– ఎన్నికల్లో ఏమీ పీ(కే)క లేక..
– బీహారీలు ‘పీకే’శారోచ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒక ఆశ్రమంలో గురువు గారు శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అందులో ఒక శిష్యుడిని పిలిచి, రామాపురం వెళ్లిరమ్మన్నారు. అందుకు ఆ శిష్యుడు గురూజీ.. అక్కడికి వెళ్లాలంటే చెరువు దాటాలి కదా? మరి నాకేమో ఈత రాదు ఎలా? అని అడిగాడు. దానికి ఆ గురువు గారు.. ఓస్. అదెంతపని? చెరువు దగ్గరకు వెళ్లి మా గురువుగారు చెప్పారు. పక్కకు తప్పుకోమని నా పేరు చెప్పు అన్నారట. సంతోషించిన శిష్యపరమాణువు.. రామాపురం వెళ్లడం, మరుసటి రోజు రావడం జరిగిపోయింది. ఆశ్చర్యపోయిన గురువర్యులు.. అదేంట్రా అప్పుడే ఎలా వచ్చావ్? నీకు ఈత రాదన్నావు కదా? అని ప్రశ్నించారు. అందుకా శిష్యపరమాణువు ఏమాత్రం సందేహించకుండా.. చెరువు దగ్గరకు వెళ్లి మా గురువు గారు చెప్పారు. పక్కకు తప్పుకోమని మీ పేరు చెప్పా.
వెంటనే పక్కకు తప్పుకుంది గురూగారూ అన్నాడట మినమ్రంగా!
దానితో ఆలోచనలో పడ్డ గురూజీ.. నా శిష్యుడు చెబితేనే చెరువు పక్కకు తప్పుకున్నప్పుడు, నేను చెబితే మొత్తం పక్కకు వెళుతుంది కదా అనుకున్నారట. అనుకుందే తడవుగా చెరువు వద్దకు వెళ్లి.. ‘‘నేనే వచ్చా. పక్కకు జరుగు’’ అని ఆదేశించారట. కానీ చెరువు అంగుళం కూడా జరగకపోవడంతో.. ఓహో నేను లోపలికి వెళితే తప్ప జరగదేమో అనుకుని లోపలికి వెళ్లి మునిగిపోయారట.
– ఇది మనం చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కథల పుస్తకాల్లో చదివిన వందల కథల్లో ఒకటి.
– అన్నిటికీ బొక్కలు పెట్టే సూది దాని బొక్కలో అది దూరలేదు – ఇది ఆధునిక సామెత.
ప్రశాంత్ కిశోర్. ఈ పేరు తెలుసుకదా?.. తెలియకేం?.. గెలుపు ముఖం తెలియని పార్టీలను గెలిపిస్తారని, ఆ పార్టీ అభ్యర్ధులను ఎన్నికల ఫలితాల్లో పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడేంత లెవల్లో ట్రైనింగ్ ఇస్తారని, అసలాయన కంపెనీతో ఎంఒయు కుదుర్చుకోవడమే మహదవకాశం-మహద్భాగ్యమన్న ప్రచారం పెపంచకానికి తెలిసిందే. అసలాయన అపాయింట్మెంటుకే కోట్లు తగలెయ్యాలట. అందుకే ఆయనంటే పొలిటికల్ పార్టీలకు బోలెడు మోజు.బొచ్చెడు క్రేజు!
* * * తిరుమల వెంకన్నను దర్శించుకునే ముందు వరాహ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నట్లు.. దేశంలో ఎవరైనా కొత్త పార్టీలు పెట్టాలన్నా, పోనీ పెట్టిన తర్వాత గెలవాలన్నా, ఈ బిహారీబాబు సలహా సూచనలు మస్ట్‌గా మారింది. ఏయే నియోజకవర్గాల్లో ఏ కులం అభ్యర్ధిని నిలబెట్టాలి? ఏ మతం అభ్యర్థిని నిలబెట్టాలి? ప్రచారంలో ఎవరిని తిట్టాలి? ఎన్ని బూతులు తిడితే ఎన్ని ఓట్లు పడతాయి? ఎంతమందిని జనాభా ఖర్చు రాస్తే అది ఎన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చూపిస్తుంది? అసలు పార్టీ అధినేత ఏ డ్రెస్సు వేసుకోవాలి? ఏ నియోజకవర్గంలో ఏం మాట్లాడాలి? ఎంత మోతాదులో ప్రత్యర్ధులను తిట్టిపోయాలి? మీడియాలో ఏం రాయించాలి? సోషల్‌మీడియాలో ఎన్ని కొట్లాటలు పెట్టాలి? ఆ రాష్ట్రంలోని ప్రధాన కులాల మధ్య ఎన్ని పంచాయితీలు పెట్టాలన్న ‘శకుని’ సలహాలన్నీ ఈ బిహారీబాబే ఇస్తారట.
