– కర్నాటకలో కమల విలాపానికి కారణమయిన 40 శాతం కమిషన్ స్లోగన్
– ఇప్పుడు ఆంధ్రాలోనూ అలాంటి నినాదమే తెరపైకి తెచ్చిన ఎంపి రఘురామరాజు
– సీఎంఓ నుంచి ప్రతి శాఖలోనూ 50 శాతం కమిషన్లంటూ ఎంపి రాజు కొత్త స్లోగన్
– బిల్లుల చెల్లింపులకు 50 శాతం మిషన్లంటూ ఎంపీ రాజు ఆరోపణ
– సోషల్ మీడియాలో పేలుతున్న రఘురామ రాజు న్యూ స్లో‘గన్’
– రఘురామరాజు నినాదాన్ని అందుకున్న టీడీపీ సోషల్ మీడియా సైనికులు
– కమిషన్ల ప్రచారంలో ఆంధ్రా.. మరో కర్నాటక అవుతుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కొద్ది సంవత్సరాల క్రితం కర్నాటకలో బీజేపీకి చెందిన ఓ కాంట్రాక్టరు చేసిన పనులకు సంబంధించి బిల్లులివ్వాలని ఓ మంత్రిని కోరాడు. కానీ ఆయన సదరు కాంట్రాక్టరు తన పార్టీ వాడన్న సానుభూతి కూడా చూపకుండా, 40 శాతం కమిషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్ చేస్తానన్నాడు. దానితో ఖంగుతిన్న సదరు బీజేపీ కాంట్రాక్టరు విషయాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా నుంచి నద్దా వరకూ చేరవేశాడు. బిల్లులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు జీతాలివ్వడం కష్టమవుతోందని, వడ్డీలు పాపంలా పెరిగిపోతోందంటూ ఆవేదన చెందాడు. అయినా ఫలితం లేదు.
చివరాఖరకు కర్నాటక కాంట్రాక్టర్స్ అసోసియేన్ కూడా రంగంలోకి దిగింది. తమ రాష్ట్రంలో సాగుతున్న ‘కమిషన్ రాజ్’పై స్వయంగా ప్రధానికి ఫిర్యాదు చేసింది. అయినా ఎక్కడా స్పందన లేదు. అయినా నిరాశ చెందని సదరు కాంట్రాక్టర్ అన్ని ప్రయత్నాలూ చేశాడు. నో యూజ్. దానితో విరక్తి చెందిన ఆ బీజేపీ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
దాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్.. ‘‘బీజేపీ 40 శాతం కమిషన్ల సర్కార్’’ అంటూ ముద్ర వేసింది. అది తాజా ఎన్నికల ఫలితాల వరకూప్రజలపై పనిచేసింది. బీజేపీపై ఆ ముద్ర వేసిన వ్యూహకర్త పేరు సునీల్ కనుగోలు.
ఇప్పుడు సీన్ కట్ చేస్తే అచ్చం ఆంధ్రాలోనూ.. అలాంటి ప్రచారానికే సోషల్‌మీడియాలో తెరలేచింది. ‘‘జగన్‌ది ఆదా పర్సెంట్ సర్కార్’’ అంటూ కొత్త ప్రచారానికి తెరలేచింది. వైసీపీపై ఈ ముద్ర వేసిన ఆయన సునీల్ మాదిరిగా వ్యూహకర్త కాదు. ఓ ఎంపి. అది కూడా వైసీపీ రెబెల్ ఎంపీ. పేరు రఘురామకృష్ణంరాజు. దాన్ని ప్రతిపక్ష టీడీపీ సోషల్‌మీడియా సైనికులు అందిపుచ్చుకుని, జనక్షేత్రంలోకి తీసుకువెళ్లే పనిలో ఉన్నారు.
కర్నాటకలో క్లిక్కయిన అవినీతి ‘కమిషన్ రాజ్’ ఫార్ములా ప్రచారం.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది. బీజేపీ పతనానికి కారణమయిన ‘40 శాతం కమిషన్ సర్కారు’ ప్రచారం.. సరిహద్దు దాటి.. చెక్‌పోస్టులు అధిగమించి, ఆంధ్రాలోకి పాకింది. సొంత పార్టీని- జగనన్న సర్కారును ప్రతిరోజూ, ఢిల్లీ వేదికగా రచ్చబండలో ప్రతిరోజూ చాకిరేవు పెడుతున్న… నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు ప్రారంభించిన ఈ సరికొత్త స్లో‘గన్’.. ఇప్పుడు సోషల్‌మీడియాలో పేలుతోంది.
