ప్రజల ఆరోగ్యానికి జగనన్న ఇస్తున్న గొప్ప భరోసా
దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు, ఉచితంగా వైద్యం
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,422 మెడికల్ క్యాంపుల ఏర్పాటు
ఈ నెల 29 నాటికి 11208 క్యాంపులు పూర్తి
ఆరోగ్యశ్రీపై అవగాహన కోసం ప్రత్యేక కార్యచరణ
నియోజకవర్గాల వారీగా నిర్వహణకు చర్యలు
ఆరోగ్యశ్రీ యాప్, రోగి చికిత్సకు సంబంధించి పూర్తి స్థాయి పర్యవేక్షణ
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఉన్నతస్థాయి సమీక్ష
ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గొప్ప కార్యక్రమాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కూడా ఒకటి అని, ప్రజలకు ఉన్నతస్థాయి వైద్యాన్ని ఆరోగ్య సురక్ష ద్వారా చేరువచేయగలిగామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, ఏపీఎంఎస్ ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ నర్సింహం, డీహెచ్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజల ఆరోగ్యానికి గొప్ప భరోసాను ఇస్తున్నారని తెలిపారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,422 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 29 వ తేదీ నాటికి మొత్తం 11208 వైద్య శిబిరాల నిర్వహణ పూర్తయిందని తెలిపారు. మొత్తం 46.31 లక్షల ఓపీ సేవలు రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యాయని చెప్పారు. బీపీ పరీక్షలు మొత్తం 21.6 లక్షలు, మధుమేహం టెస్టులు 18.5లక్షలు, కళ్లె పరీక్షలు 1.79లక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.
ఇంత తక్కువ సమయంలో ఇన్ని లక్షల పరీక్షలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని వెల్లడించారు. చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. ఒక్కో వైద్య శిబిరానికి సగటున 372 చొప్పున ఓపీ సేవలు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఈ కార్యక్రమం ఏ స్థాయిలో ఉపయోగపడుతున్నదో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీపై అవగాహన ఎంతో అవసరం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా వినియోగించుకోవాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంటింటికీ వాలంటీర్లు, ఏఎన్ ఎంలు వెళ్లి ఆరోగ్యశ్రీపై పూర్తిస్థాయి అవగాహనను ప్రజలందరికీ కల్పించడం లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ యాప్ లను డౌన్‌లోడ్ చేయడం, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఉచితంగా అందిస్తున్న చికిత్సలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్న రోగులకు ఫాలో అప్ వైద్యం అందేలా చేయడం, చికిత్స అవసరం ఉన్నవారిని గుర్తించి వారికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేలా చూడటం, అవసరమైతే వారిని వెంటపట్టుకుని ఆస్పత్రులకు తీసుకెళ్లటమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు.
ఇంటికే ముందులు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయండి
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సంబంధించి వారి ఇంటికే నెలా నెలా మందులు పంపిణీ చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజలకు కావాల్సిన మందులు ఏమున్నాయో ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న మందుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలని పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1.4 లక్షల మధుమేహం కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయని, వీరందరికీ షుగర్ నిర్థారణ కోసం చేసే హెచ్‌బీ1ఏసీ టెస్టులు చేయాలని సూచించారు.
జేఏసీ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.25 లక్షల బీపీ కేసులను కూడా కొత్తగా కనుగొన్నట్లు చెప్పారు. వీరందరికీ మందస్తుగానే వైద్యం అందించడం వల్ల వారి నిండు ప్రాణాలను కాపాడినట్లయిందని తెలిపారు. వీరి దీర్ఘకాలిక రోగాలను నియంత్రించుకునే గొప్ప అవకాశం సురక్ష కార్యక్రమం ద్వారా ఏర్పడిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మందుల పంపిణీ కి సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధతతో ఉండాలని సూచించారు.