అంటే మొత్తంగా పార్టీ అధ్యక్షుడు ఉత్సవవిగ్రహం. జస్ట్.. పీకే ఆడించే ఒక తోలుబొమ్మ!
* * * మరి అంతలావు సలహాదారు, తిరుగులేని ఎన్నికల వ్యూహకర్త, శకుని-బృహస్పతిని చంపి పుట్టిన ప్రశాంత్‌కిశోర్ అనే అపర చాణక్యుడు కమ్ అపర మేధావే.. స్వయంగా ఒక పార్టీ పెడితే?.. టన్నులకొద్దీ తెలివితేటలున్న ఈ ‘ఎన్నికల ప్రకాశం’ స్వయంగా పార్టీ పెడితే.. పెద్దపార్టీలు కూడా ఆయన సునామీలో ఊడ్చుకుపోవూ?.. అసలు ఆయన బుర్రలో గుజ్జుకు జాతీయ పార్టీలు కూడా గింజుకుపోవూ?.. ఇదీ ప్రశాంత్‌కిశోర్ బిహార్‌లో స్థాపించిన జనసురాజ్ పార్టీపై, ఎన్నికలు ముందు పెపంచకం అంచనా. వారి అంచనాలో తప్పు లేదు. ఎందుకంటే గుజరాత్లో మోదీ, ఏపీలో జగన్, బెంగాలో దీదీ..
ఇంకా చాలామందిని పీకేనే గెలిపించారన్న ప్రచారం ఉంది కాబట్టి!
* * * మరి అంతలావు ప్రశాంత్ కిశోర్.. బిహార్‌లో పార్టీ పెట్టినా బిహారీలు ఆయన పార్టీని అన్ని నియోజకవర్గాల్లో ‘పీకే’యడమే వింత.
శకునాలు చెప్పే బల్లి కుడితోపడ్డట్లు.. సర్వేలు చేసే పీకే బిహార్‌లో పడ్డారన్నమాట! మరి అందరినీ గెలిపించే పీకే.. సొంతింట్లో ఎందుకు ఓడిపోయారు? ఆయన పార్టీ ముఖాన కనీస డిపాజిట్లు ఎందుకు దక్కలేదు? అసలు ముందస్తు పరాభవం గ్రహించే ఆయన పోటీకి దూరంగా ఉన్నారా? ఏపీ లాంటి రాష్ట్రాల్లో కులాల కుంపట్లు రగిల్చి, గెలుపుగుర్రాలను తయారుచేసిన యోధులు తన రాష్ట్రంలో మాత్రం ఎందుకు కుదేలయిపోయారు? అన్ని పార్టీలను అధికార వెధవ్యం నుంచి తప్పించి, సుమంగళిని చేసే ఆయన గెలుపు మంత్రాలకు, బీహార్‌లో ఎందుకు ఓట్ల చింతకాయలు రాలేదు? అన్న ప్రశ్నలకు బిహానీ బాబు దగ్గర జవాబు లేదు. అంటే పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదన్న పెద్దలమాట నిజమే కదా?!* * * మరి అలాగైతే.. జగన్‌బాబును ఈ బిహారీ బాబు ఎలా గెలిపించారన్న డవుటనుమానం రావచ్చు. నిజమే.
