కొడుకు, ఇద్దరు మేనల్లుళ్లను బలితీసుకున్న శత్రువుపై కసి

- ఇజ్రాయెల్ పగ్గాలు చేపట్టబోతున్న గడి ఐజెన్కాట్
కనిపించని ఒక బలమైన సంకల్పం, శత్రువుపై పగ, వ్యక్తిగత విషాదాల నుంచి పుట్టుకొచ్చిన కసితో ఇజ్రాయెల్ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. ఇజ్రాయెల్ తదుపరి ప్రధానిగా మాజీ ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ‘యాషర్’ పార్టీ అధినేత గడి ఐజెన్కాట్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్)లోని 67 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకోవడంతో, సుదీర్ఘకాలం పాటు ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగిన బెంజమిన్ నెతన్యాహు అధికారం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.
అక్టోబర్ 27న జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత నెతన్యాహు కంటే ఐజెన్కాట్ వైపే మెజారిటీ సభ్యులు మొగ్గు చూపారు. దీంతో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ అధికారికంగా ఐజెన్కాట్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యతలను (మాండేట్) అప్పగించారు. కూటమిని ఏర్పాటు చేయడానికి ఆయనకు 28 రోజుల సమయం ఉంటుంది.
యుద్ధ క్షేత్రం నుండి దేశ నాయకత్వం వైపు..
గడి ఐజెన్కాట్ కెరీర్ మొత్తం మిలిటరీతోనే ముడిపడి ఉంది. ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆయన అందించిన సేవలు అమోఘం.
2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన మారణహోమం తర్వాత ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘వార్ క్యాబినెట్’లో కూడా ఆయన కీలక సభ్యుడిగా వ్యవహరించారు.
వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన ఐజెన్కాట్, ఇప్పుడు దేశాన్ని నడిపించే అత్యున్నత బాధ్యతను తీసుకోబోతున్నారు.
గుండె కోతను మిగిల్చిన గాజా యుద్ధం
దేశం కోసం ఐజెన్కాట్ కుటుంబం చేసిన త్యాగాలు సామాన్యమైనవి కావు. గాజా యుద్ధంలో ఆయన తన ముగ్గురు అత్యంత ఆప్తులను కోల్పోయి తీరని వ్యక్తిగత విషాదాన్ని అనుభవించారు.
కుమారుడి మరణం
2023 డిసెంబర్లో ఉత్తర గాజాలోని జబాలియా వద్ద హమాస్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే ఆపరేషన్‌లో ఐజెన్కాట్ 25 ఏళ్ల కుమారుడు గాల్ మెయిర్ ఐజెన్కాట్ మరణించాడు. గాల్ ఒక ఎలైట్ కమాండో యూనిట్లో రిజర్విస్ట్‌గా ఉంటూ, హమాస్ టన్నెల్ వద్ద అమర్చిన పేలుడు పరికరం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.
మొదటి మేనల్లుడి మరణం
కుమారుడు చనిపోయిన మరుసటి రోజే, దక్షిణ గాజాలో జరిగిన పోరులో గోలనీ బ్రిగేడ్‌కు చెందిన ఐజెన్కాట్ 19 ఏళ్ల మేనల్లుడు సార్జెంట్ మావోర్ కోహెన్ ఐజెన్కాట్ వీరమరణం పొందాడు.
రెండో మేనల్లుడి మరణం
దాదాపు ఏడాది తిరగకముందే, ఉత్తర గాజాలోనే జరిగిన మరో భీకర పోరులో ఆయన ఇంకొక మేనల్లుడు, 22 ఏళ్ల కెప్టెన్ యోగేవ్ పాజీ కూడా ప్రాణాలు విడిచాడు.
పగతో రగులుతున్న గుండె.. హమాస్ అంతమే లక్ష్యం
ఒకే శత్రువు (హమాస్) చేతిలో తన కుమారుడిని, ఇద్దరు మేనల్లుళ్లను కోల్పోయిన ఐజెన్కాట్ గుండె శత్రువుపై కసితో రగులుతోంది. ఈ వ్యక్తిగత నష్టం ఆయనను మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించింది. తన ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.గాజాలో హమాస్ పాలనను పూర్తిగా రూపుమాపేందుకు, దాని సైనిక విభాగాన్ని నిర్మూలించేందుకు ఒక స్పష్టమైన, కఠినమైన మార్గాన్ని అనుసరిస్తానని ఆయన ప్రజలకు మాట ఇచ్చారు.
“నేను అధికారం చేపట్టిన 18 నెలల్లోగా గాజాలో హమాస్ ఉనికి లేకుండా తుదముట్టిస్తా!”అంటూ ఆయన చేసిన శపథం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో సరికొత్త భరోసాను నింపింది.
