– ఏపీలో వివాదమవుతున్న వాలంటీర్ల వ్యవస్థ
– కిడ్నాపులు, అత్యాచారాలు, దొంగతనం కేసులో వాలంటీర్లు
– ఇప్పటికే జైలుకు వెళ్లిన పలువురు వాలంటీర్లు
– మీడియా వార్తల ఆధారంగా టీడీపీ, జనసైనికుల విమర్శనాస్ర్తాలు
– వాలంటీర్ల పనితీరుపై ఆరోపణలు గుప్పించిన జనసేనాధిపతి పవన్
– మహిళలలను వాలంటీర్లు కిడ్నాపులు చేస్తున్నారని ఆరోపణ
– వారికి వైసీపీ నేతల దన్ను ఉందని ఫైర్
– వాలంటీరు వ్యవస్థపై ప్రధాని, కేంద్ర హోంశాఖమంత్రికి పవన్ ఫిర్యాదు
– దానితో పవన్‌పై కేసు పెట్టిన జగన్ సర్కారు
– ఎక్కడా ప్రభుత్వాన్ని విమర్శించని పవన్
– కేసు సరే.. వాలంటీర్ల చర్యలకూ సర్కారే బాధ్యత వహిస్తుందా?
– ఎన్డీఏ భేటీ తర్వాత పవన్‌పై కేసుకు అనుమతించిన జగన్ ప్రభుత్వం
– జైలుకెళ్లడానికైనా సిద్ధమనేనన్న పవన్ కల్యాణ్
– పవన్‌పై బెయిల్‌బుల్ కేసు పెట్టిన ప్రభుత్వం
– పవన్‌పై కేసును ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు
– వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా? ప్రైవేటు ఉద్యోగులా?
– ప్రభుత్వ ఉద్యోగులు కాదంటూ గతంలో కోర్టుకు చెప్పిన ప్రభుత్వం
– మరి ప్రైవేటు వ్యక్తులకు తమ సమాచారం ఎందుకివ్వాలంటున్న జనం
– వాలంటీర్ల జీతం ఏడాదికి 125 కోట్లు
– నెలకు 12 కోట్లు జీతాలకే చెల్లింపు
– ఇప్పటిదాకా వాలంటీర్లపై చేసిన ఖర్చు 5 వేల కోట్లపైమాటే
– వాలంటీర్లు ఎవరికి, ఏశాఖకు జవాబుదారీనో తెలియని పరిస్ధితి
– ఏ శాఖ నుంచి జీతాలిస్తున్నారంటూ విపక్షాల ప్రశ్నల వర్షం
– పవన్ ప్రశ్నలకు బదులివ్వని సర్కారు
– గీతం కాలేజీ ఐడి కార్డుతో పట్టుబడ్డ విశాఖ మహిళా వాలంటీరు
– సమాధానం చెప్పలేక వెళ్లిపోయిన మహిళా వాలంటీరు
– సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న విశాఖ వీడియో
– వాలంటీర్లపై కోర్టు అడిగే ప్రశ్నలకు జవాబేదీ?
( మార్తి సుబ్రహ్మణ్యం)
వాళ్లు 50 మంది కుటుంబాలకు బాధ్యులు. వారి మంచిచెడ్డలు చూసే బాధ్యత వారిదే. పించను కావాలన్నా, ఎమ్మార్వో ఆఫీసులో పనులు కావాలన్నా, ప్రభుత్వ పథకాలు రావాలన్నా వారే వారథులు. వారు చెబితేనే సర్వం సమకూరుతాయి. వారి ముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దిగదుడుపే. వారి సిఫార్సులను మాత్రమే అధికారులు అమలు చేస్తారు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. వారు అనధికార ప్రజాప్రతినిధులు. అంతకుమించి.. పలుకుబడి ఉన్న లోకల్ లీడర్లు! ఆంధ్రప్రదేశ్‌లో వారినే నెలకు ఐదువేల జీతం ఇచ్చి, వాలంటీర్లుగా పిలుస్తున్నారు.
ఏపీలో జగనన్న సర్కారుకు-వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వాలంటీర్లే ఆశ, శ్వాస. వారితోనే తాను అనుకున్న పనులు చేస్తున్నారు. మధ్యలో ఇక ఎమ్మెల్యేలు లేరు. కార్పొరేటర్లు-కౌన్సిలర్లు-సర్పంచులు లేరు. రేపటి ఎన్నికల్లో వారెవరితోనూ పనిలేదు. నేరుగా జగన్ .. లబ్దిదారుడు. అంతే! మధ్యలో వారిద్దరి మధ్య వారధి నిర్మించే వ్యవస్థనే వాలంటీర్లు.
