న్యూఢిల్లీ: నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారతీయ వైమానిక దళ పైలెట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు వీర్ చక్ర అవార్డును అందజేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అభినందన్ ఆ అవార్డును స్వీకరించారు. 2018, మే 19వ తేదీ నుంచి మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్‌లో అభినందన్ విధులునిర్వర్తిస్తున్నారు. అయితే 2019, ఫిబ్రవరి 27వ తేదీన.. ఎల్వోసీ వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16, ఎఫ్-17 యుద్ధ విమానాలను అభినందన్ గమనించాడు. తన వద్ద ఉన్న రేడార్‌తో శత్రు దేశ విమానాల రాకను పసికట్టాడు. అయితే ముప్పు ఉందని గ్రహించిన అభినందన్.. చాలా సాహసోపేతంగా, ఎంతో చాకచక్యంగా తన వద్ద ఉన్న మిస్సైల్‌తో ఎఫ్-16ను కూల్చేశాడు. బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే.
మేజర్ విభూతి శంకర్ దౌండియాల్‌కు మరణానంతరం శర్య చక్ర అవార్డును ప్రదానం చేశారు. శంకర్ దౌండియాల్ సతీమణి లెఫ్టినెంట్ నితిక కౌల్, ఆయన తల్లి సరోజ్ దౌండియాల్‌కు ఈ అవార్డును అందుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఆపరేషన్‌లో అయిదుగురు ఉగ్రవాదులను హతం చేసి, 200 కేజీల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో A++ క్యాటగిరీ ఉగ్రవాదిని హతమార్చిన నాయిబ్ సుబేదర్ సోంబేర్‌కు మరణానంతరం శౌర్య చక్రను ఇచ్చారు. ఆయన భార్య, తల్లి ఆ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని చంపిన ప్రకాశ్ జాదవ్‌కు మరణానంతరం కీర్తి చక్రను ప్రదానం చేశారు.