మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం
అమరావతి: వైద్యారోగ్య శాఖ పరిథిలో జరిగే సాధారణ బదిలీల్లో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు మినహాయింపులిచ్చే విషయంపై స్పష్టత ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల సాధారణ బదిలీల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈ అంశంపై లెక్కలు తేల్చాలని ఆయన కోరారు.
మంత్రిత్య శాఖ పరిథిలో ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో నియమాల మేరకు 7,100కి పైగా వివిధ స్థాయిల్లో వైద్యులు, అధికారులు, ఇతర సిబ్బంది బదిలీ అయ్యారు. బదిలీల ప్రక్రియలో భాగంగా 800కి పైగా సిబ్బంది వారివారి స్థానాల్లో కొనసాగారు. ఇందులో సింహ భాగంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమతమ స్థానాల్లో కొనసాగుతున్నారు. జిఎడి మార్గదర్శాల ప్రకారం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఒకే చోట 9 సంవత్సరాలు కొనసాగవచ్చు. ఈ సాకుతో వారు ఒకే చోట సుదీర్ఘకాలంపాటు కొనసాగడంపై పలు అభ్యంతరాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో ఈ విషయంపై అమలులో ఉన్న నియమాలు, మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఇవి దుర్వినియోగం కాకుండా చూసేందుకు తగు ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రి సత్యకుమార్ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.
సాధారణ పాలనా శాఖ(జిఎడి) గుర్తింపు పొందిన 6 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సాధారణ బదిలీలనుంచి వివిధ స్థాయిల్లో మినహాయింపు పొందారు. కార్మిక చట్టాల పరిథిలో పనిచేసే కొన్ని ట్రేడ్ యూనియన్లు కోర్టు ద్వారా తమ ప్రతినిధులకు మినహాయింపు పొందాయి. వీరికి మినహాయింపు అర్హత లేదని ఒక వాదన ఉంది.
వైద్యారోగ్య శాఖ పరిథిలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో వేలాది మంది రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తారు. ఈ మూడు స్థాయిల్లో పలు సంఘాల ప్రతినిధులకు మినహాయింపు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురవడంతో ఇతర సిబ్బంది నుండి తీవ్ర అభ్యంతరాలు వెల్లడైయ్యాయి.
గుర్తింపు పొందిన సంఘాల ప్రతినిధులకు 9 సంవత్సరాల మినహాయింపును ఇచ్చే విషయంలో వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మినహాయింపును ఒకే విడతలో ఇవ్వాలా, వేరువేరు కాలాల్లో అన్వయించాలా అన్న అంశంపై స్పష్టత కొరవడడంతో…దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు ప్రతినిధులు 15-20 సంవత్సరాల పాటు ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. తదుపరి సాధారణ బదిలీల్లో ఈ విషయంపై స్పష్టమైన విధానాన్ని అవలంబించడానికి తగు ప్రతిపాదనల్ని రూపొందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
పలు సంఘాలు బదిలీల నుంచి తమ ప్రతినిధులకు మినహాయింపులు కోరుతున్న నేపథ్యంలో ఈ కింది అంశాలపై స్పష్టత రూపొందించాలని మంత్రి కోరారు:
1. జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో ఎన్ని సంఘాల ప్రతినిధులకు మినహాయింపు ఇవ్వాలి?
2. అట్టి మినహాయింపులపై ఎటువంటి పరిమితులు విధించవచ్చు?
3. ప్రతి కార్యాలయంలో అన్ని సంఘాల ప్రతినిధులకు మినహాయింపు ఇవ్వాల్సి ఉంటే, దాని పరిణామాలేమిటి?
4. గతంలో వైద్యారోగ్య శాఖ పరిథిలోని ఈ మినహాయింపులపై ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలిచ్చింది? అవి సక్రమంగా అమలవుతున్నాయా?
5. ఏస్థాయి ప్రతినిధులకు బదిలీల నుండి మినహాయింపు ఇవ్వొచ్చు?
6. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో పనిచేసే వివిధ కార్యాలయాల్లో అన్ని సంఘాల ప్రతినిధులకు మినహాయింపు విషయాన్ని ఏవిధంగా క్రమబద్ధీకరించవచ్చు?
7. ఉద్యోగ సంఘాల నిర్వహణ నియమాల స్ఫూర్తికి అనుగుణంగా మినహాయింపులను హేతుబద్ధంగా ఎలా చేపట్టాలి?