– అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపిన నేత
– కీలక పదవిని అప్పగించిన ప్రభుత్వం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్‌గా ఆరె శివారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడుగా, జేఏసీ కన్వీనర్‌గా రాజధాని ఉద్యమాన్ని ముందుండి నడిపించిన శివారెడ్డికి కూటమి ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తూ ప్రతిష్టాత్మక పదవిలో నియమించింది. గత ప్రభుత్వంలో ఎన్నో అడ్డంకులు, ఒత్తిళ్లు ఎదురైనా శివారెడ్డి ఎక్కడా వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పలు పోరాటాలు జరపడంతోపాటు న్యాయస్థానంలోనూ అలుపెరగని పోరాటం చేసి ఎట్టకేలకు అమరావతిని నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
విద్య, ఉద్యోగ ప్రస్థానం
1964 ఆగస్టు 3న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జన్మించిన ఆరె శివారెడ్డి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. 1982–86 మధ్యకాలంలో సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ పట్టా సాధించారు. అనంతరం 1986 నుంచి 1990 వరకు హైదరాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్, బీడీఎల్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఇంజనీర్‌గా, కన్సల్టెంట్‌గా పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు.
1990లో విజయవాడకు తిరిగొచ్చి, మహేశ్వరి బిల్డర్స్, ఎస్ఎస్ డెవలపర్స్, ఆరె బ్రదర్స్ వంటి సంస్థలను స్థాపించి, గత ముప్పై ఏళ్లలో 25 నివాస ప్రాజెక్టులు, 5 వాణిజ్య ప్రాజెక్టులు, 2 లేఅవుట్ ప్రాజెక్టులను పూర్తి చేశారు.
రియల్ ఎస్టేట్ రంగంలో సేవలు
ఆరె శివారెడ్డి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో జాయింట్ సెక్రటరీగా సేవలందించారు. తరువాత విజయవాడ అధ్యక్షుడిగా, ఆపై క్రెడాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా, చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలో భారీ స్థాయిలో ప్రాపర్టీ షోలు, అంతర్జాతీయ సదస్సులు, ట్రేడ్ ఫెయిర్లు నిర్వహించి రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రొఫెషనలిజం పెంపొందించారు.
జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
నాట్కాన్ (NATCON) చైర్మన్‌గా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు 1,200 మంది రియల్ ఎస్టేట్ నిపుణులను నడిపించారు. 2014–2019లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియామకంతో ఏపీ–టిడ్క సభ్యుడుగా పనిచేశారు. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. 70కి పైగా దేశాలు సందర్శించి అంతర్జాతీయస్థాయిలో అనుభవం సంపాదించారు.
సామాజిక సేవలు
శివారెడ్డి సామాజిక సేవల్లోనూ ముందున్నారు. లయన్స్ క్లబ్, మాసోనిక్ లాడ్జ్‌లలో పలు పదవులు చేపట్టి సమాజ సేవకు అంకితమయ్యారు. నిర్మాణ కార్మికుల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. విపత్తుల సమయంలో ఆహారం, అవసరమైన వస్తువులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో శౌచాలయాల మెరుగుదలకు కృషి చేశారు.
అమరావతి ఉద్యమంలో కీలకపాత్ర
2019లో అప్పటి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు ఆరె శివారెడ్డి ముందుండి పోరాటం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్‌గా మహా పాదయాత్ర చేపట్టారు. అలాగే, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర, అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రలు చేపట్టారు. పలువురు మాజీ న్యాయమూర్తులు, మేధావులు, రాజకీయ నాయకులతో చర్చలు జరిపారు. ప్రత్యేక రైలు బుక్ చేసి 2,500 మంది రైతులను ఢిల్లీ జంతర్ మంతర్ తీసుకెళ్లి, అక్కడ ఆందోళన నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర మీడియా వేదికలపై రాజధాని పరిరక్షణ కోసం నిరంతరం వాదనలు వినిపించారు.
సుస్థిర సమగ్రాభివృద్ధే లక్ష్యం
ఇంజనీర్‌గా, డెవలపర్‌గా, క్రెడాయి నాయకుడిగా, అమరావతి ఉద్యమకారుడిగా, సామాజిక సేవకుడిగా ఆరె శివారెడ్డి చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రెరా చైర్మన్‌గా నియమించింది. ఆయన నాయకత్వంలో రాష్ట్ర రెరా మరింత పారదర్శకత, బాధ్యతతో పనిచేస్తుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో రెరా చైర్మన్‌గా తనను నియమించడంపై శివారెడ్డి స్పందించారు.
భవిష్యత్తులో సుస్థిరమైన, సమగ్ర అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేపట్టడం తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానత్వం మధ్య సమతుల్యత కలిగిన అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రెరా చైర్మన్‌గా సంస్కరణలు తీసుకొస్తానని ఆరె శివారెడ్డి తెలిపారు.