ఇటీవల కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. చాలా మంది ఆకస్మాత్తుగా హార్ట్ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ మహిళ విమానం ఎక్కుతుండగా.. గుండెపోటుకు గురైంది. ఆసుపత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే..నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చిన్ననారాయణపురం సర్పంచ్ కె.నర్సింహా భార్య ఇందిరాబాయి(48) డ్వాక్రా ఉద్యోగిని.ఆమె స్థానికంగా సీఆర్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో పంజాబ్‌లో సీఆర్పీలకు నెలరోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సదస్సుకు తెలంగాణవ్యాప్తంగా 400 మంది ఎంపిక కాగా.. అందులో ఇందిరాబాయి కూడా ఉన్నారు. అక్కడ అవగాహన సదస్సులు ముగించుకుని శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం సాయంత్రం ఛండీగఢ్‌లో విమానం ఎక్కుతుండగా.. ఆమె ఆకస్మికంగా హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. వెంటనే అక్కడి స్థానిక ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ అక్కడే చనిపోయింది.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన దత్తాత్రేయ ఇందిరాబాయి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఆదివారం రాత్రి ఇందిరాబాయి మృతేదేహం స్వగ్రామానికి చేరుకుంది. సోమవారం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మృతురాలి బంధువులు తెలిపారు..