November 10, 2026

కొండంత విపత్తు… గోరంత నిధులు!

  • కరువు కాటకాలు, వరద విలయాలు… రైతుల కన్నీళ్లపై పాలకుల ప్రచార పర్వం!
  • డబుల్ ఇంజన్ సర్కార్‌కు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?

రైతు నష్టపోతున్నాడు… వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతోంది… రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదు… అయినా పాలకుల ప్రచార ఆర్భాటం మాత్రం ఆగడం లేదు!

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం గత రెండున్నరేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు, పాలకుల నిర్లక్ష్యం, ప్రభుత్వ విధానాల కారణంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు కరువు, మరోవైపు అతివృష్టి, తుపాన్లు, వరదలు రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నాయి. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు రైతు పడుతున్న కష్టం ఒక ఎత్తయితే, ప్రకృతి వైపరీత్యాలతో పంట మొత్తం కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోవడం మరో ఎత్తు.

రైతు పంట పండించలేకపోతున్నాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోతే న్యాయమైన పరిహారం అందడం లేదు. కౌలు రైతులకు గుర్తింపు, భరోసా కరువవుతున్నాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వేల కోట్ల అభివృద్ధి ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇది కేవలం ప్రకృతి సృష్టించిన విపత్తు మాత్రమే కాదు. ముందస్తు ప్రణాళికలు లేని పాలన, సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం, రైతాంగ సమస్యల పట్ల నిర్లిప్తత, రాష్ట్ర హక్కుల సాధనలో వైఫల్యం కలగలిసిన మానవ నిర్మిత సంక్షోభం కూడా!

బుడమేరు నుంచి మొంథా వరకు… నష్టాలెన్నో, పరిహారం ఏదీ?

2024లో విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరదలు రాష్ట్రం మరచిపోలేని విషాదం. నగరంలోని కాలనీలు, ఇళ్లు, దుకాణాలు, రహదారులు నీటమునిగాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. పంటలు, పశువులు, వ్యవసాయ పరికరాలు, నిల్వచేసిన ధాన్యం దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు జీవనోపాధి కోల్పోయారు.

వరదల నివారణలో ముందస్తు చర్యలు, బుడమేరు ప్రవాహ నియంత్రణ, ఆక్రమణల తొలగింపు, శాశ్వత పరిష్కారాల విషయంలో ప్రభుత్వాల బాధ్యత ఏమిటన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.

2024లో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన విపత్తులకు సంబంధించి కేంద్రం NDRF నుంచి రూ.608.08 కోట్ల అదనపు సహాయాన్ని ఆమోదించింది. అయితే ఇది ఒక్క బుడమేరు వరదలకు మాత్రమే కేటాయించిన మొత్తం కాదు. ఆ సంవత్సరంలో సంభవించిన పలు విపత్తులకు సంబంధించిన సహాయం.

అలాగే 2025లో సంభవించిన విపత్తులకు సంబంధించి 2026 మార్చిలో మరో రూ.341.48 కోట్ల అదనపు సహాయాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ మొత్తాన్ని కూడా ఒక్క మొంథా తుపానుకు ప్రత్యేకంగా కేటాయించినదిగా పరిగణించలేం.

2025 అక్టోబరులో సంభవించిన మొంథా తుపాను, అనంతరం వచ్చిన భారీ వర్షాలు, వరదలు కోస్తాంధ్రలో వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇటీవల వచ్చిన తుపానులు, వాయుగుండాల ప్రభావంతోనూ రైతాంగం నష్టపోయింది.
ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. కేంద్రం ప్రకటించిన సహాయం ఎంత? వాస్తవంగా విడుదల చేసినది ఎంత? రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఎంత ఖర్చు చేసింది? రైతులకు, వరద బాధితులకు చేరిన పరిహారం ఎంత? ఇంకా అందాల్సిన పరిహారం ఎంత?

ప్రభుత్వాలు ప్రకటించే నష్టాల అంచనాలు, కేంద్రం ఆమోదించే సహాయం, విడుదలయ్యే నిధులు, బాధితుల ఖాతాల్లో జమయ్యే పరిహారం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయాలి. కేవలం కేంద్రం నిధులు ప్రకటించిందని చెప్పడం వల్ల బాధితుల సమస్యలు పరిష్కారమైనట్లు కాదు.