‘‘కర్నాటకలో 40 శాతం కమిషన్ అని ప్రచారం జరిగింది. అది క్షేత్రస్థాయి వరకూ వెళ్లింది. అది నిజమో-అబద్ధమో తెలియదు. కానీ ఏ పీలో మా ప్రభుత్వంలో 50 శాతం కమిషన్ ఇస్తే గానీ పనులు జరగడం లేదన్న ప్రచారం ఉంది. అందుకే మా పార్టీ ప్రభుత్వాన్ని కూడా 50 శాతం కమిషన్ సర్కారు అంటారేమో. అది ఎన్నికల్లో మా పార్టీని కూల్చివేస్తుందేమోనన్న భయం నాకుంది’’ అని ఎంపి రాజు చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు సోషల్‌మీడియాలో కాళ్లు కడుక్కుని, చెప్పులేసుకుని తిరుగుతున్నాయి.
‘‘ సీఎంఓ నుంచి దాదాపు అన్ని శాఖల్లోనూ 50 శాతం కమిషన్లు అడుగుతున్నారని మా పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ 50 శాతం కమిషన్ రాజ్ ప్రచారం ప్రజల్లోకి వెళితే, మా పార్టీ పరిస్థితి కూడా కర్నాటకలో మాదిరి అవుతుందన్నదే వైసీపీ సైనికుడిగా నా ఆవేదన’ అన్న రాజు వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా, కమిషన్లు ఇచ్చిన బడా కంపెనీలకు మాత్రం బిల్లులు క్లియర్ చేస్తున్నారన్నది ఎంపి రాజు ఆరోపణ.
జగన్‌కు నచ్చిన, సీఎం అధికారులు మెచ్చిన కాంట్రాక్టర్లకే 50 శాతం కమిషన్లు తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నారని, కాంట్రాక్టర్లే చెబుతున్న పరిస్థితి ఏర్పందని ఎంపి రాజు చేసిన ఆరోపణ, ఇప్పుడు కర్నాటక తరహా చర్చ జరిగేందుకు కారణమవుతోంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మార్ల నుంచి స్కూళ్లలో నిర్మించిన టాయిలెట్ల వరకూ సగం శాతం కమిషన్ల కోసమేనంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఎంపి రాజు ఉటంకిస్తున్నారు.
ఎంపి రఘురామకృష్ణంరాజు తెరలేపిన ఈ ‘ఆదా పర్సెంట్ కమిషన్ రాజ్’ ప్రచారాన్ని, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అందుకుంది. ఏ శాఖలో కూడా 50 శాతం కమిషన్లు ఇవ్వనిదే పనిజరగడం లేదని, చివరకు సొంత పార్టీ వారిని కూడా మినహాయించడం లేదన్నది, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు ప్రారంభించిన.. సరికొత్త తరహా కమిషన్ రాజ్ ప్రచారాస్త్రం! మేఘా వంటి బడా కంపెనీలు, సాక్షి వంటి సొంత పత్రికలకు బిల్లులు చెల్లిస్తున్న జగన్ సర్కారు.. మిగిలిన కాంట్రాక్టర్లకు, వేలాది కోట్ల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని, అటు సీనియర్ నేత వర్ల రామయ్య సంధిస్తున్న ప్రశ్నను, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు వైరల్ చేస్తున్నారు.
దీనితో.. కర్నాటకలో మాదిరిగా ‘కమిషన్ రాజ్’ ప్రచారం ఆంధ్రాలో కూడా క్షేత్రస్థాయికి చేరితే, అధికార పార్టీకి కష్టమేనన్న ఆందోళన వైసీపీలో నెలకొంది. దీనికి తెరదించాలంటే, కాంట్రాక్టర్లందరికీ తక్షణం బిల్లులు చెల్లించడమే ఏకైక పరిష్కారమన్నది వైసీపీ సీనియర్ల వాదన. కానీ అన్ని వేల కోట్లు చెల్లించే స్ధోమత, ఖజానాకు లేదన్నది మరికొందరి వాదన. జీతాలే సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో, వేలాది కోట్ల బకాయిలు కాంట్రాక్టర్లకు ఎలా చెల్లిస్తారని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
నిజానికి చాలా నియోజకవర్గాల్లో.. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా, బిల్లులకు డబ్బులు అడుగుతున్నారన్న విమర్శ చాలాకాలం నుంచి వైసీపీలో లేకపోలేదు. అయితే దానిని అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కర్నాటకలో బీజేపీపై 40 శాతం కమిషన్ ప్రభుత్వం అన్న ఆరోపణలు ఆ పార్టీనే కూల్చివేసింది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో కూడా ప్రభుత్వంపై మొదలైన ఆదా పర్సెంట్ కమిషన్ రాజ్ ఆరోపణలు జనక్షేత్రంలో చర్చ జరిగితే పార్టీ పుట్టిమునగడ ఖాయమన్నది వైసీపీ కార్యకర్తల ఆందోళన.