చాలామంది సర్వే రాయుళ్లు పీకీ గురించి చెప్పేదేమంటే.. ఆయన గెలుపు గుర్రం వైపుంటారని! తన ద గ్గర పనిచేసే వారిని, అదే రాష్ట్రంలో తాను పనిచేసే పార్టీ ప్రత్యర్థి పార్టీ వద్దకు పంపిస్తుంటారని!! అంటే పోలీసులు నక్సల్స్ ఆపరేషన్‌లో కోవర్టులను ప్రయోగిస్తుంటారే.. అలాగన్నమాట!!! ‘‘అటు నేనే.. ఇటు నేనే.. చినచేపను పెదచేప.. చినమాయను పెనుమాయ.. అది స్వాహా.. ఇది స్వాహా’’ అని మాయాబజార్ సినిమాలో కృష్ణుడు చెప్పినట్లు.. మన పీకే కూడా, తన బిహారీ బ్యాచ్‌ను అన్ని పార్టీల్లో నింపేస్తారే తప్ప, ఆయనలో ‘విషయం’ లేదని.. కాకపోతే ఆయన బిల్డప్-మీడియా హైప్ చూసి, పార్టీలే పడిపోతాయన్నది సర్వేరాయుళ్ల ఉవాచ. నిజమే.. ఇప్పుడు బిహార్బాబు పార్టీ ఓటమి చూస్తుంటే అది నిజమే కామోసనిపిస్తుంది.
* * * సరే.. ఈ బిహార్ ఎన్నికల దెబ్బకు పీకేకు ఇక సర్వే ‘బిజినెసు యాపారం’ గిరాకీ ఎలాగూ తగ్గిపోతుంది లెండి. గతంలో ‘ఆరా’ సర్వే సంస్థకు మంచి పేరే ఉండేది. దాని సర్వే శాస్త్రీయంగా ఉంటుందన్న పేరుండేది. నిజానికి ఆ మేరకు ‘ఆరా’ నిక్కచ్చి సర్వేనే వెల్లడిస్తే, అవి నిజమైన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఆరా జోస్యం నిజమైంది. ఆ సంస్ధ సేవలకు మెచ్చిన కేసీఆర్ ఆరా యజమానిని సన్మానించారు కూడా. జగన్ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న సర్వేతోపాటు, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందంటూ ‘ఆరా’ సంస్థ చేసిన సర్వే ఫలితాలు నిజమయిన రోజులు లేకపోలేదు. కాకపోతే గత ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారంటూ చేసిన సర్వే దారుణంగా తప్పడంతో, ఆరా సంస్థ ప్రతిష్ఠ అంతే దారుణంగా దెబ్బతింది. ఫలితంగా క్లయింట్స్ కూడా తగ్గిపోయారు. సర్వే అంటే కోట్ల రూపాయలతో వ్యవహారం మరి. అయితే గుడ్డిలో మెల్లగా.. తాజా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఆరా సర్వే నిజమయింది. ఫలితంగా మళ్లీ తన ప్రతిష్ఠ నిలబెట్టుకునేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికయింది.
* * * ఇక మళ్లీ ‘పీకే’సారు జగన్‌బాబును గె లిపించిన కథలోకి వెళితే.. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు పీకల్లోతు కోపంలో ఉన్నారు. అంటే రెండు చేతులతో ఓట్లేసి, వేయించేంత కోపం అన్నమాట. దానికితోడు జగద్ సీపీఎస్ హామీ తోడయింది. నిరుద్యోగులు, వ్యాపారులు కూడా అసంతృప్తిగా ఉండేవారు. ఇక అప్పటికే కమ్మ వర్గంపై బీసీ-ఎస్సీలను ఎగదోయడంతో, అన్ని సామాజికవర్గాలు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి. ఇప్పటిమాదిరిగానే అప్పుడూ, ఎమ్మెల్యేలు దోచుకునే సింగిల్ పాయింట్ అజెండాతో ఉండేవారు. పోనీ కమ్మవర్గమైనా సంతృప్తిగా ఉందా అదీ లేదు. పోలింగు రోజున తమ ఓటు తాము వేసుకుని, ఇంట్లో కాళ్లుబారచాపుకొని పడుకునే పరిస్థితి. కలసి వెరసి టీడీపీ గెలిచే పరిస్థితి లేని రోజులవి. ఒక్కసారి జగన్‌కు ఒక చాన్స్ ఇద్దామని అన్ని వర్గాలు మానసికంగా సిద్ధమైన రోజులు. వీటిని వాడుకుని జగన్ దృష్టిలో, ఆపద్బాంధవుడి అవతారమెత్తారు ప్రశాంత్ కిశోర్. * * * ఈ ప్రజావ్యతిరేక వాతావరణం గ్రహించిన ‘పీకే’సారు, గెలుపు గుర్రమైన వైసీపీ మీద ఎక్కేశారు.