కరువు కాటకాలతో కుదేలైన రైతాంగం… పంటల వారీగా కన్నీటి వ్యథలు!

2026 ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 12 వరకు సాధారణ వర్షపాతం 476.1 మిల్లీమీటర్లు కాగా, నమోదైన వర్షపాతం 218.2 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే 54.2 శాతం లోటు!
రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం, పల్నాడు తదితర ప్రాంతాల్లోనూ కరువు ప్రభావం తీవ్రంగా కనిపించింది.

ఈ కరువు ప్రభావం గణాంకాల్లో కనిపించే పంటల విస్తీర్ణానికే పరిమితం కాదు. ప్రతి పంట వెనుక ఒక రైతు కుటుంబం ఉంది. ప్రతి ఎండిపోయిన పొలం వెనుక అప్పులు, ఆశలు, పిల్లల చదువులు, కుటుంబ భవిష్యత్తు ఉన్నాయి.

పొగాకు రైతు: వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొగాకు పంటకు వర్షాభావం, అధిక వర్షాలు, వాతావరణ మార్పులతో నష్టం వాటిల్లుతోంది. నాణ్యత తగ్గితే ధర పడిపోతుంది. వేలంలో ఆశించిన ధర రాకపోతే పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతోంది. రైతు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు.

వరి రైతు: ఒకవైపు సాగునీరు లేక పంట ఎండిపోతోంది. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో పొలాలు నీటమునిగి పంట నేలకొరుగుతోంది. కోతకు వచ్చిన ధాన్యం తడిసిపోతోంది. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, తేమ శాతం నిబంధనలు, రవాణా సమస్యలతో రైతు మరింత నష్టపోతున్నాడు.

మొక్కజొన్న రైతు: వర్షాభావంతో కంకులు సరిగా అభివృద్ధి చెందక దిగుబడులు పడిపోతున్నాయి. అకాల వర్షాలతో పంట నాణ్యత దెబ్బతింటోంది. పెట్టుబడులు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరిగినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించడం లేదు.

బత్తాయి, చీని రైతులు: రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, కడప, నంద్యాల తదితర ప్రాంతాల్లో బత్తాయి, చీని తోటలు రైతుల జీవనాధారంగా ఉన్నాయి. నీటి కొరతతో చెట్లు ఎండిపోవడం, పండ్ల నాణ్యత తగ్గడం, దిగుబడులు పడిపోవడం, మార్కెట్ ధరలు తగ్గడం రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఒకసారి ఎండిపోయిన తోటను తిరిగి పునరుద్ధరించడానికి సంవత్సరాల సమయం, భారీ పెట్టుబడి అవసరం.

పత్తి, మిరప రైతులు: వర్షాభావం, అధిక వర్షాలు, తెగుళ్లు, మార్కెట్ ఒడిదుడుకులు రైతుల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు అదనపు మందులు, ఎరువులు వాడాల్సి వస్తోంది. అయినా దిగుబడి, ధర రెండూ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.

ఇలా ఒక్కో పంటకు ఒక్కో రకమైన సమస్య. కానీ వాటన్నింటికీ మూలంగా ఉన్నది రైతు ఆదాయ భద్రత లేకపోవడం, వ్యవసాయానికి ప్రభుత్వ అండ కొరవడటం.

కౌలు రైతుల కన్నీళ్లకు బాధ్యులెవరు?

ఈ వ్యవసాయ సంక్షోభంలో అత్యంత దారుణంగా నష్టపోతున్నది కౌలు రైతాంగం. భూమి సొంతంగా లేకపోయినా భూయజమానులకు కౌలు చెల్లించి, అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే భూయజమానికి కౌలు చెల్లించాల్సిందే. అప్పు ఇచ్చినవారికి వడ్డీ కట్టాల్సిందే. కుటుంబాన్ని పోషించాల్సిందే.

