– ఈటల పార్టీ నుండి వెళ్లిపోవడంలో హరీష్ రావు పాత్ర లేదు
– బీఆర్ఎస్ కు సంపద లాంటి వ్యక్తి హరీష్ రావు
– ఆయనను బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా ?
– ఇది ఖచ్చితంగా ద్రోహ పాత్రగానే భావిస్తున్నాం
– జలదృశ్యంలో దిమ్మె కట్టించిందే హరీష్ రావు
– రేపు కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే ఇలాగే ఆరోపణలు చేస్తారా ?
– కేసీఆర్ ని కాదని పార్టీలో ఇంకెవరూ పాత్ర పోషించే పరిస్థితి ఉండదు
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: బ్రహ్మం గారికి సిద్దయ్య లాంటి వ్యక్తి కేసీఆర్ కి హరీష్ రావు. బీఆర్ఎస్ కు సంపద లాంటి వ్యక్తి హరీష్ రావు. ఆయనను బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా ? జలదృశ్యంలో దిమ్మె కట్టించిందే హరీష్ రావు. ఏ పనిచెప్పినా ఎదురు మాట్లాడకుండా పనిచేసిన వ్యక్తి హరీష్ రావు. కార్యకర్తగా, నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండి పనులు చేసిన వ్యక్తి హరీష్ రావు.
అనేక ఉప ఎన్నికల్లో తామంతా న్యూస్ పేపర్లు వేసుకుని ఒకే చోట నిద్రించిన వాళ్లం. తెలంగాణ కోసం చిత్తశుద్దితో పనిచేసిన వాళ్లం. నాడు హరీష్ రావు పనితీరును పొగిడిన వారే నేడు ఆరోపణలు చేస్తున్నారు. వారికి ఎలా మనసు ఒప్పుతుందో అర్ధం కావడం లేదు. ఈటల రాజేందర్ పార్టీ నుండి వెళ్లిపోవడంలో హరీష్ రావు పాత్ర లేదు. ఈటెల టీఆర్ఎస్ లోకి రావడానికి కారణం నేను.
2004 ఉప ఎన్నికలో హరీష్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి దినదినం ప్రజాభిమానం చూరగొంటూ వచ్చారు. ఆయన నుండి ఎంతో నేర్చుకోవాలి. వయసులో చిన్నవాడైనా దక్షతలో అన్నలాంటి వాడు అని అనేక సార్లు చెప్పాను. కాళేశ్వరం ఎత్తిపోతల మీద శాసనసభలో హరీష్ రావు కాంగ్రెస్ డొల్లతనాన్ని ఎండగట్టారు. కొందరు హరీష్ రావు ని టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
తెలంగాణను ప్రేమించే వాళ్లు బీఆర్ఎస్ కు రక్షణ కవచంగా ఉండాల్సిన తరుణంలో, కుట్రలను చీల్చి చెండాడాల్సింది పోయి ఆరోపణలు చేయడం బాధాకరం. ఇది ఖచ్చితంగా ద్రోహ పాత్రగానే భావిస్తున్నాం. బహుళ ప్రయోజనం నెరవేర్చే చోట శత్రువు కుట్ర చేస్తుంటే దానికి బలం చేకూర్చేలా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు.
విద్యుత్ ఉద్యమ సమయం నుండి మొదలుపెడితే టీఆర్ఎస్ ఆవిర్భావం కన్నా ముందు నుండే పార్టీ గుర్తు, పార్టీ జెండా రంగు, ఉద్యమ సరళి మీద అనేక ఉద్యమాలు అధ్యయనం చేసిన వాళ్లలో మొదటి డజను, అరడజను వాళ్లలో నేను ఒకన్ని, అప్పటి నుండి హరీష్ రావు ఉన్నారు.
అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడమే కాకుండా, రేవంత్ కాళ్లు మొక్కాడని చెప్పడం చాలా బాధగా అనిపించింది. అసలు ఈ ఆరోపణలను తెలంగాణ సమాజం నమ్ముతుందా ? ఇంత అర్ధరహితంగా ఆరోపణలు చేస్తారా ? రేపు కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే ఇలాగే ఆరోపణలు చేస్తారా ? వాళ్లకు కష్టం వచ్చినప్పుడు పార్టీ అండగా నిలబడింది.
కాళేశ్వరం ఎత్తిపోతల అనుమతుల కోసమే మహారాష్ట్రకు 25 సార్లు వెళ్లారు. ఏ శాఖను ఇచ్చినా సమర్ధవంతంగా పనిచేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను సభలో, బయటా ఎండగడుతున్నది హరీష్ రావు. హరీష్ రావు మీద ఆరోపణలు చేయడం మూలంగా ఎవరికి లాభం చేకూరుస్తున్నారు ? సంతోష్ రావు ఎన్నడూ ప్రభుత్వంలో లేరు. ఆయన ఎక్కువగా కేసీఆర్ సహాయకుడిగానే ఉన్నారు. ప్రజలకు సాంత్వన చేకూర్చాల్సిన సమయంలో ఈ పంచాయతీ ఎందుకు ముందుకు పెడుతున్నారు ?
ఇది పద్దతి కాదు. దీనిని ఎవరూ హర్షించరు. ఇతర పార్టీల వారు కూడా హరీష్ రావుకు నైతిక మద్దతు ఇస్తున్నారు. కేసీఆర్ ని తప్పుదోవ పట్టిస్తే తప్పుదారి పట్టే స్థితిలో కేసీఆర్ లేరు. అలా అంటున్నారంటే వారు కేసీఆర్ ని అర్ధం చేసుకోనట్లే. కేసీఆర్ ని కాదని పార్టీలో ఇంకెవరూ పాత్ర పోషించే పరిస్థితి ఉండదు. పార్టీలో ఎవరైనా కేసీఆర్ ఇచ్చిన పాత్రనే పోషించాలి.
పాలమూరు జిల్లా పర్యటనలో రేవంత్ వ్యాఖ్యలు గర్హనీయం. టీడీపీ పార్టీ లేకుండా కుట్రలు చేశారని చెబుతూ టీడీపీతో బీఆర్ఎస్ పార్టీని పోల్చడం అవగాహనారాహిత్యం. అపరిపక్వతనం. టీడీపీ అంతర్ధానం కావడానికి అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి. తెలంగాణ అభిలాషను గౌరవించకుండా, వ్యతిరేకంగా నిలబడ్డందుకే తెలంగాణ సమాజం నుండి దూరమయింది. అనేకమంది ఆ పార్టీ కోసం పనిచేసిన వారు దానికి దూరమయ్యారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని ఆనాడు ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీని అనేకసార్లు ప్రకటించింంది టీడీపీ పార్టీ, ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ జీవితకాలం కాంగ్రెస్ పార్టీకి దూరంగా, వ్యతిరేకంగా ఉన్నది. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నందుకే ఆ పార్టీ ఇక్కడి నుండి దూరమయింది.
ఏపీలో నూటికి నూరుపాళ్లు తెలంగాణ ఇచ్చినందుకు, కాంగ్రెస్ లేకుండా పోవడానికి కారణం టీడీపీ. తెలంగాణలో ఇప్పుడు టీడీపీ లేదని రేవంత్ రెడ్డి బాధపడుతుండడం గమనార్హం. తెలంగాణ ఇచ్చారని ఏపీలో నామరూపాల్లేకుండా పోయింది కాంగ్రెస్. తెలంగాణ వచ్చినందుకు రేవంత్ రెడ్డి బాధపడుతున్నట్లు అర్ధం అవుతున్నది.
పాలమూరులో ప్రతి మండలకేంద్రంలో రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినందుకు పాలమూరుకు కనీసం యూరియా కూడా లేకుండా పోయింది. రూ.32 వేల కోట్ల 5 రిజర్వాయర్లు, 4 పంప్ హౌస్ లు నిర్మిస్తే, మిగిలిన పనులు 21 నెలలుగా పూర్తి చేయకుండా పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి ఎలా పాలమూరు బిడ్డ అవుతాడు ? కేవలం రూ.1200 కోట్లు ఖర్చు పెడితే రిజర్వాయర్లలో నీళ్లు నిండుతాయి. ఉన్న టెండర్లు రద్దు చేసి కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల చేపట్టారు.
