Home » ఆడు.. మగాడ్రా బుజ్జీ!

ఆడు.. మగాడ్రా బుజ్జీ!

– టీడీపీ ఎన్డీఏలో ఉన్నా కొనసాగుతున్న జగన్ బంధం
– రేపు రాజ్యసభలోనూ ఎన్డీయేతోనే ప్రేమాభిషేకం
– జగన్‌కు కేంద్రరక్షణ కవచం లభించినట్లే
– స్పీకర్ ఎన్నికతో బయటపడ్డ ‘దత్తపుత్ర’ అనురాగం
– ఐదేళ్లుగా ఒక్కసారీ కోర్టుకు హాజరుకాని రికార్డు
– ఈ మద్దతుతో ఇక జగన్ సేఫ్ పాలిటిక్స్
– రాష్ట్రంలోనూ సీఎంఓ సహా జగన్‌భక్త అధికారులకు పోస్టింగులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ నేను నీకు తాళి కట్టాను. నిజమే. తనతో సంసారం చేయడం అనివార్యం. అది నా ధర్మం. నీ కంటే ముందే నా జీవితంలోకి వచ్చిన ఆమెకు అన్యాయం చేయలేను. నువ్వే విశాల హృదయంతో ఆలోచించి ఓ నిర్ణయానికి వస్తే మంచిది’’ అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్‌లో అక్కినేని తన భార్యనుద్దేశించి వాడిన డైలాగిది.

బీజేపీ-వైసీపీ రాజకీయ బంధం కూడా సేమ్ టు సేమ్ అలాగే కొనసాగుతోంది. బీజేపీ కూడా.. ‘‘నువ్వు నాకు తలాక్ చెప్పిన తర్వాత ఆదుకున్న వాడు జగన్. నువ్వు ఇప్పుడు మళ్లీ వచ్చాడు. కానీ జగన్ అప్పటినుంచీ నన్నే నమ్మి బంధం కొనసాగిస్తున్నాడు. కాబట్టి అధికారంలో ఉన్న నువ్వు కావాలి. అలాగే సీట్ల బలం ఉన్న జగనూ కావాలి. మీ రాష్ట్రంలో మీరిద్దరూ నాకు రెండు కళ్లు. అధికారంలో ఎవరున్నా మీ సీట్లన్నీ నావే. కాబట్టి జగన్ నాపై వలపు బాణం విసిరినా నువ్వేమీ రోషానికి గురికావద్దు. ఒకసారి నా పరిస్థితి కూడా ఆలోచించు’’ అన్నట్లుగానే ఉంది.

అప్పట్లో జగన్‌ను దత్తపుత్రుడిగా అభివర్ణించిన కమలనాధులు.. తన ఎన్డీయే మిత్రుడి చేతిలో ఓడినప్పటికీ, ఆ దత్త ప్రేమను ఇంకా కొనసాగించడమే ఆశ్చర్యం. అందుకు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బంధమే నిలువెత్తు నిదర్శనం. బహుశా టీడీపీ మౌనం కూడా అంగీకారంగానే భావించినట్లుంది.

బీజేపీ నోరు తెరిచి మద్దతు కోరడమే ఆలస్యం. వెంటనే మద్దతు ప్రకటించి, తన ‘దత్తప్రేమ’ నిరూపించుకున్న జగన్ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేం. ఒకవైపు రాష్ట్రంలో ఘోరంగా ఓడినా.. రాజ్యసభలో తనకున్న సంఖ్యాబలంతో చక్రం తిప్పుతూ, కోర్టుకు హాజరుకాకుండా, భవిష్యత్తులో మరిన్ని కేసులు మెడకు చుట్టుకోకుండా.. మరో ఐదేళ్లు సేఫ్ పొలిటికల్ గేమ్ కోసం, కేంద్రరక్షణ కవచంలోకి వెళ్లిన జగన్‌ను.. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనడంలో తప్పేమీలేదు.

