– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పెడన : ఆక్వా రైతులకు రక్షణగా వారికి ఎలాంటి విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా, విమానాశ్రయ భవిష్యత్తు అవసరాలకు ముందస్తు ప్రణాళిక బద్ధంగా కృష్ణాజిల్లా పెడన, గన్నవరంలలో అధునాతన విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఏపీలోని పలు విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రు.48.64 కోట్లతో పెడన 132 కేవి విద్యుత్ స్విచ్చింగ్ కేంద్రం నిర్మాణానికి, మరియు రు.30.65 కోట్లతో 11/132 కెవి గన్నవరం (ఎయిర్ పోర్ట్ ) విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి తోటమూల విద్యుత్ ఉపకేంద్ర ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అమరావతి నుండి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కృష్ణా జిల్లాలో 2 సబ్ స్టేషన్ల ఏర్పాటు వల్ల నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించేందుకు వీలవుతుందన్నారు.
ఈ సంద్భంగా జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ పెడన, గన్నవరంలలో విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు, వాటి ప్రయోజనాలు ముఖ్యమంత్రికి వివరిస్తూ ఇంతకుముందు మచిలీపట్నం- పామర్రు ఎక్కువ దూరం పవర్ ట్రాన్స్మిషన్ వల్ల పెడన ప్రాంతంలో ఓల్టేజ్ సమస్యలు ఏర్పడేవన్నారు. పెడన ప్రాంతంలో4 వేల మంది ఆక్వా రైతులు ఉన్నారని, లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోయి విద్యుత్తు సమస్యలు ఎదుర్కొనే వారని అన్నారు.
132 కేవి పెడన స్విచ్చింగ్ స్టేషన్ ఏర్పాటు వల్ల లో వోల్టేజ్ సమస్యలు తొలగి పోవడంతోపాటు, 54 వేల ఇళ్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతామని అన్నారు. రానున్న రోజుల్లో మచిలీపట్నం పోర్టు, ఇండస్ట్రియల్ విద్యుత్ అవసరాలకు ఈ సబ్ స్టేషన్ వల్ల ఎంతో ఉపయోగం ఉందన్నారు.
గన్నవరం 132 కె.వి సబ్స్టేషన్ ఏర్పాటుతో 3 మండలాల్లో 3.5 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ విమానాశ్రయంకు ఒక ఫీడర్ కేటాయించడంతో విద్యుత్ సమస్య లేకుండా ముందుగా ప్లాన్ చేయడం హర్షనీయమన్నారు.
అంతే కాకుండా వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేయగలుగుతామన్నారు. ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్రణాళికాబద్ధంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించడం ఈ ప్రాంతంలో విద్యుత్ రంగానికి మహర్దశ అని అన్నారు.
పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలో 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుకు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన మండలాలకు లో వోల్టేజీ సమస్యల ఇబ్బందులు తొలగుతాయన్నారు.
అనంతరం రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెడనలో గన్నవరంలో విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు వల్ల రైల్వే లైను విద్యుత్ సరఫరాకు, రాబోయే బందరు పోర్టు విద్యుత్ అవసరాలకు, భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సిపిడిసిఎల్ ఎస్ఇ సత్యానందం, ఏపీ ట్రాన్స్కో ఎస్ఇ భాగ్యరాజ్, నడుపూరు సర్పంచ్ చీర్ల అనూష, స్థానిక నాయకులు విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.