52 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పరిశీలించి మిగిలిన పనులు చేయడానికి చేతకాదా ? ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉంటే మాటలతో కాలం గడపరు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కేసీఆర్ మీదనే దుష్ప్రచారం చేస్తున్నారు. మూడున్నరేళ్లలో కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.94,300 కోట్లు ఖర్చుపెట్టారు. అందులో లక్ష కోట్ల అవినీతి అని అబద్దాలు ప్రచారం చేశారు. చేస్తున్నారు.
కాళేశ్వరం మీద వేసింది ఒక లొట్టపీసు కమీషన్అది ఒక లొట్టపీసు నివేదిక. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మీద బురదజల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 30 సార్లు శాసనసభలో మైక్ కట్ చేస్తే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి తన వాదనతో 3 చెరువుల నీళ్లు తాగించారు. సాగునీళ్లు ఆంధ్రాకు తరలించి తెలంగాణను కక్ష రాజకీయాలకు పరిమితం చేయాలన్న భావనతో రేవంత్ ఉన్నట్లు అర్ధం అవుతున్నది.
ఒకానొక సమయంలో తెలంగాణ విషయంలో చంద్రబాబు తప్పును ఒప్పుకుని బాధపడ్డా, రేవంత్ మాత్రం ఎందుకో పశ్చాత్తపపడడం లేదు. పాలమూరు కష్టాలకు కారణం కాంగ్రెస్ కాదా ? నేడు పచ్చబడ్డ పాలమూరుకు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులకు కారణం కేసీఆర్. గ్రామాలు, తండాలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి అంటే కారణం కేసీఆర్. ఇతర ప్రాంతాల వారు, ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారు ఇదేనా గత పాలమూరు అని ఆశ్చర్యపోతున్నారు.
మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలి అంటే నిత్యం రేవంత్ రెడ్డి శాపనార్ధాలు పెడుతున్నాడు. కేసీఆర్ తెచ్చిన మెడికల్ కళాశాలనే రేవంత్ రెడ్డి కొడంగల్ కు తరలించాడు. తయారుగా ఉన్న వాటిని తీసుకువెళ్లాడు. పట్టుబట్టి ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి పడావు పెడుతున్నాడు.
కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల విషయంలో రేవంత్ రెడ్డిది నేరపూరిత నిర్లక్ష్యం. మేడిగడ్డలో కూలిన రెండు పిల్లర్లను చూపి, దానిని కట్టిన ఎల్ అండ్ టీ మరమ్మతు చేస్తానన్నా ప్రభుత్వం అడ్డుకోవడం గమనార్హం. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయింది. కాళేశ్వరం పుట్టించిన సంపద ఎంత ?
అటు చంద్రబాబు, ఆయన మద్దతుతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూకుమ్మడిగా తెలంగాణ మీద దాడి చేస్తున్నాయి. కాళేశ్వరం నిర్మాణం, దాని స్థలం మార్చాల్సిన అవసరాలను వివరించాం. అయినా దుష్ప్రచారం చేస్తున్నారు.
తమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టేందుకు చేతనయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు తీసుకురావాలి. లేనిదాన్ని ఆపాదించి ప్రజలలో అనుమానాలు రేకెత్తించే విధంగా విషప్రచారం చేశారు. కానీ ఎల్లప్పుడూ అబద్దాలతో కాలం గడపలేరు. ప్రభుత్వం ఇలాగే కక్షపూరితంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలు, రైతులు ప్రభుత్వానికి బుద్ది చెబుతారు.
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మల్యేలు కేపీ వివేకానంద, ముఠా గోపాల్, బీఆర్ఎస్ నేతలు అజమ్ అలీ, ఇంతియాజ్ ఇసాక్ పాల్గొన్నారు.