కానీ పంట నష్టం పరిహారం, పంటల బీమా, రుణ ఉపశమనం విషయంలో కౌలు రైతులకు తగిన గుర్తింపు, రక్షణ లభించడం లేదు. భూమి యజమాని పేరుతో రికార్డులు ఉండటం వల్ల అసలు సాగుదారుడైన కౌలు రైతు నష్టపరిహారానికి దూరమవుతున్నాడు.

భూమి సొంతం లేని కారణంగా కౌలు రైతు నష్టపోవడం, పంట పోయిన కారణంగా అప్పుల పాలవడం, చివరకు కుటుంబాన్ని పోషించలేని దుస్థితికి చేరడం వ్యవసాయ వ్యవస్థలోని అమానవీయ విషాదం.

కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, సాగుదారుడి పేరుతో పంటల బీమా, ప్రత్యేక పంట నష్టపరిహారం, రుణ ఉపశమనం కల్పించకుండా వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం చూపడం అసాధ్యం.

రాయలసీమకు నీరే ఆధారం… నాలుగు దశాబ్దాలుగా ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే!
రాయలసీమ అభివృద్ధికి ప్రధాన ఆధారం సాగునీరు. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన ఈ ప్రాంతంలో నీటిని నిల్వ చేసుకోవడం, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం అత్యంత కీలకం. కానీ దశాబ్దాలు గడుస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిలో ఆశించిన మార్పు లేదు.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా చిన్నా పెద్దా ప్రాజెక్టులకు పునాదిరాళ్లు పడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రులు మారుతున్నారు. ప్రాజెక్టుల పేర్లు, శంకుస్థాపనల వేదికలు మారుతున్నాయి. కానీ అనేక ప్రాజెక్టుల నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మిగిలిపోతోంది.

వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగు గంగ, గుండ్లకమ్మ తదితర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్మాణ పురోగతి, నిధుల కేటాయింపులు, మిగిలిన పనులు, ఆయకట్టుకు నీటి సరఫరాపై ప్రజలకు స్పష్టమైన లెక్కలు కావాలి.
వెలిగొండ ప్రాజెక్టు ఒక్కటే లక్షలాది ఎకరాల రైతులకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు అందించగల కీలకమైన ప్రాజెక్టు. అయినా దశాబ్దాలుగా దాని పూర్తి సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం.

రాయలసీమలో వర్షం పడినప్పుడు ఆ నీటిని ఒడిసిపట్టి చెరువులు, రిజర్వాయర్లు నింపుకునే సమగ్ర వ్యవస్థ లేకపోవడం మరో విషాదం. వర్షం వచ్చినప్పుడు వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. వర్షం లేని సమయంలో రైతు చుక్క నీటి కోసం అల్లాడుతున్నాడు.

నీటి నిల్వ సామర్థ్యం పెంచకుండా, కాలువలు పూర్తి చేయకుండా, చెరువులను పునరుద్ధరించకుండా, ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించకుండా రాయలసీమను కరువు రహిత ప్రాంతంగా ఎలా మారుస్తారు?
రాయలసీమకు ప్రకటనలు వద్దు… నీళ్లు కావాలి. శంకుస్థాపనలు వద్దు… పూర్తయిన ప్రాజెక్టులు కావాలి. హామీలు వద్దు… ప్రతి ఎకరాకు సాగునీరు కావాలి!

లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్… రైతు బతుకులకు నీటి భరోసా ఎక్కడ?

రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో భారీ ప్రాజెక్టును ప్రకటించారు. ప్రభుత్వ రంగం నుంచి రూ.40,352 కోట్లు, ప్రైవేటు పెట్టుబడుల రూపంలో రూ.60,000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదించారు. 201 క్లస్టర్లు, 5,869 గ్రామాలు, 9.6 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు.
ఉద్యాన పంటల అభివృద్ధి అవసరమే. పండ్ల తోటలకు మార్కెట్, శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి సౌకర్యాలు రావాలి. కానీ ఇవన్నీ సాధించడానికి ముందుగా కావాల్సింది సాగునీరు.