వైసీపీ సర్కారుకు మూలస్తంభాలైన వాలంటీర్ వ్యవస్థపై.. జనసేనాధిపతి పవన్ కల్యాణ్ సంధించిన ఆరోపణాస్ర్తాలు, ప్రజల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఏపీ నుంచి భారీ సంఖ్యలో అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారని, వాలంటీర్లు ఒంటరి మహిళలు, అనాధలను లక్ష్యంగా చేసుకుని కిడ్నాపులు చేస్తున్నారని ఆరోపించారు. వారికి వైసీపీ నేతల సహకారం ఉందని ఆరోపణాస్ర్ర్తాలు సంధించారు.
పవన్ ఆరోపణలపై వాలంటీర్లు రోడ్డెక్కి ఆందోళన చేశారు. పవన్ దిష్టిబొమ్మ దగ్థం చేశారు. మంత్రులు వాలంటీర్లకు బాసటగా నిలిచారు. పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబుకు వాలంటీరుగా పనిచేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరో అడుగుముందుకేసి, పవన్‌పై మహిళా కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దానితో పదిరోజుల్లో పవన్ తన ఆరోపణలకు సాక్ష్యాలు సమర్పించాలని ఆదేశిస్తూ, సమన్లు జారీ చేశారు.
దీనితో ఆగ్రహించిన పవన్.. తన మాటలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనన్నారు. తాను కేవలం అమ్మాయిలను కిడ్నాపు చేసిన వాలంటీర్లను మాత్రమే అన్నానని స్పష్టం చేశారు. అసలు వాలంటీర్లు ఎవరికి జవాబుదారీ కలెక్టర్లకా? ఆర్డీఓలకా? లేక ముఖ్యమంత్రికా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాటికి వైసీపీ నుంచి గానీ, సర్కారు నుంచి ఇప్పటిదాకా సమాధానం లేదు.
వాలంటీర్ల వ్యవహారం కోర్టు గడప ఎక్కనున్న నేపథ్యంలో.. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. ఏపీలో మొత్తం వాలంటీర్ల సంఖ్య 2,54,039 మంది. గ్రామాల్లో 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో 70-100 ఇళ్లకు ఒక్కో వాలంటీరు చొప్పున సేవలందిస్తున్నారు. ఇందులో 1,52,422 మంది మహిళలున్నారు. అందులో బీసీలు 1,25,వ032 మంది; 68,622 మది ఎస్సీలు; 18,295 మంది ఎస్టీలు పనిచేస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.
ఆ ప్రకారంగా నెలకు 12 కోట్ల 7 లక్షల 1909 రూపాయలు వీరికి వేతనాల కింద చెల్లిస్తున్నారు. అంటే ఏడాదికి వీరి ఖర్చు 125 కోట్లు అవుతోంది. గత నాలుగేళ్లలో వాలంటీర్ల కోసం, ప్రభుత్వం చేసిన ఖర్చు 5 వేల కోట్లు మాటే. ఇదీ జగన్ సర్కారు వాలంటీర్లకు చెల్లిస్తున్న జీతాలు.
వాలంటీర్లకు ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, వారికి ఎవరిని జవాబుదారీని చేసిందన్నది ఇప్పటివరకూ తెలియని బ్రహ్మ రహస్యం. పవన్ కల్యాణ్‌పై కేసుకు నమోదుకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో, జవాబు లేని కొన్ని డజన్ల ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
అసలు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా? ప్రైవేటు ఉద్యోగులా అన్నది ప్రజల సందేహం. అయితే కోర్టు విచారణ సందర్భంలో, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు, వారికి ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు ఎందుకివ్వాలి? తమ డేటాను వారు ఏం చేస్తారు? అన్నది ఇప్పుడు ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు.
అసలు ఆ డేటాను వారు ఎవరికి పంపిస్తారు? ఇప్పటిదాకా ఎన్నిసార్లు డేటాను సేకరించారు? తీసుకున్న డేటాకు సంబంధిత వ్యక్తులు రశీదులేమైనా ఇస్తున్నారా? ఆ డేటాను నిర్వహించి, భద్రపరిచే సంస్థ ఏమైనా ఉందా? ఉంటే అది ప్రభుత్వానికి సంబంధించినదా? ప్రైవేటు సంస్థలకు చెందినదా? ఆ డేటా భద్రతకు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న రక్షణ చర్యలేమిటి?
వాలంటీర్లకు ఏ శాఖ నుంచి జీతాలిస్తున్నారు? ఆ మేరకు చెల్లింపు జరిగే శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారా? అసలు వాలంటీర్లకు ఏమైనా ప్రభుత్వం శిక్షణ ఇచ్చిందా? ఇస్తే ఏ శాఖ ఇచ్చింది? వాలంటీర్ల పనిగంటలు ఏమైనా నిర్దేశించారా? వారికి కార్మికచట్టాలు వర్తిస్తాయా? లేవా?
ఒకవేళ విధినిర్వహణలో వాలంటీరు మృతి చెందితే, వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఏమైనా ఇస్తుందా? కనీస వేతనాలను అమలుచేయించే ప్రభుత్వం , కేవలం నెలకు 5 వేల రూపాయలతో పనిచేయించడం నేరం కాదా? రోజుకు 150 రూపాయలు ఇవ్వడం కార్మికచట్టాలు ఉల్లంఘించినట్లే కదా?