పోనీ ఆయనేమైనా మునుపటి మాదిరిగా శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేశారా అంటే అదీ లేదు. ఏయే ప్రాంతంలో కమ్మ-కాపు మధ్య కులాల అంతరం ఎంత ఉంది? ఎక్కడ ఎస్సీ, మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి? ఎక్కడ విధ్వంసం సృష్టిస్తే ఎన్ని ఓట్లు రాలతాయి? ఏ టీడీపీ నేతను వైసీపీలోకి తీసుకువస్తే లాభం ఉంటుంది? సోషల్‌మీడియాలో కమ్మ వర్గంపై విద్వేషం రగిలిస్తే మిగిలిన కులాలు ఏకమవుతాయి? అన్న ధ్వంసరచన తప్ప.. పీకే అప్పుడు పీకిందేమీలేదన్నది సర్వేరాయుళ్ల ఉవాచ.
పాతకేళ్ల క్రితం సర్వే సంస్థలు, ఎవరు గెలుస్తారన్న ఫలితాలు మాత్రమే ఇచ్చేవి. పీకే లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత, ఎలా గెలవాలన్న చిట్కాలు కూడా నేర్పించడం మొదలయిన మాయదారి కాలమిది!
* * * పీకే లాంటి వ్యక్తులు సర్వే సంస్థలు ప్రారంభించిన తర్వాత.. రాజకీయ పార్టీలు సంప్రదాయ రాజకీయాలు వదిలేసి, పీకే లాంటి మెదడు లేని సర్వే సంస్థల సలహాలు అమలుచేయడం ప్రారంభించడమే వింత. ప్రధానంగా ఈ సర్వే సంస్థలకు అస్త్రం సోషల్‌మీడియా. రాజకీయ ప్రత్యర్ధులపై వీలైనంత బురద చల్లటం, వ్యక్తిత్వ హననం చేయడం, దగుల్భాజీ ప్రచారాన్ని విస్తృతం చేయడం, తమ మెదడులో విషాన్ని పోస్టుల ద్వారా నింపి గాలిలో వదలడమే వీరి గొప్పతనం. ఆపాటి దానికి ఈ సర్వే సంస్థల సలహాలే అవసరం లేదు. గ్రామంలో ఒక సర్పంచ్‌ని అడిగినా చెబుతాడు! ఎందుకంటే వాళ్లు రోజూ చేసేది అలాంటి రాజీ యాలే కాబట్టి!! కానీ శంఖంలో పోస్తేనే గానీ తీర్ధం కాదన్నట్లు.. పీకే లాంటి వారి బిల్డప్పులకు పార్టీలు పడిపోవడమే కాదు. సాగిలపడుతున్నాయి. అభ్యర్ధుల ఎంపికనే వారి చేతికి అప్పగిస్తున్నాయి.
అసలు పరాయి రాష్ట్రంలో భాష, నైసర్గిక స్వరూపం, రాజకీయ పరిస్థితులు ఏమీ తెలియని సర్వే సంస్థలు, తమకు నిఖార్సైన నివేదికలు ఎలా ఇస్తాయన్న బుర్ర-బుద్ధి రాజకీయ పార్టీలకు లేకపోవడమే వింత. * * * సంప్రదాయ రాజకీయాలు విడిచిపెట్టి.. పీకే లాంటి వ్యక్తుల సలహాతో పుట్టిన సోషల్‌మీడియా ప్రచారం వల్ల, అదే పీకే పార్టీ పుట్టిమునిగిన చరిత్ర చూశాం. అదే బిహార్‌లో సునామీ సృష్టించిన ఎన్డీయే సోషల్‌మీడియా మీద ఆధారపడకుండా, సంప్రదాయ రాజకీయాలు నమ్ముకుని చరిత్ర సృష్టించింది. అందాకా ఎందుకు? మన తెలుగు రాష్ట్రాలనే ఉదాహరణగా తీసుకుందాం. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత హైదరాబాద్‌లోని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు.
