Suryaa.co.in

Andhra Pradesh

ఖాకీలపై ఈసీ చర్యల కొరడా

– పోలింగ్ అనంతర హింస అణచివేతలో వైఫల్యంపై ఈసీ ఆగ్రహం
– పల్నాడు, అనంతపురం ఎస్పీలు సస్పెండ్
– తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు
– పల్నాడు కలెక్టర్‌పై శాఖాపరమైన విచారణ
12 మంది పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు
– సిట్ ఏర్పాటు
కౌంటింగ్ ముగిసిన 15 రోజుల తర్వాత వరకూ 25 సీఆర్పీఎఫ్ బలగాలు
– కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు
– నేడో రేపో సీఎస్‌పై బదిలీ వేటు?

అమరావతి: పోలింగ్ అనంతర హింసాత్మక ఘటనలపై ప్రేక్షకపాత్ర వహించి.. అధికార పార్టీకి కొమ్ముకాసిన ఐఏఎస్-పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం, చర్యల కొరడా ఝళిపించింది. కాగా అంతకుముందు, సీఎస్-డీజీపీని ఢిల్లీకి పిలిపించిన కేంద్ర ఎన్నికల సంఘం తలంటినట్లు సమాచారం. విధి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని, మీ పర్యవేక్షణ లోపం- నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో హింస చెలరేగినట్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్‌ ముందు రోజు అర్ధరాత్రి నుంచి మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో వరుసగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది.

పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. సదరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ 12 మంది అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కూడా నియమించింది. హింసాత్మక ఘటనలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ అప్‌‌డేట్ చేయాలని స్పష్టం చేసింది.

పల్నాడు జిల్లా కలెక్టర్‌పై కూడా బదిలీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. పల్నాడు కలెక్టర్‌పై శాఖాపరమైన విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది.

నేడే రేపో సీఎస్‌పై వేటుపడే అవకాశం కనిపిస్తోంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా.. కౌంటింగ్ ముగిసిన 15 రోజుల దాకా 25 సీఆర్‌పీఎఫ్ బలగాల్ని ఏపీ పంపించాలని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి హింస చోటుచేసుకోకుండా ఈ బలగాలను ఉపయోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

ఈసీ తీసుకున్న ఈ సీరియస్ నిర్ణయాలు, జగన్‌కు కొమ్ముకాసిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. పోలింగ్ అనంతర హింసపై దృష్టి పెట్టకుండా, నిర్లక్ష్యం వహించిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. ఈసీ చర్యలు తీసుకున్న వారిలో వైసీపీకి కొమ్ముకాసిన, ఒక సామాజికవర్గానికి చెందిన వారే ఉండటం గమనార్హం.

నిజానికి ఈ వర్గానికి చెందిన పోలీసు అధికారులపై.. ఎప్పటినుంచో ఫిర్యాదులున్నప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పెద్దగా స్పందించలేదు. దానితో నేరుగా కేంద్ర ఎన్నికల సంఘమే రంగంలోకి దిగి, చర్యల కొసడా ఝళిపించాల్సి వచ్చింది.

కాగా ఈసీ ఆగ్రహం పరిశీలిస్తే.. నేడో రేపో సీఎస్ జవహర్‌రెడ్డిపైనా, వేటు వేసేలా కనిపిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ అనంతరం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేయకుండా, నిర్లక్ష్యం వహించినందుకు సీఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

వేటు పడింది వీరిపైనే..
తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి
ఎస్బిసిఐ రాజశేఖర్
ఎస్వీడీఎస్పీ భాస్కర్ రెడ్డి
అలిపిరి సీఐ రామచంద్ర రెడ్డి
నరసరావుపేట డిఎస్పి బిఎస్ఎన్ వర్మ
గురజాల డిఎస్పి పల్లపురాజు
ఎస్బిసిఐ ప్రభాకర్ రావు
మరో ఎస్ బి సి ఐ బాలనాగిరెడ్డి
కారంపూడి ఎస్సై రామాంజనేయులు
నాగార్జునసాగర్ ఎస్ఐ కొండారెడ్డి
తాడిపత్రి డిఎస్పి గంగయ్య
తాడిపత్రి సీఐ మురళీకృష్ణ

వీరిపై వేటు వేస్తూ శాఖా పరమైన విచారణ ఆలోచించిన కేంద్ర ఎన్నికల సంఘం, సిట్ కమిటీ వేసి దర్యాప్తు నిర్వహించి.. ఎటువంటి చర్యలు తీసుకున్నారు? రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A RESPONSE