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తప్పులు చేసే వాలంటీర్లపై విధించే శిక్షలేమిటి? వారికి ఏసీబీ నిబంధనలు వర్తిస్తాయా? లేవా? ఇప్పటివరకూ కేసులు నమోదై, జైళ్లకు వెళ్లిన వాలంటీర్ల సంఖ్య ఎంత? వారిని తొలగించారా? లేక కొనసాగిస్తున్నారా?
వాలంటీర్లు ఎవరికి రిపోర్టు చేయాలి? ఏ స్థాయి అధికారికి వాలంటీర్లపై అజమాయిషీ ఉంది? వారికి ఎవరు జవాబుదారీ? లబ్దిదారుల సొమ్ము వాలంటీర్లు దొంగిలిస్తే, ఆ డబ్బును లబ్దిదారులకు స్వాధీనం చేయించేదెవరు? అసలు లబ్దిదారులకు పంపిణీ చేయమని, వాలంటీర్ల చేతికి నగదు ఇచ్చే అధికారి ఎవరు? నగదు ఇచ్చే ముందు వాలంటీరు నుంచి హామీ పత్రం ఏమైనా తీసుకుంటున్నారా?
వాలంటీర్లకు గుర్తింపుకార్డులున్నాయా? అపాయింట్‌మెంట్ ఇచ్చారా? ఇస్తే దానిపై ఏ శాఖ అధికారి సంతకం చేశారు? ఉంటే ఏ శాఖ గుర్తింపు కార్డులు మంజూరు చేస్తోంది? ఇస్తే అందులో వారి కాలపరిమితి ఎంతన్నది నిర్ధారించారా? అసలు వాలంటీరు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు, ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను వారికి ఎందుకు అందించాలి? ఇస్తే దాని రక్షణకు ఎవరు హామీ ఇస్తారు?
ఇప్పటిదాకా ఎంతమంది వాలంటీర్లు మహిళలపై అత్యాచారాలు చేశారు? ఎంతమంది అత్యాచారయత్నాల్లో పట్టుపడ్డారు? ఎంతమంది హత్య, హత్యాయత్నం కేసుల్లో ఉన్నారు? ఎంతమంది వాలంటీర్లు దొంగ మద్యం అమ్ముతూ, సరఫరా చేస్తూ పట్టుపడ్డారు? ఎంతమంది లబ్ధిదారుల సొమ్ము తీసుకుని పారిపోయారు? ఎంతమంది వాలంటీర్లు ఒంటరి మహిళలు-అనాధలపై అత్యాచారం చేశారు? ఇలాంటి ప్రశ్నలు ప్రభుత్వ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి.
వాలంటీర్లపై ఆరోపణలు సంధిస్తున్న.. జనసేనాధిపతి పవన్‌పై కేసుపెట్టిన ప్రభుత్వం.. కోర్టులో జడ్జి, లేదా పవన్ న్యాయవాది అడిగే ప్రశ్నలకు, ఎలాంటి జవాబులిస్తుందోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది. నిజానికి పవన్‌పై పెట్టిన కేసు బెయిలబుల్. ఈ కేసు నిలిచేది కానప్పటికీ, వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం కోర్టులో ఎలాంటి వివరాలిస్తుందన్నదే ప్రశ్న.
కానీ.. వాలంటీర్లు మహిళలపై చేసిన అత్యాచారాలు, అత్యాచార యత్నాలు, దొంగతనాలకు సంబంధించి.. మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగులను, పిటిషనర్ జడ్జికి సమర్పిస్తే .. అప్పుడు ప్రభుత్వ పరిస్థితి ఏమిటన్న అంశం ఆసక్తికరంగా మారింది.
తాజాగా విశాఖలో వాలంటీరుకు సంబంధించి చోటుచేసుకున్న ఓ ఘటన, వాలంటీర్ల వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అనుమానాలు మరించ పెంచేలా చేసింది. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
విశాఖలో ఒక మహిళా వాలంటీరుకు, తన ఆధార్ కార్డు ఎందుకివ్వాలని ఓ వ్యక్తి ప్రశ్నించారు. ముందు మీ ఐడి కార్డు- అపాయింట్‌మెంట్ ఆర్డర్ చూపాలని కోరగా, ఆమె తన వద్ద ఉన్న గీతం కాలేజీ ఐడికార్డు చూపింది. మీరు గవర్నమెంటు ఉద్యోగా? అని ప్రశ్నించగా, కాదని సమాధానం చెప్పింది.
మరి ప్రైవేటు వ్యక్తులకు మేం ఎందుకు వివరాలివ్వాలి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో, సదరు మహిళా వాలంటీరు వెళ్లిపోతున్న వీడియో, ఇప్పుడు సోషల్‌మీడియా హల్‌చల్ చేస్తోంది.