పైగా బీఆర్ఎస్ సోషల్‌మీడియా అత్యంత శక్తివంతమైనదన్నది తెలిసిందే. కానీ ఆ రెండు సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నదంటే దానికి కారణం..కేవలం అది సంప్రదాయ రాజకీయాలు కొనసాగించడమే! తాజా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో.. బీఆర్ఎస్ సోషల్‌మీడియా ప్రచారం ముందు కాంగ్రెస్ వెలవెలబోయింది. మీడియా -సోషల్‌మీడియా ప్రచారం ద్వారా, బీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపు ఖాయమన్న మానసిక పరిస్థితి సృష్టించడంలో, బీఆర్ఎస్ సోషల్‌మీడియా విభాగం విజయవంతమయింది. కానీ సంప్రదాయ రాజకీయాలు నమ్ముకున్న కాంగ్రెస్, పక్కా వ్యూహంతో పోల్ మేనేజ్మెంట్ చేసి సక్సెస్ అయింది.
అసలు-నకిలీకి తేడా అదే మరి!
* * * ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్- ఏపీలో వైసీపీ సోషల్‌మీడియా అత్యంత బలంగా ఉన్న పార్టీలు. కేవలం దానిమీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నవే. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు, ఆ పార్టీ సోషల్‌మీడియా సైనికులు బ్రహ్మాండంగా పనిచేశారు. జగన్ మీద ఎవరికివారు స్వచ్ఛందంగా ఒంటికాలిపై లేచి, పోస్టింగులు సంధించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే టీడీపీ సోషల్‌మీడియా బలహీనమయింది. దానికి కారణమైన అంశాలను అన్వేషించకుండా, పార్టీ మేలు కోరి చెప్పే వారిపై ఎదురుదాడి చేయిస్తున్న పరిస్థితి. వారిని వైసీపీ వారుగా చిత్రీకరిస్తూ, తమ ఉనికి కాపాడుకుంటున్న పరిస్థితి నుంచి ఎంత త్వరగా బయటపెడితే, పార్టీకి అంత మంచిన్నది తమ్ముళ్ల సూచన. అసలు రాజకీయ పార్టీల సోషల్‌మీడియా విభాగాల్లో పనిచేసే వారిలో, జీతాల కోసం పనిచేసే వారే ఎక్కువగా ఉంటారు. పైగా అందులో పనిచేసే వారికి పార్టీ గత చరిత్ర, దానికి సేవలందించిన వ్యక్తుల గురించి కూడా అవగాహన ఉండదు.
సమాజాన్ని అర్ధం చేసుకునే వయసు కూడా ఉండదు. మిడిమిడి జ్ఞానస్తులే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వారి చేతికి సోషల్‌మీడియా అప్పగించడం వల్ల లాభం కంటే నష్టమే అధికం. ఇప్పుడు జరుగుతోంది అదే. ఇక బీఆర్ఎస్-వైసీపీ కోట్లాది రూపాయలు సోషల్‌మీడియాకు ఖర్చు పెడుతున్నాయి. కానీ ఫలితాలు మాత్రం వాటికి వ్యతిరేకంగా వస్తున్నాయి. కారణం ఆ రెండు పార్టీలు సంప్రదాయ రాజకీయాలు విడిచిపెట్టి, సోషల్‌మీడియాపై పూర్తిగా ఆధారపడటమే. అందుకే ఆత్మపరిశీలన అవసరం.
* * * సోషల్‌మీడియా అనేది నిజానిజాలు నిర్ధారించుకుని, దిద్దుబాటకు దిగే ఒక ఆత్మపరిశీలన వేదికగానే చూడాలి తప్ప, అదే తమను గెలిపిస్తుందన్న భ్రమల్లో ఉండటం అమాయకత్వం. ఏపీలో వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులిచ్చారంటూ సోషల్‌మీడియా సైనికులు ధ్వజమెత్తిన తర్వాత, వాటిని మార్చుకున్న సందర్భాలు బోలెడు. సోషల్‌మీడియాను అంతవరకే వినియోగించుకోవాలే తప్ప, అదే సర్వం కాదు. ఎప్పటికయినా పార్టీలను బతికించేది సంప్రదాయ రాజకీయమే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్-వైసీపీ సోషల్‌మీడియాకు వందల కోట్లు తగలేశాయి. కానీ ఫలితం ఏమైంది? కానీ ఇప్పటి కొత్త తరం అది గ్రహించకుండా, నియోజకవర్గానికో సోషల్‌మీడియా బృందాలు ఏర్పాటుచేసుకుంటున్న పరిస్థితి.
* * * తాజాగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పార్టీల ఉనికిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక. అయితే యనమల-ఆయన కుటుంబం-బంధుమిత్రులు పార్టీ వల్ల ఎంత లబ్థిపొందారన్న అంశం పక్కకుపెడితే.. రాజకీయ కోణంలో ఆయన చేసిన వ్యాఖ్య, వందకు రెండు వందల శాతం నిజం. అందుకు ఆయనను తప్పు పట్టాల్సిన పనేమీ లేదు. దానిపై దిద్దుబాటకు దిగడమే విజ్ఞుల లక్షణం. ‘‘ ప్రతిపక్షాన్ని తేలికగా తీసుకుంటే మనమే మునిగిపోతాం. నేను రోజూ సాక్షి పేపరు చదవుతా. టీవీ చూస్తా. ప్రతిపక్షంపై ఒక కన్నేసి ఉంచాలి. ప్రతిపక్షం బలం అనుకుంటేనే మనం పనిచేయగలుతాం. అందుకు భిన్నంగా ప్రతిపక్షం ఏముందులే అనుకుని అతి విశ్వాసానికి పోతే మునిగిపోతాం’’ అన్న యనమల వ్యాఖ్యలు అక్షర సత్యాలే. సోషల్‌మీడియాలో చేసుకునే సొంతభజన వల్ల ఓట్లు రాలవు. క్షేత్రస్థాయి వాస్తవాలు, పార్టీ బాగు కోసం చేసే సద్విమర్శలు జీర్ణించుకుని.. దిద్దుబాటకు దిగే పార్టీలే చిరకాలం నిలిచిపోతాయన్నది నిష్ఠుర నిజం.
* * * అసలు రాజకీయ పార్టీలు తమ పార్టీల భవిష్యత్తును, కోట్ల రూపాయలు కుమ్మరించి సర్వే సంస్థల చేతిలో పెట్టేబదులు.. ఇంట్లో కూర్చుని వీడియోలు చేసి, టీవీ చానెళ్లు-యూట్యూబ్‌లలో డిబేట్లు చేసి.. ఎన్నికల ముందు పుస్తకాలు రాసే జర్నలిస్టుల సలహాలు తీసుకునే బదులు.. ఒక గ్రామంలో పార్టీ జెండా మోస్తున్న కరుడు గట్టిన కార్యకర్తనో.. ప్రత్యర్థి పార్టీ చేతిలో ఆర్ధికంగా-రాజకీయంగా-శారీరకంగా గాయపడ్డ నాయకుడినో పిలిచి అడిగితే చాలు.లోపాలేమిటో తెలిసిపోతాయి. ఎందుకంటే వారంతా బాధితులు. ఈ సర్వే సంస్థలు, సలహాలిచ్చే జర్నలిస్టులు బాధితులు కాదు కాబట్టి!
* * * తాజా వార్త.. బిహార్‌లో అన్ని నియోజకవర్గాల్లో ధరావత్తు కోల్పోయి, విషాదంలో ఉన్న ఒకప్పటి తన సలహాదారు ప్రశాంత కిశోర్‌ను ఓదార్చేందుకు.. వైసీపీ అధినేత జగన్ బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నుంచి, పాట్నాకు ప్రత్యేక విమానంలో వెళుతున్నారట! జగన్ ఓదార్పు యాత్ర కవర్ చేసే క్రమంలో దాన్ని మీడియాలో ఎలా హైలెట్ చేయాలన్న అంశంపై జగన్ వ్యూహబృందం, పీకే బృందంతో ముందస్తు ముచ్చట్ల కోసం పాట్నా బయలుదేరిందట.