(చాకిరేవు)
అమలాపురం రూరల్ మండలం, సాకుర్రు గ్రామం… విప్పర్తి వారి ఇంటి కుమారుడి మనసులో అగ్నిగుండం రగులుతోంది. ఆ అబ్బాయి పేరు విప్పర్తి హర్షవర్ధన్. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన అతడికి, సులువైన డబ్బు కోసం ఆలోచనలు మొదలయ్యాయి. ఆ ఆలోచనల పర్యవసానం ఓ దారుణమైన కుట్రకు దారి తీసింది.
కుటుంబంలో ఎవరికీ తెలియని ఆ కుట్రలో, అతడు తన కన్న తండ్రిని లక్ష్యంగా చేసుకున్నాడు. తండ్రి వెంకటరమణకు ఉన్న ఇన్సూరెన్స్ సొమ్ము మీద అతడి కన్ను పడింది. ప్రమాదంలో తండ్రి మరణిస్తే ఆ సొమ్ము మొత్తం తనకే వస్తుందని అతడు దురాశతో ఎదురుచూశాడు. తండ్రిని ఎలా అంతమొందించాలనే ఆలోచన అతని మనసులో నాటుకుపోయింది.
గత ఏప్రిల్ నెలలో, అనుకోకుండా ఆ రోజు రానే వచ్చింది. కామనగరువు బైపాస్‌లో వెంకటరమణ తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో, ఒక అద్దె కారు ఆయనను అనుసరిస్తోంది. ఊహించని విధంగా, ఆ కారు బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
యాక్సిడెంట్ అని అందరూ భావించారు. ఈ దుర్ఘటనను ఒక ప్రమాదంగా చిత్రీకరించి, హర్షవర్ధన్ అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. పోలీసులు కూడా ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేశారు.
కానీ విధి అతడి కుట్రను పసిగట్టేసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ మృత్యువు అంచుల నుంచి బతికి బయటపడ్డారు. కిమ్స్ ఆసుపత్రిలో కోమా నుంచి బయటకు వచ్చాక, జరిగింది మొత్తం వివరించారు. ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు సీఐ డి. ప్రశాంత్ కుమార్, ఎస్ఐ శేఖర్ బాబు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.
వారు లోతుగా పరిశీలించగా, కొన్ని అవాస్తవాలు బయటపడ్డాయి. ఆ అద్దె కారు, హర్షవర్ధన్ ప్రవర్తన, ఘటన జరిగిన తీరు… వీటన్నింటిలోనూ అనుమానాస్పద అంశాలు కనిపించాయి. చివరికి, పోలీసులు తమ దర్యాప్తులో అసలు నిజాన్ని వెలికితీశారు. డబ్బు కోసం కన్న తండ్రిని అంతమొందించాలని ప్రయత్నించిన ఆ కుమారుడి క్రూరమైన కుట్ర వెనుక ఉన్న కారణాలు, ఆధారాలు బయటపడ్డాయి.
ఆ నేరస్థుడు చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఒక గూటి పక్షుల లెక్కన సింధూరం, చిరునవ్వులతో వున్న ఫోటోలో వున్నది ఆ ఉత్తమమైన కొడుకే.