బోర్లు ఎండిపోయి, చెరువులు నీరులేక వెలవెలబోతూ, బత్తాయి, చీని తోటలు ఎండిపోతుంటే లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ ప్రకటనలకు అర్థమేమిటి? రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లేకపోతే, పండించిన పండ్లను నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోతే, మార్కెట్‌లో దళారుల దోపిడీ కొనసాగుతుంటే ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఎవరికి?

ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలకు, వాస్తవంగా సమకూరే నిధులకు, రైతులకు చేరే ప్రయోజనాలకు మధ్య స్పష్టమైన సంబంధం ఉండాలి. రైతు భూమి, రైతు నీరు, రైతు శ్రమ ఆధారంగా అభివృద్ధి జరగాలి. కార్పొరేట్ పెట్టుబడుల పేరుతో రైతు భూమి, నీటి హక్కులు బలహీనపడకూడదు.

విండ్ పవర్ పేరుతో రైతు భూములపై కార్పొరేట్ కన్ను!

పునరుత్పాదక ఇంధనం దేశానికి అవసరమే. కానీ విండ్ పవర్, సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను దీర్ఘకాలిక లీజులకు ఇవ్వడంలో వారి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఉండాలి.

ప్రత్యేకించి అసైన్డ్ భూముల విషయంలో రైతుల హక్కులు, భూమిపై ఆధారపడిన కుటుంబాల జీవనాధారం, స్వచ్ఛంద అంగీకారం, న్యాయమైన పరిహారం, పారదర్శక ఒప్పందాలు కీలకం. ప్రభుత్వ విధానాల ద్వారా కార్పొరేట్ సంస్థలకు భూములు అందుబాటులోకి వచ్చే పరిస్థితుల్లో రైతుల ప్రయోజనాలకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారో స్పష్టం చేయాలి.

ఒకవైపు కరువుతో రైతులు వ్యవసాయం చేయలేని స్థితికి చేరుకుంటుంటే, మరోవైపు వారి భూములను విద్యుత్ ప్రాజెక్టుల కోసం వినియోగించే విధానాలు వస్తున్నాయి. రైతుకు సాగునీరు, వ్యవసాయానికి పెట్టుబడి, పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా భూమిని ప్రత్యామ్నాయ వ్యాపార ప్రయోజనాలకు మళ్లించడం అభివృద్ధి కాదు.

భూమి రైతుకు జీవనాధారం. అది కేవలం కార్పొరేట్ పెట్టుబడులకు అందుబాటులో ఉన్న ఆస్తి కాదు. రైతుల భూములపై నిర్ణయాలు తీసుకునే ముందు వారి హక్కులు, భవిష్యత్తు భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి.

ఆర్థిక సంఘం కేటాయింపుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం!

విపత్తుల తీవ్రత ఒకవైపు ఉంటే, వాటిని ఎదుర్కొనేందుకు కేంద్రం కేటాయిస్తున్న రాష్ట్ర విపత్తు సహాయ నిధి (SDRF) మరోవైపు రాష్ట్ర అవసరాలకు సరిపోవడం లేదు.

14వ ఆర్థిక సంఘం (2015–20) ఐదేళ్లకు రూ.2,429.50 కోట్లు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం (2021–26) రూ.6,300 కోట్లు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం (2026–31) ఐదేళ్లకు రూ.6,533 కోట్లు మాత్రమే కేటాయించింది.

15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే 16వ ఆర్థిక సంఘం కాలంలో పెరిగిన మొత్తం కేవలం రూ.233 కోట్లు! పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ పెట్టుబడుల వ్యయం, జనాభా, నష్టాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే ఈ పెరుగుదల ఎంత మాత్రం సమంజసం కాదు.

తాజా ఐదేళ్ల కేటాయింపుల్లో కేంద్రం వాటా రూ.4,897.75 కోట్లు కాగా, రాష్ట్రం భరించాల్సిన వాటా రూ.1,633.25 కోట్లు. అంటే కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం భరించాల్సి ఉంటుంది.

ఇదే కాలానికి మహారాష్ట్రకు రూ.31,597 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.16,342 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.12,477 కోట్లు, రాజస్థాన్‌కు రూ.9,825 కోట్లు, గుజరాత్‌కు రూ.9,022 కోట్లు, తమిళనాడుకు రూ.9,051 కోట్లు, కర్ణాటకకు రూ.6,847 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం రూ.6,533 కోట్లతో సరిపెట్టారు.

