-టీడీపీ ప్రభుత్వంలో పోలీసుల కొత్త పోకడ
-చివరకు పోలీసులపైనా దాడులు. ఇది అతి దారుణం
-అయినా పవన్‌కళ్యాణ్ నోరు మెదపడం లేదు
– మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య
తాడేపల్లి: రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఓ రిటైర్డ్ డీజీపీ, ఐజీ.. ఇద్దరూ కలిసి అమలు చేస్తున్నారని.. దేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అని పేర్ని నాని ప్రశ్నించారు. అలాగే, ఇంత ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలోనైనా జరుగుతోందా? అని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నిలదీశారు.
రాష్ట్రంలో గడిచిన 60 రోజులుగా అంబేడ్కర్ రాజ్యాంగం బదులు.. నారా లోకేష్ ప్రకటించిన రెడ్‌బుక్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే పోలీసు విధి నిర్వహణను కొత్త పోకడలతో నడిపించే పరిస్థితి కనిపిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని పోకడలు కూటమి ప్రభుత్వంలో చూస్తున్నామని చెప్పారు.
గతంలో యూపీ, బీహార్‌లో ఇలాంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను చూశామన్న నాని.. ఇప్పుడు ఆ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని స్పష్టం చేశారు. రోజు, రోజుకూ రాష్ట్రంలో హింస పేట్రేగిపోతోందని ఆవేదన చెందారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతోందన్న ఆయన, చివరకు పోలీసులపైనా దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నోరు మెదపడం లేదని ప్రస్తావించారు.
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో జరిగిన దారుణ హత్య అత్యంత హేయమన్న పేర్ని నాని.. ఆ ఘటనపై కూటమి ప్రభుత్వ పెద్దలు సిగ్గు పడాలని చెప్పారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్ధను కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో దిగజార్చిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. జిల్లా కేంద్రానికి కేవలం 12 కి.మీ దూరంలో ఉన్న సీతారామాపురంలో, టీడీపీ మూకలు యథేచ్ఛగా దాడి చేసి, దారుణంగా హత్య చేసినా, దానిపై ముందే సమాచారం అందించినా, పోలీసులు స్పందించలేదని పేర్ని నాని ఆక్షేపించారు.
సీతారామాపురంలో సుబ్బారాయుడి హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని ఆయన తేల్చి చెప్పారు. హత్య జరిగిన తరవాత తాపీగా అక్కడికి చేరుకున్న పోలీసులు, శవాన్ని కాపలా కాయడం కోసం వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
ఇంకా జగ్గయ్యపేటలో గంజిపల్లి శ్రీనివాస్‌పై అత్యంత దారుణంగా దాడికి దిగిన పచ్చమూకలు విచ్చలవిడి స్వైరవిహారం చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శాంతిభద్రతలపై తేనె పూసిన మాటలతో ప్రజలను ఎలా మభ్యపెట్టారో చూడాలన్న పేర్ని నాని.. ప్రెస్‌మీట్‌లో ఆ వీడియోలు ప్రదర్శించారు.
గతంలో 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ల తొలి కాన్ఫెరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. ‘మా కార్యకర్తలు పదేళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉన్నారు. వాళ్ల నాలుకలు తడపండి’ అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన నాని.. తాజాగా చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలను మీడియా ముందు ప్రదర్శించారు.రాజకీయ పార్టీ తరహాలోనే ప్రభుత్వాన్ని నడుపుతామని చంద్రబాబు చెప్పడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో.. అప్పటి సీఎం వైయస్ జగన్, ఏం మాట్లాడారన్నది కూడా పేర్ని నాని చూపారు.
పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు తాను కానిస్టేబుల్ కొడుకునని.. ఖాకీ విలువ తెలుసని చెప్పారని.. మరి ఇవాళ రాష్ట్రంలో పోలీసులపై దాడి చేస్తుంటే నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వమే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేయడం తప్పు కాబట్టి.. ప్రజావేదికను కూలగొట్టారని, ఇంకా గతంలో జగన్‌గారిని సైకో అని విమర్శించిన పవన్‌కళ్యాణ్, కొచ్చిన్‌లో మారాడ్ బిల్డింగ్స్, ఢిల్లీలో సూపర్ టెక్ టవర్స్‌ని సుప్రీం కోర్డు కూల్చివేయించిన ఘటనలను ప్రస్తావిస్తూ.. ఆ ఘటనలలో కోర్టులను.. జగన్‌ని అన్నట్లు సైకో అని ఎందుకు అనలేకపోయారని నిలదీశారు.