– డాక్టరేట్ పొందిన సహ విద్యార్థి బొప్పన రవి కుమార్ కు అభినందన
ముదినేపల్లి (పెదపాలపర్రు): ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోని పెదపాలపర్రు ఈఎస్ సీ ఎం జెడ్ పి హెచ్ పాఠశాల 1987 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల స్నేహ సమావేశం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.
సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు తమ బాల్య జ్ఞాపకాలను, పాఠశాల రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అప్పటి గురువుల బోధనలు, స్నేహ బంధాలు, బడి ప్రాంగణంలో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుని పరస్పరం అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు తమ జీవితాల్లో పోషించిన పాత్రను స్మరించారు.
గ్రామాభివృద్ధి, విద్యాభివృద్ధి, భవిష్యత్ తరాలకు మంచి విద్య అందించాల్సిన అవసరంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టరేట్ పొందిన నాటి సహచర విద్యార్థి , సీనియర్ జర్నలిస్టు బొప్పన రవి కుమార్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రవి కుమార్ దంపతులను ఘనంగా సత్కరించారు. పెదపాలపర్రు స్కూల్ నుండి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి గా రవి కుమార్ నిలిచారని ఈదర సీతారామయ్య తెలిపారు.
ఇది తమ బ్యాచ్ కు ఎంతో గర్వకారణమైన విషయమని నెక్కంటి చౌదరి ప్రస్తుతించారు. కార్యక్రమంలో శ్రీను, రామ్మోహన్, వేణు, లక్ష్మి రాణి, నాగ లక్ష్మి, ఉమ, ఉష, రమ, లక్ష్మి కుమారి, పద్మ, కమల, శ్రీదేవి, సుశీల తదితరులు పాల్గొన్నారు. స్నేహ సమావేశంలో భాగంగా జ్ఞాపికల మార్పిడి, పాత ఫోటోలతో జ్ఞాపకాల తాలూకు అనుభూతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న పూర్వ విద్యార్థులు ఈ సమావేశాన్ని జీవితంలో మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పూర్వ విద్యార్థుల మధ్య అనుబంధం మరింత బలపడిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలను నిర్వహించాలనే సంకల్పం వ్యక్తం చేశారు.