ఈ కేటాయింపులకు రిస్క్ ఇండెక్స్, జనాభా, వైశాల్యం తదితర ప్రమాణాలు ఆధారమని కేంద్రం చెబుతోంది. అయితే కరువు, తుపాన్లు, వరదలను నిరంతరం ఎదుర్కొనే ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యత దక్కిందా? రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ముందు బలమైన వాదనలు వినిపించిందా? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిందా? అన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.

శ్వేతపత్రం విడుదల చేయాలి… ప్రకటించిన సహాయమెంత? రైతుకు చేరిందెంత?
ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకోలేని ప్రధాన ప్రశ్న ఇదే.
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండున్నరేళ్లలో సంభవించిన కరువు, తుపాన్లు, వరదలు, బుడమేరు విపత్తు, వ్యవసాయ నష్టాలు, ఉద్యాన పంటల విధ్వంసంపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి.

ఈ శ్వేతపత్రంలో కేవలం నష్టాల అంచనాలు, నిధుల ప్రకటనలు మాత్రమే కాకుండా కింది వివరాలు తప్పనిసరిగా ఉండాలి.

  1. ప్రతి ప్రకృతి విపత్తులో జరిగిన మొత్తం నష్టం ఎంత? జిల్లా, మండలం, గ్రామం, పంటల వారీగా ఎంత నష్టం జరిగింది?
  2. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నష్టం అంచనాలు ఎంత? కేంద్రం ఆమోదించిన సహాయం ఎంత?
  3. SDRF, NDRF నుంచి ఇప్పటివరకు వచ్చిన నిధులు ఎంత? ఇంకా రావాల్సిన నిధులు ఎంత?
  4. కేంద్రం విడుదల చేసిన మొత్తం ఎంత? రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చిన మొత్తం ఎంత?
  5. ప్రకటించిన నిధుల్లో వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తం ఎంత? ఏయే పనులకు ఖర్చు చేశారు?
  6. రైతులకు, కౌలు రైతులకు, ఉద్యాన రైతులకు, పశుపోషకులకు అందించిన పరిహారం ఎంత?
  7. ఇంకా పరిహారం అందని రైతులు ఎంతమంది? వారికి అందించాల్సిన మొత్తం ఎంత?
  8. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, రుణ ఉపశమనం రూపంలో రైతులకు జరిగిన ప్రయోజనం ఎంత?
  9. బుడమేరు వరదల బాధితులకు ప్రకటించిన సహాయం, వాస్తవంగా అందించిన సహాయం ఎంత?
  10. కరువు ప్రభావిత మండలాల్లో తాగునీరు, పశుగ్రాసం, ఉపాధి కల్పనకు ఖర్చు చేసిన నిధులు ఎంత?
    ఈ వివరాలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. గ్రామాల వారీగా పరిహారం పొందిన రైతుల జాబితా ప్రకటించాలి. అర్హులైన రైతులకు ఇంకా అందాల్సిన పరిహారాన్ని వెంటనే చెల్లించాలి.
    కేంద్రం నుంచి ఎంత వచ్చిందో రాష్ట్రం చెప్పాలి. రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందో కేంద్రం చెప్పాలి. చివరకు రైతుకు ఎంత చేరిందో ఇద్దరూ సమాధానం చెప్పాలి.
    నిధుల ప్రకటన ఒకటి… విడుదల మరొకటి… రైతుకు చేరేది ఇంకొకటి! ఈ అంకెల గారడీకి తెరదించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
    డబుల్ ఇంజన్ సర్కార్… రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎందుకీ మౌనం?
    కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని రోజూ ఆకాశానికెత్తుతూ ప్రశంసల వర్షం కురిపించే రాష్ట్ర పాలకులు, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన విపత్తు నిధులు, ప్రత్యేక ప్యాకేజీల విషయంలో మాత్రం ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు?
    రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా? కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా? రాజకీయ అనుబంధం ఉన్నప్పుడు రాష్ట్రానికి అదనపు ప్రయోజనాలు సాధించాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు బలపడుతున్నాయి.
