– ది ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి నిజాముద్దీన్
విజయవాడ: వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వక్ఫ్ సంస్థల అసలు ఉద్దేశ్యం, వక్ఫ్ చట్టాలను పక్కన పెట్టి, వ్యక్తిగత పేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వక్ఫ్ బోర్డు వనరులను వినియోగిస్తున్నారని ది ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి నిజాముద్దీన్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వక్ఫ్ సంస్థల ఆదాయం ప్రధానంగా సంబంధిత సంస్థల అభివృద్ధి, నిర్వహణ, ఉరుసు, గంధ మహోత్సవాల నిర్వహణకు వినియోగించాలి. ఈ ఖర్చులు పూర్తయ్యాక డబ్బులు మిగిలితేనే, ముతవల్లి లేదా మేనేజ్మెంట్ కమిటీ ప్రతిపాదనతో, బోర్డు తీర్మానం ద్వారా ఇతర ఖర్చులకు మళ్లించాలి. కానీ అబ్దుల్ అజీజ్ ఈ విధానాన్ని పక్కనబెట్టి, ముతవల్లిలపై ఒత్తిడి తెచ్చి, వక్ఫ్ సంస్థల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
వక్ఫ్ బోర్డు ఉద్యోగుల జీతాలకు మాత్రమే సరిపోతున్న ఆదాయాన్ని, ప్రజాసేవ పేరుతో ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకే మళ్లించడం అసలు లక్ష్యానికి వ్యతిరేకమని, ఇది ముస్లిం సమాజానికి మోసం చేయడమేనని నిజాముద్దీన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.