– కలెక్టర్ చదలవాడ నాగరాణి నాయకత్వంలో పశ్చిమ గోదావరిలో వినూత్న గ్రామీణ ప్రగతి
భీమవరం : పల్లె ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వావలంబన—ఈ మూడు లక్ష్యాలను సమన్వయంగా సాధించే దిశగా పశ్చిమ గోదావరి జిల్లా ముందంజలో నిలుస్తోంది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టమైన దృష్టి, కఠినమైన పర్యవేక్షణతో అమలవుతున్న కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నాయి. ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుని విధానాలను రూపకల్పన చేయడమే ఈ విజయాలకు మూలమని అధికారులు చెబుతున్నారు.
సహజ సాగుకు గిట్టుబాటు ధర – సహజ ఆహార విక్రయ కేంద్రాలు
సహజ వ్యవసాయం చేపడుతున్న రైతులు మార్కెట్ ధరల హెచ్చుతగ్గులతో నష్టపోతున్న పరిస్థితిలో సహజ ఆహార విక్రయ కేంద్రాలు వారికి భరోసాగా మారాయి. పలకోడేరు, ఉండి, అత్తిలి, తాడేపల్లిగూడెం మండలాల్లో గ్రామ సంస్థలు, మండల సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రాలు రైతులకు కనీస మద్దతు ధరను నిర్ధారిస్తున్నాయి. ప్రతిరోజూ రసాయన రహిత కూరగాయలు ప్రజలకు అందుబాటులోకి వస్తుండగా, మహిళలకు ఉపాధి కలుగుతోంది. ఈ వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ సూచనలు ఇస్తున్నారని అధికారులు తెలిపారు.
మహిళా పారిశ్రామికతకు మధుర స్వరూపం – చోకో టేల్స్
తాడేపల్లిగూడెం మండల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన చోకో టేల్స్ చాక్లెట్ తయారీ కేంద్రం మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. స్థానిక కోకో గింజలతో, పూర్తిగా శిక్షణ పొందిన స్వయం సహాయక సంఘాల మహిళలే ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తయారీ నుంచి ప్యాకింగ్ వరకూ అన్ని దశల్లో మహిళలే ముందుంటున్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల పథకం కింద రుణం పొందడంలోనూ, మార్కెట్ అనుసంధానంలోనూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తీసుకున్న ప్రత్యేక చొరవే ఈ యూనిట్ విజయంలో కీలకంగా మారిందని మహిళలు పేర్కొంటున్నారు.
గుర్రపుడెక్క నుంచి ఉపాధి – పర్యావరణ హిత మార్గం
కాలువలు, చెరువులను ఆక్రమించి వ్యవసాయానికి ఆటంకంగా మారిన (గుర్రపుడెక్క) జలకుంభి సమస్యను పశ్చిమ గోదావరిలో అవకాశంగా మలిచారు. రసాయనాల వాడకం లేకుండా జలకుంభిని తొలగించి, దాన్ని సేంద్రియ ఎరువుగా మార్చే కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి సృష్టి జరుగుతోంది. గ్రామ సంస్థలకు మంచి ఆదాయం లభించడమే కాకుండా మహిళలకు స్థిర వేతనం అందుతోంది. ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా విస్తరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అమలు వేగం పుంజుకుంది.
నిరంతర సమన్వయం, పర్యవేక్షణ, ప్రోత్చాహమే విజయానికి సూత్రం
రైతు, మహిళ, ప్రకృతి—ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించాలన్న సంకల్పంతో జిల్లా యంత్రాంగాన్ని సమన్వయపరుస్తూ కలెక్టర్ చదలవాడ నాగరాణి ముందుకు తీసుకెళ్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు, నిరంతర సమీక్షలు, స్పష్టమైన లక్ష్యాలతో ఆమె పనిచేయడం వల్లే పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రానికి మార్గదర్శక జిల్లాగా ఎదుగుతోందని రాష్ట్ర స్థాయి అధికారులు అభిప్రాయపడుతున్నారు. పల్లెల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, ఆదాయ భరోసా, పచ్చని ప్రకృతి—ఇవన్నీ కలెక్టర్ చదలవాడ నాగరాణి నాయకత్వానికి ప్రత్యక్ష ఫలితాలుగా నిలుస్తున్నాయి.