Suryaa.co.in

Telangana

అసెంబ్లీలో పాఠశాల విద్య, ఉపాధ్యాయుల సమస్యలు ప్రస్తావించండి

– సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఉపాధ్యాయ సంఘాల నాయకుల వినతి

వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాల విద్య, ఉపాధ్యాయుల సమస్యలు, సాధారణ బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ గురించి ప్రస్తావించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని సి ఎల్ పి నేత భట్టి విక్రమార్కకు సోమవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు అసెంబ్లీలో వినతి పత్రం అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోతో వేలాది మంది ఉద్యోగులు స్థానికతను కోల్పోయారని, భార్య భర్తలకు ఒకే చోట ఉద్యోగం కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. 2020 ఏప్రిల్ నుండి సర్వీస్ పర్సన్స్ నియామకం లేక పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారిందని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలకు పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత అప్పగించినట్లు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలోఎక్కడ అమలు కావడం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు సీఎల్ఫీ నేతకు వివరించారు.

ఉన్నత పాఠశాలలో వేలాది సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రాథమిక పాఠశాలలో కూడా సరిపడినంత ఉపాధ్యాయులు లేరని, పైగా వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు డిప్యూటేషన్ పై పంపడం వలన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి తేవాలని కోరారు.

2004 సెప్టెంబర్ తర్వాత నియామకమైన ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రాష్ట్రంలో రద్దుచేసి దేశవ్యాప్తంగా రద్దు కోసం కేంద్రంపై పోరాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేయాలన్నారు.

ఉపాధ్యాయులకు 4ఏండ్లుగా బదిలీలు, ఏడు సంవత్సరాలుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారులు పోస్టులు భర్తీ కాక విద్యాశాఖలో తీవ్ర సంక్షోభం నెలకొన్నదని వారు వివరించారు. 2021 మార్చి 22న మరియు 2022 మార్చ్ 10 తేదీల్లో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని, విద్యా శాఖ మంత్రి కూడా వేసవి సెలవుల్లో బదిలీలు చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు షెడ్యూల్ విడుదల కాలేదని, ఇవే కాకుండా పాఠశాల విద్యా రంగంలో ఉన్న సమస్యలన్నిటిని అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం చొరవ చూపాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కే జంగయ్య, వై అశోక్ కుమార్, రఘు శంకర్ రెడ్డి , పోచయ్య , షేక్ షౌకత్ అలీ డి సైదులు, ఎం రవీందర్, ఎస్ హరి కిషన్, ఎన్ యాదగిరి తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE