమవుతుంది. కొన్ని మీడియా సంస్థలు, నిర్మలా సీతారామన్.. సీఎం జగన్‌కు పెద్దగా సమయం ఇవ్వలేదని రాసినప్పటికీ, సీఎం జగన్ తాను అనుకున్నది సాధించడంలో సక్సెస్ అయ్యారు. ఆర్బీఐ ఇచ్చిన 3 వేల కోట్ల అప్పుల ఎపిసోడ్ అదే స్పష్టం చేస్తోంది.

మరి ఫ్లవర్-ఫ్యానుకూ చెడిందెక్కడ? తానే అప్పులిస్తూ, జగనన్న అప్పుల రాజ్యం నడుపుతున్నారని, తానే ‘ఫ్యాను’ను తిట్టిపోస్తే నమ్మేదెవరు? బీజేపీ నాయకుడు లంకా దినకర్ నుంచి అధ్యక్షుడు సోము వీర్రాజు వరకూ, జగనన్న అప్పుచేసి పాలిస్తున్నారని విమర్శిస్తే నవ్వుకోరూ? లంకా దినకర్ అయితే వారానికోసారి, జగనన్న సర్కారు అప్పులపాలనపై గణాంకాలతో శివమెత్తతుంటారు. అప్పులపై ఇలా నాలుక మడతేస్తే, జనం దృష్టిలో పువ్వుపార్టీ నవ్వులపాలవదూ?

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఆయన చంద్రబాబు దగ్గర 20 కోట్లు మామూళ్లు తీసుకున్నారని, కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి అందుకు మధ్యవర్తిగా వ్యవహరించారని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రమైన ఆరోపణ చేశారు. దానిపై బీజేపీ కేంద్ర నాయకత్వంలో ఉలుకూ-పలుకూ లేదు. దానిని జాతీయ నాయకత్వం ఖండించలేదు. విచిత్రంగా ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది.

ఇప్పుడు వైసీపీ సర్కారుపై ఒంటికాలితో లేస్తున్న సత్యకుమార్‌పై, వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. కారు ధ్వంసం చేశాయి. అందుకు స్పందించిన జాతీయ అధ్యక్షుడు నద్దా, వెంటనే సత్యకుమార్‌కు ఫోన్ చేసి, పరామర్శించారన్నది ఆ పార్టీ వర్గాల సమాచారం. కానీ మొన్నటి అండమాన్ ఎన్నికల్లో, బీజేపీ పొత్తుతో గెలిచిన టీడీపీని అభినందిస్తూ ట్వీట్ చేసిన నద్దా.. తన పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై వైసీపీ దాడి చేస్తే మాత్రం దానిని ఖండిస్తూ ఎలాంటి ట్వీట్ చేయలేదు.

అదే విధంగా తెలంగాణలో.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచిన పార్టీ అభ్యర్ధిని అభినందిస్తూ ట్వీట్ చేసిన అదే నద్దా… తన పార్టీ నేత సత్యపై దాడి జరిగితే మాత్రం, దానిని ఖండిస్తూ అధికార ప్రకటన ఇవ్వకపోవడమే ఆశ్చర్యం. కనీసం బీజేపీ జాతీయ పార్టీ కూడా, దాడి ఘటనను ఖండిస్తూ ట్వీట్ చేయకపోవడం మరో విచిత్రం.

సువిశాలమైన యుపీ రాష్ట్ర కో ఇన్చార్జిగా ఉన్న తెలుగువాడైన సత్యకుమార్, అక్కడి శక్తులను ధైర్యంగా ఎదుర్కొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేక రాష్ట్రాల సమాహారమయిన అండమాన్ ఇన్చార్జిగా, పోర్ట్‌బ్లెయిర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న విజయంలో భాగస్వామి అయ్యారు.

కానీ సొంత రాష్ట్రంలో, తన పార్టీ విధానానికే కట్టుబడి అమరావతి రైతులకు సంఘీభావం చెప్పే క్రమంలో, అధికార వైసీపీ దాడికి గురయ్యారు. అయినా సొంత పార్టీ జాతీయ నాయకత్వం నుంచే.. ఆయనకు ఎలాంటి బహిరంగ భరోసా రాకపోవడం అటుంచి, కనీసం ఖండన- సానుభూతి కూడా దక్కకపోవడమే విచారకరమన్నది కమలదళాల వ్యాఖ్య.

అప్పుడు కన్నా.. ఇప్పుడు సత్యకుమార్ ఘటనలు పరిశీలిస్తే.. పువ్వుపార్టీ రాజకీయ వ్యూహంలో సమిథలవుతోంది, వైసీపీపై పోరాడే పెద్ద తలలే తప్ప.. ఫ్లవర్-ఫ్యాను స్నేహం అంతకంతకూ పరిమళిస్తోందని గ్రహించని వారు, అమాయకులేనన్నది బుద్ధిజీవుల ఉవాచ. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అన్న సామెత మాదిరిగా.. ఫ్యాన్-ఫ్లవర్ అవగాహనతో వెళుతున్నాయని తెలుసుకోలేని వారిని చూసి జాలిపడటం తప్ప మరేమీ చేయలేమన్నది వారి విశ్లేషణ.

LEAVE A RESPONSE