అంతర్జాతీయ మద్దతు.. ఆసక్తి రేపుతున్న సౌదీ వైఖరి
ఇజ్రాయెల్‌లో రాబోతున్న ఈ మార్పును ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా, మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ ఉగ్రవాద ప్రాక్సీలను అణచివేయాలని చూస్తున్న సౌదీ అరేబియా సైతం ఐజెన్కాట్ వైఖరిని స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటు ఇరాన్‌ను, అటు ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్న హమాస్‌ను పూర్తిగా నిర్మూలించాలనే ఐజెన్కాట్ శపథం నెరవేరాలని సౌదీ కూడా కోరుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
సంకీర్ణ ప్రభుత్వం.. ఎంతకాలం నిలబడుతుంది?
అయితే ఇక్కడ మరో కీలకమైన రాజకీయ ప్రశ్న ఎదురవుతోంది.ఇప్పటివరకు బెంజమిన్ నేతన్యాహుకు మద్దతుగా నిలిచిన కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు కూటమి మారి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నాయనే పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అధికార సమీకరణాలు మారుతున్నప్పటికీ, కేవలం మెజారిటీ మద్దతు కూడగట్టుకోవడం మాత్రమే ప్రభుత్వ స్థిరత్వానికి హామీ ఇవ్వదు. కొత్త సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు, గాజా యుద్ధంపై భిన్నాభిప్రాయాలు, భద్రతా విధానాలు, ఇరాన్ విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలుగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వంలో భాగస్వాములైన పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకుంటే పరిస్థితి మళ్లీ రాజకీయ సంక్షోభానికి దారితీయవచ్చు.
నేతన్యాహును గద్దె దించడం ఒక ఎత్తయితే.. స్థిరమైన ప్రభుత్వాన్ని నడపడం మరో ఎత్తు!
గడి ఐజెన్కాట్ ముందున్న అసలైన సవాలు ఇదే. వ్యక్తిగత విషాదాన్ని పక్కనపెట్టి దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తారా? యుద్ధ విధానంలో మార్పులు తీసుకొస్తారా? లేక హమాస్‌పై మరింత కఠిన వైఖరిని కొనసాగిస్తారా? అసలు ఈ 28 రోజుల్లో కూటమిలో కి వచ్చే పార్టీ ల డిమాండ్ లు, వత్తిడి లు ఏ విధముగా పరిష్కరిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెపుతుంది.
ఇజ్రాయెల్‌లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం, ఆ తర్వాత రాజకీయ విభేదాలతో కూలిపోవడం కొత్తేమీ కాదు. 2020లో నేతన్యాహు – బెన్నీ గాంట్జ్ కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం బడ్జెట్ వివాదంతో సుమారు ఏడు నెలల్లోనే కూలిపోయింది.
ఆ తర్వాత 2021లో నఫ్తాలి బెన్నెట్ – యైర్ లాపిడ్ నేతృత్వంలో ఎనిమిది పార్టీలతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూడా పార్లమెంటులో మెజారిటీ కోల్పోయి ఏడాది తర్వాత రద్దు దిశగా వెళ్లింది. ఫలితంగా 2022లో మరోసారి ఎన్నికలు జరిగాయి.
ఈ గత అనుభవాలు ఇప్పుడు ఐజెన్కాట్ ముందున్న సవాళ్లను గుర్తుచేస్తున్నాయి. నేతన్యాహుకు మద్దతుగా ఉన్న పార్టీలు కూటమి మారి కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయంటే, అవి భవిష్యత్తులో కూడా ఐక్యంగా ఉంటాయనే హామీ లేదు.
హమాస్‌తో యుద్ధం ఒక సవాలైతే.. సంకీర్ణ భాగస్వాములను ఒక్కతాటిపై ఉంచడం మరో సవాలు!
గతంలో జరిగినట్లుగా మళ్లీ పార్టీలు మద్దతు ఉపసంహరించుకుంటే, ప్రభుత్వం కూలిపోయి ఇజ్రాయెల్ మరోసారి ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
ముఖ్యంగా, భిన్న రాజకీయ ప్రయోజనాలున్న పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎంతకాలం ఐక్యంగా నడపగలరన్నది ఇజ్రాయెల్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ప్రశ్న. అందుకే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం వుండదు, మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఏమో అనే సందేహం చాలా మందికి వుంది.
వ్యక్తిగత కడుపుకోతను దేశ రక్షణ కవచంగా మార్చుకుని, శత్రువుల గుండెల్లో నిద్రపోయేందుకు సిద్ధమవుతున్న గడి ఐజెన్కాట్ నాయకత్వంలో ఇజ్రాయెల్ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!
యుద్ధ అనుభవం. వ్యక్తిగత విషాదం. హమాస్‌పై కఠిన వైఖరి. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వ స్థిరత్వంపై సందేహాలు!
- ఉపద్రష్ట పార్ధసారధి