అంతేనా? గత ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలంతా వైసీపీకి ఓటువేసి గెలిపించారని సగర్వంగా ప్రకటించిన తన విధేయుడిని కేంద్రమంత్రిని చేశారు. తనను రచ్చబండతో రోజూ దుంపతెంచిన రఘురామకృష్ణంరాజుకు బీజేపీ టికెట్ లేకుండా చేశారు. సరే.. ఇవన్నీ జగనన్న సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాలనుకోండి. దానికి కారణం దత్తప్రేమ అన్నది మనం మనుషులం అన్నంత నిజం.

కానీ తాను గద్దె దిగినప్పటికీ.. తన ‘అధికార భక్త గణాని’కి పోస్టింగులు ఇప్పించుకోవడంలో, జగన్ తన నెట్‌వర్క్ ఏమిటన్నది చెప్పేశారు. మునుపటి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఏడిపించి, చివరకు ఆయనను తన చాంబరులోనే బైఠాయించేలా చేసిన గోపాలకృష్ణ ద్వివేదీకి, అదే బాబు కొలువులో ఠక్కున పోస్టింగు ఇప్పించుకున్న ఘనత జగన్‌బాబుది. సరే..దానిపై టీడీపీ సోషల్‌మీడియా సైనికులు అంతెత్తున ఎగిరి, బాబును అవమానించిన ద్వివేదికి పోస్టింగ్ ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారంటూ గత్తర చేయడం.. దానితో వెంటనే నాలిక్కరుచుకుని, ద్వివేదీని జీఏడీలో రిపోర్టు చేయమనడం చకచకా జరిగింది. నియమించడం ఎందుకు? తొలగించడం ఎందుకు? అసలు బాబును అవమానించిన ద్వివేదీకి, ఆయనకు చెప్పకుండా పోస్టింగు వేసింది ఎవరన్నది ఇక్కడ ప్రశ్న.

అంతేనా.. తన పార్టీ లీగల్‌సెల్‌ను జాగ్రత్తగా చూసుకున్న మహిళానేత భర్తను, ఏకంగా సీఎంఓలో చేర్చడంలో జగన్ తెలివి అమోఘం. ఇక మూడు రాజధానుల కేసులో సంతకం చేసి.. దొంగ ఓటర్లపై టీడీపీ-జనసేన ఇచ్చిన ఫిర్యాదుకు కేవలం పావుగంట మాత్రమే కేటాయించడమే కాకుండా.. తన ఆదేశాలు పాటించి కోర్టు ధిక్కార నేరానికి పాల్పడి, సామాజిక సేవ శిక్షకు గురైన అధికారికి, రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయానికి ఈఓగా ఇప్పించుకోవడంలో జగన్ తెలివి అమోఘం.

వైకాపా జమానాలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి ఆదేశాలు పాటించే అధికారికి గోదావరి జిల్లాలో ఒక జిల్లాకు కలెక్టర్‌గా.. సీఎంఓలో హవా సాగించిన ధనుంజయరెడ్డి ఆదేశాలు పాటించిన మరో అధికారికి రాయలసీమలో ఒక కీలక జిల్లాకు కలెక్టర్‌గా.. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్ధుల అరాచకాలు అడ్డుకున్న యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను, నానా యాతనకు గురిచేసిన అధికారికి కీలకమైన జిల్లాకు కలెక్టర్‌గా పోస్టింగు ఇప్పించుకున్న జగన్‌ను మెచ్చుకోకుండా ఎలా ఉండగలం?

అంతేనా.. ఇప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారి ద్వారా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ట్రాన్స్ కో జెన్కో డైరక్టర్లుగా నియమించిన వీరభద్రారెడ్డి, ఏకేవీ భాస్కర్, ఎంవీవీ సత్యనారాయణ, రఫీ, శివప్రసాద్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జయభారత్‌రావు, శ్రీనివాసమూర్తి, ప్రతాప్‌వంటి వారిని ఇంకా కొనసాగించడంలో ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ద్వారా జగన్ చక్రం తిప్పడాన్ని అభినందించకుండా ఎలా ఉంటాం? అందుకే.. ఆడు మగాడ్రా బుజ్జీ!

Leave a Reply