– విదేశాల్లో భారత విద్యార్థుల సమస్యల ప్రస్తావన
విజయవాడ: ప్రముఖ విద్యావేత్త, సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ శనివారం విజయవాడ రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, మాననీయ ఎస్. అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆచార్య లక్ష్మీ ప్రసాద్ పలు కీలక అంశాలను గవర్నర్‌కి వివరించారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన నూతన విధాన మార్పులు భారత విద్యార్థులకు సమస్యగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కులను కాపాడటానికి విద్యా, దౌత్యా రంగాల సమన్వయంతో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని గవర్నర్‌కు వివరించారు.
అమెరికాలో తన పర్యటనలో భాగంగా యునైటెడ్ నేషన్స్‌లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరిష్‌ను కలసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత భాషల అంతర్జాతీయ ప్రాధాన్యత, భారత విద్యార్థుల సంక్షేమం తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలిపారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తొలిసారి తెలుగు వ్యక్తిగా ఎన్నికైన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (బాబీ) ఘన విజయాన్ని గవర్నర్‌కి వివరించారు. ఇది ప్రపంచ తెలుగు సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు.
అమెరికాలోని తెలుగు భాషా అభివృద్ధికి కృషిచేస్తున్న యూనివర్శిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌తో తన సమావేశ వివరాలను కూడా గవర్నర్ తో పంచుకున్నారు.
హిందీని ఐక్యరాజ్యసమితిలో అధికారిక భాషగా గుర్తించే దిశగా తాను చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్‌కి వివరించారు. ఆచార్య లక్ష్మీ ప్రసాద్ హిందీ, తెలుగు భాషల అభివృద్ధికి దేశంలోనే కాదు విదేశాల్లోనూ చేస్తున్న సేవలను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. భాషా, విద్యా రంగాలలో వారి యత్నాలకు తన సంపూర్ణ మద్దతు అందిస్తానని హామీ ఇచ్చారు