– జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
జగన్ రెడ్డి రోడ్డు మీద తిరగటం మర్చిపోయినట్లున్నారు. తన ప్యాలెస్ నుంచి తెనాలికి 28 కిమీ. ఈ మాత్రం దూరం కూడా రోడ్డు ప్రయాణం చేయలేరా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్ళడం ఏమిటి? జనం నవ్వుకొంటున్నారు. జనం సొమ్ము జగన్ హెలీకాప్టర్ పర్యటనల పాలవుతోంది. హెలికాప్టర్ డబ్బులతో రోడ్లు బాగవుతాయి.రోడ్డు మీద వెళ్తే గుంతలు.. పాడైపోయిన రోడ్లు ఉంటాయని హెలికాప్టర్లో వెళ్తున్నారా? ప్రజలను మాత్రం గతుకుల రోడ్ల పాలుచేసి తను మాత్రం హాయిగా హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోంది? అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావం?
ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రికి భయం. అందుకే ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా… వచ్చినా పరదాల మాటున తిరిగే వ్యక్తికి భయం కాక మరేముంటుంది? ముఖ్యమంత్రి పర్యటన ముస్తాబుల కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిపి రోగులను ఇబ్బందుల పాలుచేశారు. తెనాలి పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు. నాయకులను అరెస్టు చేయడం, ప్రజలను బయటకు రానీయకపోవడం, షాపులు మూయించడం… చూస్తుంటే రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారు అనిపిస్తోంది.తెనాలి ఎంతో ప్రశాంతమైన పట్టణం. కళలు, సంస్కృతికి నెలవైన తెనాలిలో ప్రజలు ప్రశాంతత కోరుకుంటారు. అలాంటి పట్టణంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో భయానక వాతావరణం సృష్టించడమే వైసీపీ మార్కు పాలన.