    ప్రధానిని పొగడటంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడంలో చూపుతున్న ఉత్సాహంలో కొంతైనా రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధనలో చూపితే రైతాంగానికి మేలు జరిగేది కాదా?
    డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రెండు ప్రభుత్వాలు ఒకే రాజకీయ కూటమిలో ఉండటం మాత్రమే కాదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం, రైతులకు భరోసా కల్పించడం కూడా కావాలి. కేంద్రం ముందు రాష్ట్ర హక్కులను వినిపించలేని పాలకులు, రాష్ట్రంలో అభివృద్ధి ప్రచారంతో ప్రజలను నమ్మించాలని చూడటం ఎంతవరకు సమంజసం?
    రైతాంగాన్ని ఆదుకోవాలి… రాష్ట్ర హక్కులను సాధించాలి!
    కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక విపత్తు సహాయ ప్యాకేజీ ప్రకటించాలి. కరువు, వరదలు, తుపాన్ల నష్టాలను సమగ్రంగా పరిగణించి అదనపు NDRF సహాయం అందించాలి. రాష్ట్ర విపత్తు సహాయ నిధి కేటాయింపులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.
    రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి. పంటల వారీగా, రైతుల వారీగా నష్టాలను అంచనా వేసి న్యాయమైన పరిహారం చెల్లించాలి. పొగాకు, వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, బత్తాయి, చీని తదితర పంటల రైతులను ఆదుకోవాలి. కౌలు రైతులకు ప్రత్యేక పరిహారం, సాగుదారుడి పేరుతో పంటల బీమా, రుణాల రీషెడ్యూలింగ్, వడ్డీ ఉపశమనం కల్పించాలి.
    రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలి. వర్షపు నీటిని ఒడిసిపట్టి ప్రతి చుక్కనూ వ్యవసాయానికి ఉపయోగపడేలా సమగ్ర ప్రణాళిక అమలు చేయాలి.
    హార్టికల్చర్ హబ్, విండ్ పవర్ ప్రాజెక్టుల విషయంలో రైతుల భూమి హక్కులు, నీటి హక్కులు, ఆదాయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రైవేటు పెట్టుబడుల ప్రయోజనాల కంటే రైతు ప్రయోజనాలే ప్రధానంగా ఉండాలి.
    చివరగా ఒక్కటే ప్రశ్న…
    రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. కరువొస్తే పరిహారం లేదు. వరదొస్తే నష్టానికి తగిన సహాయం లేదు. కౌలు రైతుకు గుర్తింపు లేదు. సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్నాయి. భూమి సాగు చేసుకునే భరోసా లేదు. అయినా అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల ప్రకటనలు, డబుల్ ఇంజన్ పాలన పేరుతో ప్రచారాలు మాత్రం ఆగడం లేదు.
    ప్రకృతి విపత్తులను ఆపడం ప్రభుత్వాల చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ ఆ విపత్తుల నుంచి ప్రజలను రక్షించడం, రైతులకు న్యాయం చేయడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం పాలకుల నేరపూరిత నిర్లక్ష్యమే అవుతుంది.
    రైతు బతికితేనే వ్యవసాయం బతుకుతుంది. వ్యవసాయం బతికితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బతుకుతుంది. రైతు కన్నీళ్లపై నిర్మించే అభివృద్ధి ఏదీ నిజమైన అభివృద్ధి కాదు!
    కొండంత విపత్తు వచ్చినప్పుడు గోరంత సహాయం చేసి చేతులు దులుపుకోవడం కాదు… రైతు జీవితానికి భరోసా కల్పించాలి. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించాలి. పాలకుల ప్రకటనలకు, ప్రజల వాస్తవ జీవితాలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాలి.
    ప్రకటనలతో కాదు… ఆచరణతో నిరూపించాలి. ప్రచారంతో కాదు… పరిహారంతో రైతును ఆదుకోవాలి. రైతుల కన్నీళ్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే!
  • గుజ్జుల ఈశ్వరయ్య
    (ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు)
Total Visitors: 3,329,068