Suryaa.co.in

Andhra Pradesh

ఏఐ అవకాశాల వినియోగంతో శరవేగంగా ఏపీ అభివృద్ధి

– ప్రతి వందరోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేస్తున్నాం
– పి-4 విధానాల అమలుతో పేదరిక నిర్మూలనకు కృషి!
– శాన్ ఫ్రాస్సిస్కో పారిశ్రామికవేత్తల సమావేశంలో మంత్రి లోకేష్

శాన్ ఫ్రాన్సిస్కో: వై2కె బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఐటి శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి నారా లోకేష్… ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు.

భారత్ లో రాబోయే పాతికేళ్లలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి, పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించేందుకు తాము కృషిచేస్తున్నట్టు తెలిపారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలో తమలాంటి యువ నాయకత్వం చురుగ్గా పనిచేస్తోందని, మంత్రివర్గంలో 17మంది కొత్తవారే ఉన్నారని తెలిపారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు విజనరీ సీఎం చంద్రబాబునాయుడు సరికొత్త పి-4 విధానానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధికి ప్రతి వందరోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నామని చెప్పారు.

విద్యావ్యవస్థలో మార్పులు
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మానవ వనరులను అందించడానికి, తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విద్యారంగంలో కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. నవీన ఆవిష్కరణల కోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ రీసెర్చి సెంట్రిక్ గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా కేజీ టు పీజీ పాఠ్యాంశాల్లో మార్పులు చేయనున్నట్టు మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామివేత్త ప్రవీణ్ అక్కిరాజు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

ఎన్ విడియా వైస్ ప్రెసిడెంట్ రామ అక్కిరాజు, విప్రో ప్రెసిడెంట్ నాగేంద్ర బండారు, న్యూటానిక్స్ ప్రెసిడెంట్ రాజీవ్ రామస్వామి, దేవ్ రేవ్ సిఇఓ ధీరజ్ పాండే, గ్లీన్ సంస్థ సిఇఓ అరవింద్ జైన్, నెక్సస్ వెంచర్స్ ఎండి జిష్ణు భట్టాచార్య, సిస్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిచంద్ర, సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని, స్పాన్ ఐఓ సిఇఓ ఆర్చ్ రావు, మిహిరా ఎఐ సిఇఓ రాజా కోడూరి, ఇవాంటి చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ముక్కామల, హిటాచీ వంటారా సిఓఓ ఆశిష్ భరత్, గూగుల్ క్లౌడ్ జనరల్ మేనేజర్ సుని పొట్టి, వెస్ట్రన్ డిజిటల్ సిఐఓ శేషు తిరుమల, ఈక్వెనిక్స్ గ్లోబల్ ఎండి కెజె జోషి, త్రీడి గ్లాస్ సొల్యూషన్ సిఇఓ బాబు మండవ, పారిశ్రామికవేత్తలు వంశీ బొప్పన, రాజీవ్ ప్రతాప్, సతీష్ మంత్రి ప్రగడ, సతీష్ తాళ్లూరి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE